
Capital expenditure : ఆర్థిక పరమైన అంశాలు అంత ఈజీగా అర్థంకావు... ఆర్థికవేత్తలు వాడే చాలాపదాలు సరికొత్తగా అనిపిస్తుంటాయి. దేశ, రాష్ట్రాల వార్షిక బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రులు చేసే ప్రసంగం కూడా చాలామందికి అర్థమై అర్థంకానట్లు ఉంటుంది. బడ్జెట్ అంటేనే అంకెలగారడి... అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏ రంగానికి ఎంత కేటాయింపులు దక్కాయి, అభివృద్దికి ఎంత, సంక్షేమానికి ఎంత... ఇలాంటివి ఈజీగానే అర్థమవుతాయి...కానీ బడ్జెట్ లో కొన్ని పదాలకు అర్థం తెలుసుకునేందుకు తలలు పట్టుకోవాల్సి వస్తుంది.
అయితే ప్రజలకోసం ప్రవేశపెట్టే బడ్జెట్ వారికే అర్థంకాకుంటే ఎలాగని అనుకున్నారో ఏమో... ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో ఉపయోగించే పదాలగురించి సంక్షిప్త వివరణ ఇచ్చారు. ఇలా ఆయన మూలధన వ్యయం (Capital expenditure) గురించి తన బడ్జెట్ ప్రసంగంలోనే వివరించారు. ఆయన చాలా సింపుల్ గా అర్థమయ్యేలా మూలధన వ్యయం అంటే ఏమిటో తెలిపారు.
మూలధన వ్యయం అంటే ఏమిటి?
ఓ రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంటే ఓ ఆర్థిక సంవత్సరంలో ఆ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది... దాన్ని ఎలా ఖర్చు చేయాలో ముందుస్తుగా రూపొందించుకునే ప్రణాళిక. అయితే బడ్జెట్ రూపకల్పనలో అనేక ఆర్ధిక పరమైన పదాలను ఉపయోగిస్తారు... ఇవి సామాన్య ప్రజలకు అర్థం కావు, దీంతో బడ్జెట్ కూడా అర్థమై అర్థంకానట్లు ఉంటుంది. ఇలా బడ్జెట్ లో ఉపయోగించే సంక్లిష్ట పదాల్లో మూలధన వ్యయం ఒకటి.
అసలు మూలధన వ్యయం అంటే ఏమిటో చాలామందికి తెలియదు...అలాంటప్పుడు బడ్జెట్ లో మూలధన వ్యయం ఎంతో చెప్పినా అర్థంకాదు. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025 ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దీనిగురించి సవివరంగా వివరించారు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా ఈ మూలధన వ్యయం గురించి ఉదాహరణతో సహా వివరించారు ఆర్థిక మంత్రి.
మూలధనం వ్యయం గురించి ఆర్థిక బాషలో కాకుండా సామాన్యుల భాషలో చెప్పాలంటే... ఒక రైతు భూమి కొనడం మూలధన వ్యయం. ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చుకునేందుకు బావి తవ్వడం లేదా బోరు వేయడం కూడా మూలధన వ్యయమే. ఇలా భూమిపై రైతు ధీర్ఘకాలిక ప్రణాళికతో పెట్టుబడి పెట్టి పంటలను తీసుకుని ఆదాయం పొందుతాడు. ఇలా భవిష్యత్ లో ఆదాయం పొందేందుకు ఇప్పుడు పెట్టే ఖర్చులను మూలధన వ్యయం అంటారని పయ్యావుల వివరించారు.
ఇప్పుడు బడ్జెట్ లో పేర్కొన్న మూలధన వ్యయం ఏమిటంటే... ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మౌళిక సదుపాయాల కోసం ఖర్చుచేసే నిధులను మూలధన వ్యయం కిందకు వస్తాయి. భవిష్యత్ లో వీటివల్ల సంపద సృష్టించబడుతుంది. ఈ మూలధన వ్యయానికి పర్ఫెక్ట్ ఉదాహరణ గతంలో టిడిపి అధికారంలో ఉండగా నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్ట్ అని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి ఏపీలో అధికారంలోకి రాగానే చంద్రబాబు సర్కార్ రూ.1600 కోట్లు ఖర్చుచేసి పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించిందని పయ్యావుల తెలిపారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఐదేళ్లలోనే రైతాంగం 44 వేల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కల్పించిందన్నారు. ఇది నిజమైన మూలధన వ్యయం... ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం అని ఆర్థిక మంత్రి అని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే మూలధన వ్యయం చేస్తోందని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
విశాఖలో వైఎస్ జగన్ ప్యాలస్ కట్టుకోవడం ఎలాంటి మూలధన వ్యయమంటే :
మూలధన వ్యయం గురించి వివరిస్తూ విశాఖపట్నం రుషికొండపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన లగ్జరీ భవనాల గురించి ప్రస్తావించారు ఆర్థిక మంత్రి పయ్యావుల. ప్రజల కోసం కాకుండా తన జల్సాల కోసం సముద్ర తీరంలో ప్యాలస్ లు కట్టుకోవడం, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేయించుకోడానికి రూ.650 కోట్లు తగలెయ్యడం మూలధన వ్యయం కాదన్నారు. ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్ఫెండిచర్ గా కనిపించే పర్సనల్ ఎక్స్ఫిండిచర్స్ అని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేసారు.
హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం డబ్బులు ఖర్చుచేయడం మూలధన వ్యయమని అన్నారు. ఇలా గత పాలకుల పర్సనల్ మూలధన వ్యయానికి, కూటమి ప్రభుత్వం ప్రజలకోసం చేసే మూలధన వ్యయానికి చాలా తేడా ఉందన్నారు. ప్రజాధనంలోని రూపాయే అప్పుడు ఖర్చు చేసిందయినా, ఇప్పుడు ఖర్చు చేస్తున్నదయినా... కానీ ఎలా ఖర్చు పెడుతున్నారు అనేదే ముఖ్యమని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.