కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో ఆందోళనకర విషయాలను గుర్తించారు. చాలా పానీపూరీ నమూనాల్లో సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. తాజాగా ఈ విషయాన్ని నేషనల్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
ఫుడ్ లవర్స్‌కి వరుసగా బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. మొన్న గోబీ మంచూరియా, నిన్న పీచుమిఠాయిపై బెంగళూరులో నిషేధం విధించారు. ఇప్పుడు అదే జాబితాలోకి మరో ఫుడ్ ఐటమ్ చేరబోతోంది.
ఫుడ్ లవర్స్ టైమ్ పాస్ కోసమో.. లేక ఇష్టం కోద్దో సాయంత్రం కాగానే అలా బయటకు వెళ్లి పానీ పూరీ లాగించేస్తుంటారు. తోడా పానీ దాలో భయ్యా... తోడా ప్యాజ్ దాలో భయ్యా.. అంటూ కొసరి కొసరి అడిగి మరీ లాగించేస్తుంటారు. ఇలా రోజూ తినేవారు లేకపోలేదు. అయితే, ఇప్పుడు పానీపూరీయే ప్రాణాంతకంగా మారింది.
undefined
ఎందుకంటే... పానీ పూరీ తయారీ దారుణంగా ఉంటోందని తేలింది. దీని తయారీలో కృత్రిమ రంగులు వాడుతున్నారని పలుచోట్ల గుర్తించారు. గోబీ మంచూరియా, షుగర్ క్యాండీ, చికెన్, ఫిష్, అలాగే కొన్ని వెజ్ ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్స్ ఆకర్షణీయంగా కనిపించేందుకు ఆహారంలో సింథటిక్ కలర్స్ కలుపుతున్నారు. ఈ కృత్రిమ రంగులను ఫుడ్‌లో కలపడంపై ఎప్పటి నుంచో ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
దీనిపై దృష్టిపెట్టిన కర్ణాటక ఆహార భద్రత విభాగం అధికారులు.. ఇటీవల పలు దుకాణాలపై దాడులు చేశారు. రాజధాని బెంగళూరు సహా 79 చోట్ల తనిఖీలు చేసి శాంపిళ్లు సేకరించారు.
ఈ తనిఖీల్లో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆందోళనకర విషయాలను గుర్తించారు. చాలా పానీపూరీ నమూనాల్లో సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. తాజాగా ఈ విషయాన్ని నేషనల్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన అనేక శాంపిళ్లలో సన్సెట్ యెల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు. అలాగే, బెంగళూరులో సేకరించిన 49 శాంపిళ్లకు గాను 19 శాంపిళ్లలో సింథటిక్ రంగులు ఉన్నట్టు గుర్తించారు.
ఈ నేపథ్యంలో పానీపూరీ తయారీలో కృత్రిమ రంగులతో తయారుచేసే సాస్లు, స్వీట్ చిల్లీ పౌడర్లపై నిషేధం విధించే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల గోబీ మంచూరియా, కబాబ్‌లలాంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది.
హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనలు అతిక్రమించి హానికరమైన ఫుడ్ కలర్స్ వినియోగిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ రావు హెచ్చరించారు. అలాగే, 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
కాగా, కృత్రిమ రంగులు కలిపిన ఆహారం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఫుడ్ కలర్స్ కలిసిన ఆహారం తీసుకున్న పిల్లల ఆరోగ్యంపై అయితే తీవ్రమైన ప్రభావం పడుతుంది. చిన్న పిల్లలు హైపర్ యాక్టివిటీతో పాటుగా ఆటిజం బారినపడే ప్రమాదం ఉంది. చిరాకు, డిప్రెసన్, మానసిక ఆందోళనలు పెరగడంతో పాటు అలర్జీలు వచ్చే అవకాశాలున్నాయి.