ఆంధ్రప్రదేశ్-ఆస్ట్రేలియాల మధ్య కీలక ఒప్పందాలు.. దీంతో ఏపీ ప్రజలకు జరిగే లాభం ఏంటంటే.?

Published : Aug 02, 2026, 02:49 PM IST

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్యా, పరిశోధన, పారిశ్రామిక సంస్థల మధ్య కీలక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాలుగు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. ఇంత‌కీ ఒప్పందాలతో ఏం జ‌ర‌గ‌నుందంటే.?

PREV
14
లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనతో ముందుకు వచ్చిన భాగస్వామ్యం

ఇటీవల మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అక్కడి ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను వారికి వివరించారు. ఆ చర్చల ఫలితంగానే ఇప్పుడు ఈ నాలుగు కీలక ఒప్పందాలు కార్యరూపం దాల్చాయి. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విద్య, పరిశోధన, సాంకేతికత కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇవి కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

24
ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

ఈ ఒప్పందాల్లో ప్రధాన ఆకర్షణగా ఐఐటీ తిరుపతిలో 'సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు నిలిచింది. విశాఖలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సోలార్ పీవీ తయారీ, సోలార్ ప్యానెల్ రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ పరిశోధనల్లో దేశంలో ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా UNSW రూపొందించనుంది.

34
సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యా రంగంలో మరో కీలక ఒప్పందం సమ్మిళిత విద్య (Inclusive Education) బలోపేతానికి సంబంధించినది. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా ఆటిజం, న్యూరోడైవర్స్ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

అదే సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో సాంకేతిక ఆధారిత వర్చువల్ కౌన్సెలింగ్ సేవలను పైలట్ ప్రాజెక్టుగా ఉచితంగా ప్రారంభించనున్నాయి. దీని ద్వారా విద్యార్థులకు సమయానుకూలంగా మానసిక ఆరోగ్య సహాయం అందించే అవకాశం ఉంటుంది.

44
నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉద్యోగాలకు కొత్త అవకాశాలు

నాలుగో ఒప్పందం రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కుదిరింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ కలిసి ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ, వృత్తి విద్యా సర్టిఫికేషన్ కార్యక్రమాలను అమలు చేయనున్నాయి. దీని ద్వారా విదేశీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను రాష్ట్ర యువతకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఒప్పందాలపై సంతకాలకు ముందు ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భవిష్యత్ భాగస్వామ్యంపై సీఎం వారికి వివరించారు. ఈ ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్‌ను విద్య, పరిశోధన, క్లీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యానికి మరింత దగ్గర చేసే అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories