ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025 లో వైద్యారోగ్య శాఖకు దక్కిన నిధులెన్ని :
గత వైసిపి హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అందుకోసమే ఈ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఏకంగా రూ.19,264 కోట్లు కేటాయించారు.
ఇక గత ప్రభుత్వం ఈ వైద్యారోగ్య శాఖలో భారీగా బకాయిలు పెట్టారని... వాటిని కూడా చెల్లిస్తూ వస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం కేవలం ఈ వైద్యారోగ్య శాఖలో రూ.6,400 కోట్లు బకాయి పెట్టిందని... దీంతో ఈ శాఖకు ఎన్ని నిధులు కేటాయించినా వీటి చెల్లింపుకే సరిపోతోందని ఆర్థిక మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. అందువల్లే దశలవారిగా ఈ బకాయిలు చెల్లించాలని నిర్ణయించామని... ఇప్పటికే రూ.1,645 కోట్లు చెల్లించామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
మొత్తంగా ఓవైపు భారీగా నిధులు కేటాయించి... మరోవైపు దశలవారిగా పాత బకాయిలు చెల్లిస్తూ వైద్యారోగ్య రంగాన్ని తిరిగా గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా అనారోగ్యంతో వైద్యం కోసం వచ్చేవారిని డాక్టర్లు, సిబ్బంది, మందులు,సౌకర్యాలు, ఇతర సేవల కొరత లేకుండా మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కార్పోరేట్ వైద్యం అందాలన్నదే తమ లక్ష్యమని పయ్యావుల కేశవ్ తెలిపారు.