Andhra Pradesh Intermediate Results 2025
Andhra Pradesh Intermediate Results 2025 : ఆంధ్ర ప్రదేశ్ లోని లక్షలాది మంది యువతీయువకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేసారు. ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 10.5 లక్షలమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసారు. మార్చి 1 నుండి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇలా పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోపే మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలను వెల్లడించారు. ఇందుకోసం ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ పక్కా ప్రణాళికతో పనిచేసింది.
ఇంటర్ పరీక్షలు రాసిర విద్యార్థులు ఆన్ లైన్ లో https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ నుండి తమ రిజల్ట్ తెలుసుకోవచ్చు. లేదంటే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మరికొన్ని వెబ్ సైట్స్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
Andhra Pradesh Intermediate Results 2025
ఇంటర్ ఫలితాల్లో పదేళ్ల రికార్డ్ బ్రేక్ :
తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రికార్డులు బద్దలుగొట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా విద్యాశాఖమంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం 47 శాతం, రెండో సంవత్సరం 69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత పదేళ్లలో ఈ స్థాయిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పాస్ పర్సంటేజ్ నమోదయ్యింది లేదన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ జనరల్ ఫస్ట్ ఇయర్ లో 50314 మంది పరీక్ష రాస్తే 23799 మంది ఉత్తీర్ణత సాధించారు... అంటే ఉత్తీర్ణ శాతం 47. అదే సెకండ్ ఇయర్ లో 39783 మంది పరీక్ష రాస్తే 27276 మంది ఉత్తీర్ణులయ్యారు... అంటే ఉత్తీర్ణత శాతం 69. ఇందులో ఫస్ట్ ఇయర్ లో 39 శాతం అబ్బాయిలు, 55 శాతం అమ్మాయిలు పాసయ్యారు. అదే సెకండ్ ఇయర్ లో 62 శాతం అబ్బాయిలు, 74 శాతం అమ్మాయిలు పాసయ్యారు.
ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ చదివేవారిలో ఫస్ట్ ఇయర్ పరీక్షలు 16229 మంది రాస్తే 10387 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 64. అదే సెకండ్ ఇయర్ లో 13702 మంది పరీక్ష రాస్తే 11184 మంది పాసయ్యారు. ఇది 82 శాతం ఉత్తీర్ణత. వీరిలో ఫస్ట్ ఆయర్ అబ్బాయిలు 52 శాతం, అమ్మాయిలు 77 శాతం, సెకండ్ ఇయర్ అబ్బాయిలు 73, అమ్మాయిలు 90 శాతం పాసయ్యారు.
మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల పాస్ పర్సంటేజ్ తీసుకున్నా గత పదేళ్లలో ఇదే అత్యుత్తమం అని లోకేష్ తెలిపారు. ఈసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉత్తీర్ణత శాతం 70 కాగా సెకండ్ ఇయర్ లో అయితే ఏకంగా 83 శాతం. గత పదేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈస్థాయిలో ఎప్పుడూ ఫలితాలు రాలేవని లోకేష్ తెలిపారు.
Nara Lokesh
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అత్యుత్తమ రిజల్ట్స్ కు కారణమిదే : నారా లోకేష్
ఈసారి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం కల్పించిన మౌళిక సదుపాయాలతో పాటు బోధనా ప్రమాణాలను పెంచడమే ఈ అత్యుత్తమ పలితాలకు కారణమన్నారు నారా లోకేష్. ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించిందో ఎక్స్ వేదికన వివరించారు లోకేష్.
1. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్స్ అందించామని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా వీటిని అందించామని తెలిపారు.
2. జూనియర్ కాలేజీ విద్యార్థులకు మద్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం) పథకాన్ని ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించాం. దీనిద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉచిత భోజనం అందించామని తెలిపారు.
3. 2024 లో 217 మంది ప్రిన్సిపల్స్ కి ప్రమోషన్ ఇచ్చాం. ఐదేళ్ల విరామం తర్వాత ఈ పదోన్నతులు లభించాయి.
4. ప్రతినెలా విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించాం. అందులో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ప్రతిభను గుర్తించాం. వెనకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ద పెట్టి పరీక్షలకు సిద్దం చేసామని లోకేష్ తెలిపారు.
5. జూనియర్ కాలేజీల టైమింగ్ ను పెంచాం. గతంలో ఉదయం 9.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు నడిచేవి. దీన్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు పెంచాం. దీంతో విద్యార్థులకు చదువుకునేందుకు మరింత సమయం దొరికిందని లోకేష్ తెలిపారు.
6. 100 రోజుల సక్సెస్ ప్రోగ్రాం నిర్వహించాం. ఇందులో విద్యార్థులను ఎ,బి, సి గ్రూపులుగా విభజించాం. కేటగిరీల ఆధారంగా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం. చదువులో కాస్త వెనకబడిన బి, సి కేటగిరి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్స్ రూపొందించి అందించాం.
7. మూడుసార్లు PTM (పేరెంట్స్, టీచర్ మీటింగ్) నిర్వహించాం. వారి పిల్లల చదువు గురించి తెలియజేసి ప్రోగ్రెస్ కార్డులు అందించాం.
8. క్లాసుల వారిగా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎప్పటికప్పుడు ఎంత సిలబస్ కవర్ చేసామో తెలియజేసాం.
9. కాలేజీ ఫలితాల ఆధారంగా జూనియర్ లెక్చరర్లను నియమించాం. వారిని మరింత మెరుగైన ఫలితాలు తీసుకువచ్చేలా ప్రోత్సహించాం.
10. కేర్ టేకర్ సిస్టమ్ ను అమల్లోకి తెచ్చాం. అంటే ప్రతి జెఎల్ పది మంది విద్యార్థుల బాధ్యతను అప్పగించాం. వారి అటెండెన్స్ మరియు పలితాల బాధ్యతను ఈ జెఎల్స్ కే అప్పగించాం.