
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహాన్ని తెచ్చింది. మొదటి రోజునే పరిశ్రమల రంగంలో కీలకమైన 40కి పైగా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎనర్జీ, మెటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక వసతులు, పరిశ్రమల శాఖలకు సంబంధించిన విభాగాలలో రూ. 3,49,476 కోట్ల పెట్టుబడుల ఓప్పందాలు జరిగాయి.
ఈ ఒప్పందాల ప్రభావంతో 4,15,890 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఎంఓయూల్లో ముఖ్యంగా ఏఎం గ్రీన్ మెటల్స్, ఎకోరెన్ ఎనర్జీ, జాక్సన్ గ్రీన్, జీఎంఆర్ ఎనర్జీ, ఎస్సార్ రెన్యువబుల్స్, వారీ గ్రూప్, సీసన్ గ్లోబల్ ట్రేడింగ్, ఎస్ఏఈఎల్, జెఎం బాక్సీ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి.
రెండో రోజు మున్సిపల్, పట్టణాభివృద్ధి రంగాలకు పెట్టుబడులు ఆకర్షించడం సదస్సుకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంత్రి నారాయణ సమక్షంలో 25 సంస్థలు ఎంఓయూలపై సంతకాలు చేశాయి. ఇవి కన్‌స్ట్రక్షన్, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రా, విద్య, టూరిజం, శానిటేషన్ రంగాలకు సంబంధించి ఉన్నాయి.
ఇవి కాకుండా, గతరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో AP CRDA పరిధిలో 7 కంపెనీలు కూడా ఒప్పందాలు చేసుకోవడంతో మొత్తం సంఖ్య 32కి చేరింది. ప్రధానమైనవి గమనిస్తే..
ఈ మూడు విభాగాల ద్వారా కలిపి 1,57,510 ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సీఐఐ సదస్సు ప్రారంభానికి ముందు రాష్ట్రం ఇప్పటికే 35 కంపెనీలతో రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. మొదటి రోజు మరో 3.49 లక్షల కోట్లు రావడంతో మొత్తం పెట్టుబడుల విలువ రూ. 7,14,780 కోట్ల రికార్డు స్థాయిని తాకింది.
ఇవి మొత్తం 75 సంస్థలతో కుదిరిన ఒప్పందాలు, ఈ పెట్టుబడులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్ చేయనున్నాయి. పరిశ్రమల విస్తరణ, ఫుడ్ ప్రాసెసింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి వంటి విభాగాలకు ఇవి ఉపయోగపడనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లూలూ ఇంటర్నేషనల్ గ్రూప్ ఈ సదస్సులో కీలక పెట్టుబడి భాగస్వామిగా నిలిచింది. చైర్మన్ యూసఫుల్ అలీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో పలు రంగాలలో ఒప్పందాలు చేసుకున్నారు.
విశాఖలో రూ. 1,066 కోట్ల వ్యయంతో లూలూ మాల్ నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మామిడి–జామ గుజ్జు, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. రాయలసీమలో లాజిస్టిక్స్, ప్రొక్యూర్‌మెంట్, ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు గ్రూప్ ప్రకటించింది. చంద్రబాబు రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు లూలూ సహకరించాలని కోరగా, దీనికి చైర్మన్ స్పందించారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ కూడా భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. 1GW AI డేటా సెంటర్, 6GWp సోలార్ ప్రాజెక్ట్, కర్నూలులో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనుంది.
పట్టణ పాలన, డిజిటల్ మార్పులు, సుస్థిరత రంగాలలో సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, సింగపూర్ మంత్రి గన్ సియో హువాంగ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ సింగపూర్ అభివృద్ధి నమూనా ప్రపంచానికి ఆదర్శమని, ఏపీ అదే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. త్వరలో వారానికి మూడు రోజులు విజయవాడ–సింగపూర్ విమానాలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.