Jana Sena Annual Meeting: గత దశాబ్దంలో అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడిన పార్టీ జనసేన.. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన విజయంతో యావత్ భారతావని దృష్టిని ఆకర్షించింది. పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న స్థాపించిన ఈ పార్టీ ఇప్పుడు దాని వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. శుక్రవారం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో భారీ ప్లీనరీతో జనసేన పార్టీ తన 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ జయకేతనంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో తనను తిట్టని తిట్టు లేదని అన్నారు. అంచుకు కూడా రానివ్వమన్న చోట అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వచ్చామని పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని తనను తీవ్రంగా అవమానించారనీ, అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ముందుకు నడుస్తున్నామని చెప్పారు. గత వైకాపా పాలనను ప్రస్తావిస్తూ.. గత ఐదేండ్లు ఆంధ్రప్రదేశ్ లో హింసను సాగించారనీ, ప్రతిపక్షాలను వేధించారని పేర్కొన్నారు. తనను గత ప్రభుత్వ నాయకులు, వైకాపా నేతలు తిట్టని తిట్టు లేదన్నారు. వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు.