ముద్దుల కూతురు కోరితే కాదంటారా... ఆద్యకు పవన్ కల్యాణ్ ఏం కొనిచ్చారో తెలుసా?

First Published | Sep 20, 2024, 8:18 PM IST

ప్రజలు కోరితేనే కాదనకుండా పనులు చేసిపెడుతున్న ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కన్న కూతురు ముచ్చటపడి ఏదయినా కావాలంటే కాదనగలరా? ఇలా కూతురు ఆద్య ముచ్చటతీర్చేందుకు పవన్ ఏం కొన్నారో తెలుసా? 

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కల్యాణ్ ... తెలుగు రాష్ట్రాల్లో మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న పేరు. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, డిప్యూటీ సీఎంగారి తాలూకా అంటూ మెగా అభిమానులే కాదు సామాన్య ప్రజలు గర్వంగా చెప్పుకునేలా పవన్ తీరు వుంది. రాజకీయాలు అనగానే అదో బురద ... అందులోకి దిగితే అంతా కంపే అనే అభిప్రాయం చాలామందికి వుంది. అలాంటివారితో కూడా నాయకుడంటే ఇలా వుండాలి అని పవన్ అనిపించుకుంటారు. రాజకీయ నాయకుడిగానే కాదు పాలకుడిగా ఆయన నిర్ణయాలు సోకాల్డ్ రాజకీయాలకు భిన్నంగా వుంటున్నాయి. అందువల్లే సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ పవనిజం పాకిపోతోంది. 
 

Pawan Kalyan

సొంత డబ్బులతో ప్రజాసేవా..! 

ఒకప్పుడు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తున్నారంటే ప్రజాసేవ చేయాలనో, సుపరిపాలన అందించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుకునేవారు. కానీ నేటి రాజకీయాలు అలాకాదు... కేవలం సంపాదన కోసమే నాయకులుగా మారుతున్నవారే ఎక్కువమంది. బడాబాబులు, వ్యాపారవేత్తలు డబ్బులు వెదజల్లి రాజకీయాల్లోకి వస్తున్నారంటనే అర్థం చేసుకోవచ్చు పక్కా సంపాదన కోసమే వాళ్లు ఈ పని చేస్తున్నారని. దీంతో రాజకీయాలన్నా, నాయకులన్నా ప్రజల్లో ఓ దురభిప్రాయం ఏర్పడింది.  

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ కూడా అందరు నాయకుల్లాగే వుంటారని చాలామంది భావించారు. కానీ సినిమాల్లోనే కాదు రాజకీయాలు, పాలనలోనూ తాను హీరోనే అని ఆయన నిరూపించుకుంటున్నారు. పదేళ్ళపాటు రాజకీయాల్లో పోరాటమైనా... అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలైనా... ఆయన అందరు నాయకుల్లా కాదని నిరూపిస్తున్నారు. తాజాగా పవన్  కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ఆయనను మరో మెట్టు ఎక్కించింది.   

ప్రజా సంక్షేమానికి అధికారంలో వున్న పాలకులు డబ్బులు ఖర్చుచేస్తుంటారు... ఇది సర్వసాధారణ విషయం. కానీ చేతిలో అధికారం వుండి కూడా ప్రజల కోసం సొంత డబ్బులు ఖర్చుచేసే నాయకులను మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి నాయకుల జాబితాలో పవన్ కల్యాణ్ చేరిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు కూడబెట్టిన నాయకులున్న ఈ కాలంలో పవన్ సొంత డబ్బులు ఖర్చుచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఈయన కదా నాయకుడంటే అంటూ ప్రజలు పొగుడుతున్నారు. 
 


Pawan Kalyan

అతిథుల కోసం సొంత డబ్బులతో జ్ఞాపికలు :    

రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు,ముఖ్యమంత్రులు, మంత్రులు... ఇలా కీలక పదవుల్లో వున్నవారు తరచూ జ్ఞాపికలు అందుకోవడం మనం చూస్తుంటాం. వివిధ అభివృద్ది, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం రాష్ట్రానికి విచ్చేసిన అతిథులను గౌరవించడం, శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందించడం చేస్తుంటారు. అలాగే మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకు, దేశ రాజధానికి డిల్లీకి వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. ఇలా ముఖ్యమంత్రి, మంత్రులు అతిథులకు అందించే జ్ఞాపికలను ప్రభుత్వమే సమకూరుస్తుంది... ఇందుకోసం తగిన నిధులు కూడా కేటాయిస్తుంది. 

అయితే ఇలాంటి జ్ఞాపికల కోసం ప్రజా ధనాన్ని ఉపయోగించడం పవన్ కల్యాణ్ కు నచ్చనట్లుంది. అందువల్లే అతిథులకు గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు తన సొంత డబ్బులు వాడేందుకు సిద్దమయ్యారు. ఈ జ్ఞాపికల కోసం తన శాఖకు కేటాయించిన బడ్జెట్ నుంచి కేవలం 40 శాతమే తీసుకోవాలని... మిగిలిన 60 శాతం సొంతసొమ్మును ఉపయోగించుకుంటానని అధికారులకు సూచించారు. అంతేకాదు కేవలం రాష్ట్రానికి చెందిన కళాకృతులతో కూడిన వాటినే జ్ఞాపికల కోసం ఉపయోగించాలని... వీటితో గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన పేషీ అధికారులను పవన్ ఆదేశించారు. 

ఇలా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలనే అతిథులకు అందించేందుకు ఉపయోగించాలని పవన్ నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఆయన భావన. ఇందుకోసం  లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 

శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులూ, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు... ఇలా పలు కళాకృతులు డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఎంపిక చేసినవాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Pawan Kalyan

కూతురు ఆద్య ముచ్చటతీర్చిన పవన్ : 

అయితే లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి తిలకించారు. ఈ క్రమంలోనే ఆద్య కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ వాటిని డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు. ఆ బ్యాగ్, బొమ్మలు తీసుకుని కూతురికి అందించగా... ఆమె మురిసిపోతుంటే ఓ తండ్రిగా పవన్ ఉప్పొంగిపోయారు.  

Latest Videos

click me!