AP DSC 2025
డీఎస్సీకి సంబంధించి రోజుకో అప్‌డేట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇటీవల డీఎస్సీ దరఖాస్తుల విధానంలో కూడా పలు మార్పులు చేశారు. ఏ, బీలుగా దరఖాస్తులను వేరుచేసి వివరాలు సేకరించనున్నారు. అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్‌జేసీ, సంక్షేమశాఖల యాజమాన్యాల ఎంపికకు దరఖాస్తు సమయంలోనే ఆప్షన్స్ ఇవ్వాలని అధికారులు తెలిపారు. ఇక దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్-బీలో సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పించనున్నారు.
అభ్యర్థులు పదో తరగతి నుంచి బీఈడీ వరకు ఉన్న అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని ప్రకటించారు. అయితే.. ఇప్పటికే అనేకమంది అభ్యర్థుల సర్టిఫికేట్లు కళాశాలలోనే ఉన్నాయి. అయితే.. ప్రక్రియను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా అధికారులు ఈ విధానం తీసుకొస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి, యాజమాన్యాలకు ఆప్షన్లు, సర్టిఫికెట్ల పరిశీలన జరిగేవి. దీనివల్ల ప్రభుత్వానికి న్యాయ సమస్యలు రావడం వల్ల వివాదాలు తలెత్తుతుతున్నాయని అధికారులు గుర్తించారు. దీంతో పలు మార్పులు చేశారు. అభ్యర్థులకు ఎంపిక చేసిన ఆప్షన్స్ ప్రకారం పోస్టింగ్‌లను ఇవ్వనున్నారు.
తాజాగా డీఎస్సీ అభ్యర్థుల వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 సంవత్సరాలు గరిష్టంగా ఉండగా.. రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అనేక మంది పరీక్షకు అర్హత సాధించనున్నారు. ఇక వయోపరిమితి ఉన్న వారికి గత ఏడాది జూన్ 1వ తేదీ కటాఫ్ డేట్‌గా నిర్ణయించారు.
school teacher
ప్రస్తుతం పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేలోపు ఖాళీలు ఎన్ని ఉన్నాయో గుర్తించి ఆ మేరకు పోస్టులను భర్తీ చేయనున్నారు. వాస్తవానికి జీవో నంబర్ రద్దు చేసి, పాఠశాలల విలీన ప్రక్రియ నిలిపివేస్తే ఉపాధ్యాయులు మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మోడల్ స్కూళ్లు తీసుకురావడంతో ఆయా పాఠశాలల్లో త్వరలో ఇచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అవసరం లేని చోట పోస్టులను తొలగించి, పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పు చేయనున్నారు. మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోనున్నారు. ఆ తర్వాతే బదిలీలు, సర్దుబాటు చేపడతారు. వచ్చే నెల చివరికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్ కింద భర్తీ చేపడతారు. ఇక డీఎస్సీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించగా.. మరోసారి నిర్వహించమని అధికారులు తెలిపారు.