Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం భారీ కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
రాయలసీమలో సుమారు రూ.1 లక్ష కోట్ల వ్యయంతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇందులో ప్రైవేట్ రంగం నుంచి రూ.60 వేల కోట్లు, ప్రభుత్వ తరఫున రూ.40 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా రూ.117 కోట్లతో నిర్మించనున్న ఆధునిక బస్ స్టేషన్, ఆర్టీసీ డిపోకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మొత్తం రూ.9,320 కోట్ల విలువైన 30 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించినట్లు తెలిపారు.
25
ఉపాధి, పరిశ్రమలతో కుప్పం రూపురేఖలు మారుస్తాం
కుప్పం నుంచి ఉద్యోగాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇతర జిల్లాల నుంచి ఉద్యోగాల కోసం ప్రజలు కుప్పానికి వచ్చేలా పరిశ్రమలను తీసుకురావడమే లక్ష్యమన్నారు. అడిడాస్ పరిశ్రమ ద్వారా దాదాపు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఇప్పటికే డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, త్వరలో పాల ఉత్పత్తిని రోజుకు 10 లక్షల లీటర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. పౌల్ట్రీ రైతులకు అవసరమైన మద్ధతు కూడా ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
35
వ్యవసాయంలో సాంకేతికత, సేంద్రియ సాగుకు ప్రాధాన్యం
కుప్పం ప్రాంతాన్ని వాణిజ్య పంటల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు తెలిపారు. సెరికల్చర్, ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్ వంటి ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. డ్వాక్రా సంఘాల ద్వారా పశుగ్రాసం ఉత్పత్తి చేసి కమ్యూనిటీ వ్యవస్థల ద్వారా సరఫరా చేసే ప్రణాళికను కూడా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
కంగుంది గ్రామంలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రైతులు క్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి గో ఆధారిత సాగును ప్రోత్సహించాలని అన్నారు.
విద్యుత్ వాహనాలు, సోలార్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి
భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి విద్యుత్ ఆధారిత రవాణాకు ప్రాధాన్యం పెరగాలని చంద్రబాబు అన్నారు. స్కూటర్లు, కార్లు, ట్రాక్టర్లతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ కూడా క్రమంగా విద్యుత్ వాహనాల వైపు మారాలని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులకు అవసరమైన విద్యుత్‌ను సోలార్ శక్తి ద్వారా ఆర్టీసీనే ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన ఇంధన వినియోగం భవిష్యత్ అభివృద్ధికి కీలకమని చెప్పారు.
55
కుప్పాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం
కుప్పం నియోజకవర్గాన్ని పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. హోటళ్లు, హోమ్ స్టేలు, ఇతర పర్యాటక వసతులు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గతంలో రాష్ట్ర పారిశ్రామిక ప్రతిష్ఠ దెబ్బతిన్నప్పటికీ, ఇప్పుడు తిరిగి పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి "స్వర్ణ కుప్పం"గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.