Published : Aug 14, 2025, 08:33 AM ISTUpdated : Aug 14, 2025, 08:47 AM IST
AP School Holiday: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే, వరద ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం రాబోయే మూడు రోజులపాటు వర్షాలు మరింత తీవ్రతరం కానున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పలు జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
గుంటూరు జిల్లాలో వరద ముప్పు పెరగడంతో కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆగస్టు 14న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు.
ఎన్టీఆర్ జిల్లాలో కూడా అధికారులు ఇదే విధంగా సెలవు ప్రకటించారు. ఇప్పటికే ఇక్కడ వానలు దంచికొడుతున్నాయి. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉంది.
35
పశ్చిమగోదావరి జిల్లా కూడా భారీ వర్షాలు
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం (ఆగస్టు 14న) రోజు మొత్తం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
వర్షాలు మరింత బలపడే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మొత్తం 70 గేట్లు ఎత్తి 3,97,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తం కావాలని సూచనలు జారీ చేశారు.
55
మత్స్యకారులకు సూచనలు
తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు.
రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించి, అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రమాదకర హోర్డింగ్స్, చెట్లు వెంటనే తొలగింపు నిర్ణయాలు పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాలన్నారు.