కాగా, తిరుపతి ప్రసాదాలు ఎందుకు బాగలేవో తేల్చాలని కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీని వేశారు. భోజనాలు కూడా ఎందుకు సరిగా లేవో తేల్చనున్నారు. ఇప్పటికే నాసిరకం నెయ్యి వినియోగం వల్ల శ్రీవారి ప్రసాదంలో నాణ్యత పడిపోయిందని నివేదికలో తేలింది. వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదంపప్పు, తదితర పదార్థాలు నాసిరకంవి ఉపయోగించడం వల్ల లడ్డూల్లో నాణ్యత పడిపోయిందని ఇప్పటికే భక్తులు, ఆధ్యాత్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ విషయంపై కూటమి నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకకు చెందిన నందిని కో- ఆపరేటివ్ డెయిరీ స్వామివారి మీద భక్తితో రాయితీపై తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేస్తున్నా.. కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కనపెట్టారని ఆరోపించారు. నందిని డెయిరీని పక్కనపెట్టి ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారన్నారు. కేజీ ఆవు నెయ్యి రూ.400 నుంచి రూ.1000 వరకు ఉంటుంది.. కానీ రూ.320కే సరఫరా చేస్తానంటూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. వాటి గురించి ఎటువంటి విచారణ జరపకుండా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని రూ.320కే సరఫరా చేశాయనేది వాస్తవమన్నారు.
లడ్డూలు తయారుచేసేందుకు రోజుకు టీటీడీకి 15వేల కేజీల నెయ్యి అవసరం. దీని విలువ రూ.200 కోట్లు ఉంటుంది. కాగా, నాసిరకం నేతిని నిర్థారించిన ల్యాబ్ నేతి నాణ్యతను పరిశీలించేందుకు తేది 08.07.2024న NDDB CALF ల్యాబ్‌కు పంపించి పరిశీలించారు. 16.07.2024న నివేదిక విడుదల చేశారు. టీటీడీ పంపించిన నేతిని పరిశీలిస్తే... సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తిగింజలతోపాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైంది. వీటితో పాటు బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారని నివేదికలో పేర్కొన్నారు.