ఇక హైద‌రాబాద్ వెళ్లాల్సిన ప‌నిలేదు.. రూ. 2 వేల కోట్ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యాధునిక ఆసుప‌త్రి

Published : Sep 03, 2026, 04:11 PM IST

Andhra Pradesh: విశాఖపట్నం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ఇప్ప‌టికే ఐటీ, విద్యా రంగాల్లో దూసుకెళ్తున్నవిశాఖలో ప్రముఖ వైద్య సంస్థ ఏఐజీ హాస్పిటల్స్ భారీ హెల్త్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ హాస్పిట‌ల్ వివ‌రాలు.

PREV
15
రూ.2 వేల కోట్లతో వెయ్యి పడకల ఆసుపత్రి

ఎండాడ ప్రాంతంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇటీవ‌ల శంకుస్థాప‌న చేశారు. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ క్యాంపస్ పూర్తయితే అత్యాధునిక వైద్య సేవలు విశాఖలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం తీవ్రమైన, సంక్లిష్ట ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలను ఆశ్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆసుపత్రి భవనాల నిర్మాణంతో పాటు వైద్య సేవలు, పరిశోధన, శిక్షణ, అనుబంధ ఆరోగ్య సదుపాయాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆసుపత్రిలో మొత్తం 1,000 పడకలు ఉండనున్నాయి. రోజుకు దాదాపు 5 వేల మంది రోగులకు ఓపీ సేవలు అందించే విధంగా మౌలిక వసతులను రూపొందిస్తున్నారు. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు, ఐసీయూ, డయాగ్నస్టిక్ సేవలు, వివిధ ప్రత్యేక వైద్య విభాగాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఆసుపత్రి కోసం సుమారు 9 ఎకరాల స్థలాన్ని వినియోగించనుండగా.. మరో 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఆసుపత్రి నిర్మాణం రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో టవర్-ఏ, టవర్-బి నిర్మించి 650 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ దశను 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో టవర్-సి నిర్మాణం చేపట్టి మరో 350 పడకలు జోడించనున్నారు.

25
50కి పైగా వైద్య విభాగాలు.. 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్

విశాఖ ఏఐజీ ఆసుపత్రిని సాధారణ చికిత్సలకే పరిమితం కాకుండా బహుళ వైద్య విభాగాలతో కూడిన సమగ్ర ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో 50కి పైగా స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో ఉన్న వైద్య నైపుణ్యం, సేవల నమూనాను విశాఖ క్యాంపస్‌లోనూ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఒకే చోట పనిచేయడం వల్ల సంక్లిష్ట కేసుల్లో మల్టీ డిసిప్లినరీ విధానంలో చికిత్స అందించే అవకాశం ఉంటుంది.

మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మాతా శిశు విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించేలా అవసరమైన సాంకేతిక సదుపాయాలు, వైద్య నిపుణులను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వైద్య సేవల్లో ఏఐజీకి ఉన్న ప్రత్యేక అనుభవం కొత్త క్యాంపస్‌కు బలంగా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ యూనిట్లలో ఒకటి ఏఐజీ వద్ద ఉండటంతో ఈ విభాగంలో సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

35
నర్సింగ్, పారామెడికల్ విద్యకు పెద్దపీట

ఏఐజీ విశాఖ ప్రాజెక్టులో ఆసుపత్రి సేవలతో పాటు వైద్య విద్య, శిక్షణకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. 2.5 ఎకరాల్లో నిర్మించనున్న నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులు, శిక్షణా సదుపాయాలతో పాటు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. ఆసుపత్రితో అనుసంధానంగా నర్సింగ్ విద్య కొనసాగడం వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం పొందే అవకాశం ఉంటుంది. ఆసుపత్రి వాతావరణంలోనే శిక్షణ పొందడం ద్వారా భవిష్యత్ వైద్య సేవలకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవచ్చు.

ఇదే విధంగా పారామెడికల్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. డయాగ్నస్టిక్స్, టెక్నికల్ సర్వీసులు, ఇతర అనుబంధ ఆరోగ్య విభాగాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. వైద్య రంగంలో నిరంతర శిక్షణ, సదస్సులు, అకడమిక్ కార్యక్రమాల కోసం 500 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మించనున్నారు. వైద్యులు, నర్సులు, విద్యార్థులు, పరిశోధకులకు ఇది ఉపయోగపడనుంది.

45
రీసెర్చ్, ఏఐ సెంటర్‌తో ఆధునిక వైద్యానికి బలం

విశాఖ క్యాంపస్‌లో చికిత్సతో పాటు వైద్య పరిశోధనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేక రీసెర్చ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్య రంగంలో వినియోగించేందుకు ఏఐ సెంటర్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. రోగ నిర్ధారణలో ఆధునిక పద్ధతులు, క్లినికల్ రీసెర్చ్, కొత్త వైద్య విధానాల అభివృద్ధి వంటి అంశాల్లో ఈ కేంద్రాలు కీలకంగా పనిచేయనున్నాయి. తద్వారా విశాఖ కేవలం చికిత్స అందించే నగరంగా కాకుండా వైద్య పరిశోధనకు కూడా ఒక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకులు, బంధువులకు తక్కువ ఖర్చుతో వసతి కల్పించేందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. విజిటింగ్ ఫ్యాకల్టీ, వైద్యుల కోసం కూడా వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి.

55
9 వేల ఉద్యోగాలు.. విశాఖకు మెడికల్ హబ్ గుర్తింపు

ఏఐజీ హాస్పిటల్స్ ప్రాజెక్టు విశాఖ ఆరోగ్య రంగంతో పాటు ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపనుంది. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 9 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా. వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులతో పాటు ఆసుపత్రికి అనుబంధ సేవల్లోనూ అవకాశాలు ఏర్పడనున్నాయి.

ఆసుపత్రి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 1,000 మంది వైద్యులు సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యులు ఒకే క్యాంపస్‌లో పనిచేయడం వల్ల సంక్లిష్ట ఆరోగ్య సమస్యలకు సమగ్ర చికిత్స అందించే అవకాశం పెరుగుతుంది.

ఏఐజీ హాస్పిటల్స్‌కు మూడు దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో అనుభవం ఉంది. హైదరాబాద్‌లో సంస్థకు మూడు యూనిట్లు ఉండగా.. 1,400కు పైగా పడకలు, 350కి పైగా ఐసీయూ పడకలు, 600కు పైగా వైద్యులు, హెల్త్ కేర్ నిపుణులతో సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించిన అనుభవం సంస్థకు ఉంది.

విశాఖలో ఇంత పెద్ద స్థాయిలో వైద్య సంస్థ ఏర్పాటు కావడం వల్ల నగరానికి మెడికల్ హబ్‌గా ఎదిగే అవకాశాలు మరింత బలపడనున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువుల అవసరాలతో హోటళ్లు, రవాణా, ఆహారం, వసతి, ఇతర సేవా రంగాల్లోనూ వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరగవచ్చు. ఐటీ, పరిశ్రమలు, విద్య, పర్యాటకం, ఆరోగ్యం వంటి రంగాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.

Read more Photos on
click me!

Recommended Stories