Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చిరించింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
మంగళవారం రాత్రి నుంచి గుంటూరు, విజయవాడల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 15-20 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, చుండూరులో 27.24 సెం.మీ., చేబ్రోలులో 23.4 సెం.మీ.తో రికార్డు స్థాయి వర్షం పడింది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
DID YOU KNOW ?
విజయవాడ బెంజ్ సర్కిల్ లో రికార్డు వర్షపాతం
2024 ఆగస్టు 31న విజయవాడలో బెంజ్ సర్కిల్ వద్ద 161 మి.మీ., విమానాశ్రయంలో 123 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 200 ఏళ్లలో ఆగస్టులో అత్యధికం. తాడేపల్లిలో 121 మి.మీ., మంగళగిరిలో 118 మి.మీ. వర్షం కురిసింది.
25
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది
భారీ వర్షాలతో పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో గ్రామీణ రహదారులు వరద నీటితో మునిగిపోయాయి. నాగార్జునసాగర్, పులిచింతల నుంచి నీటి విడుదలతో కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వర్షాలతో ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
35
భయాందోళనలో విజయవాడ ప్రజలు
గుంటూరులో ఏటీఅగ్రహారం, చుట్టుగుంట, రామిరెడ్డి నగర్, అమీన్‌నగర్ వంటి ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రైతుబజార్లు, మిర్చియార్డులు నీటమునిగాయి. నాగార్జున విశ్వవిద్యాలయం హాస్టళ్లలో నీరు చేరడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
విజయవాడలో మధురానగర్, విజయదుర్గానగర్, పటమట ప్రాంతాలు నీటమునిగాయి. బుడమేరు పొంగుతుందన్న పుకార్లపై కలెక్టర్ లక్ష్మీశ స్పష్టీకరణ ఇచ్చి ప్రజలకు అపోహలు నమ్మవద్దని సూచించారు. భారీ వర్షాల క్రమంలో విజయవాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతిచెందారు. విజయవాడలో ఒక వాహనం గుంతలో పడిపోవడంతో ఒకరు మరణించగా, మరొకరు తలకు గాయాల వల్ల మృతిచెందాడు. లయోలా కాలేజీ వద్ద చెట్టు కూలిపడడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. పెదకాకాని వద్ద వరద నీటిలో పడి బాలుడు మృతిచెందాడు. అలాగే, మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం.
55
ప్రభుత్వ చర్యలు-హెచ్చరికలు జారీ
భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతం లో అల్పపీడనం కారణంగా కోస్తా జిల్లాల్లో రాబోయే రోజుల్లో కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచించారు.