ఏపీకి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. విశాఖ సీఐఐ సదస్సులో చంద్రబాబు కీలక ప్రకటన

Published : Nov 12, 2026, 08:17 PM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ వివరాలు వెల్లడించారు.

PREV
15
పరిశ్రమలకు ప్రాధాన్యం.. కీలక రంగాల్లో భారీ ప్రణాళికలు

విశాఖపట్నం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని విదేశీ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక కొత్త రంగాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.

రేర్ ఎర్త్ మాగ్నెట్స్, ఉక్కు తయారీ, సోలార్ వేఫర్స్, సౌర విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. క్రిటికల్ మినరల్స్, స్టీల్, సోలార్, సెమీకండక్టర్, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ రంగాలకు సంబంధించి ప్రత్యేక మిషన్లు, విధానాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు అంతరిక్ష రంగంలోనూ ముందుకు వెళ్లేందుకు స్పేస్ విజన్ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే తయారయ్యే క్వాంటం పరికరాలకు 'మేడ్ ఇన్ అమరావతి' గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.

25
డ్రోన్ సిటీ ఏర్పాటు.. ఏపీని హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం

పౌర అవసరాలతో పాటు రక్షణ రంగానికి ఉపయోగపడే డ్రోన్ల తయారీని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల సహాయంతో మందులు చేరవేస్తున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతికతను ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పెట్టుబడులను ఆకర్షించి, ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ హార్టీకల్చర్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25 సెక్టోరల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తిరుపతిని ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కొత్త టెక్నాలజీ ఆధారిత సంస్థలకు రాష్ట్రంలో అవకాశాలు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు.

35
పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు.. కియా, ఎల్జీ ప్రాజెక్టుల ఉదాహరణ

పెట్టుబడులను ఆకర్షించడంలో అనుమతుల ప్రక్రియ కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సాధారణంగా అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితికి స్వస్తి పలికి, వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఈ విధానానికి కియా కార్ల తయారీ పరిశ్రమ మంచి ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. అలాగే ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమిని కేటాయించినట్లు వెల్లడించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ కూడా 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమైందని తెలిపారు. ఇవన్నీ రాష్ట్రంలో పరిశ్రమలకు కల్పిస్తున్న వేగవంతమైన అనుమతుల విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల ద్వారా అందించాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. ఈ విధానం సదస్సు ప్రారంభమైన రోజే అమల్లోకి వస్తుందని చెప్పారు. దీంతో పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు అందడంలో పారదర్శకత, నమ్మకం పెరుగుతాయని వివరించారు.

45
అమరావతికి గ్లోబల్ గుర్తింపు.. పోర్టులు, రహదారులతో మెరుగైన కనెక్టివిటీ

అమరావతిని అత్యాధునిక సాంకేతికతతో కూడిన బ్లూ-గ్రీన్ సిటీగా నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఐకానిక్ భవనాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తలు అమరావతిని తమ రెండో నివాసంగా భావించాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆరు ఆపరేషనల్ పోర్టులు, విమానాశ్రయాలు, హైస్పీడ్ రైలు నెట్‌వర్క్, విస్తృతమైన రహదారి సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ఇవి రాష్ట్రాన్ని లాజిస్టిక్స్, ఎగుమతులు, పారిశ్రామిక కార్యకలాపాలకు అనువైన ప్రాంతంగా మారుస్తున్నాయని చెప్పారు.

గోదావరి నది జలాలను ఇతర ప్రాంతాలకు తరలించేలా నదుల అనుసంధానంపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. గోదావరి కుడి, ఎడమ కాలువల ద్వారా విశాఖపట్నం, అమరావతికి నీటిని అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా ఐదు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాకు ఉన్న గ్రిడ్ తరహాలోనే నీటి పంపిణీకి కూడా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు, పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

55
ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్.. పెట్టుబడిదారులకు చట్టపరమైన భరోసా

పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ కారణాలతో పెట్టుబడిదారులు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఈ విధానం దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అనుమతులు రియల్‌టైమ్‌లో అందించే విధానాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జన్ విశ్వాస్ పిలుపునకు అనుగుణంగా ప్రజలు, పారిశ్రామికవేత్తల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

యాక్సెస్ టు ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని సీఎం వెల్లడించారు. సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతికతతో ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పారిశ్రామిక ప్రతినిధులకు స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories