పరిశ్రమలు, వాణిజ్య రంగానికి ఏపీ బడ్జెట్ 2025 లో కేటాయింపులు :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక రంగ అభివృద్దికి కట్టుబడి ఉందని... ఇందులో భాగంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు. ఇప్పటికే అనేక కంపనీలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని... ఇందులో అనేక దిగ్గజ కంపనీలు ఉన్నాయన్నారు. ఎన్.టి.పి.సి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపనీ, ఎన్.హెచ్.పి.సి, బి.పి.సి.ఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టిసిఎస్, టాటా పవర్, గ్రీన్ కో గ్రూప్, హీరో ప్యూచర్ ఎనర్జీస్, ఎకోరెస్ ఎనర్జీ తదితర సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయన్నారు. ఇలా ఏపీకి రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని...ఈ పరిశ్రమలతో 4 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.
ఇక ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలకు ఆర్థిక సాయం అందించి అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ది కార్యక్రమం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు, కుప్పంలను ఎంపికచేసారు... ఈ నాలుగు ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటుచేస్తారని పయ్యావుల తెలిపారు.
మొత్తంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని పయ్యావుల అన్నారు. రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని... అందులో భాగంగానే బడ్జెట్ లో రూ.3,156 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.