
అక్కినేని నాగచైతన్య - లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన సినిమా యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మాతగా కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి వరుస హిట్స్ తో మాంచి జోష్ మీదున్న నాగచైతన్య మరోసారి యాక్షన్ హీరోగా ట్రైచేసిన మూవీ యుద్ధం శరణం. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ మరోసారి విలన్ గా చేయటం ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి యుద్ధం శరణం ఆ అంచనాలను అందుకుందా..? మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు నాగచైతన్య చేసిన యుద్ధంలో గెలిచాడా..?
కథ :
అర్జున్ (నాగ చైతన్య) ఉదయం తొమ్మిదింటినుంచి సాయంత్రం ఐదింటికి వరకు రొటీన్ ఉద్యోగం చేయటం ఇష్టం లేని కుర్రాడు. జీవితంలో ఏదైన సాధించాలన్న పట్టుదలతో డ్రోన్ తయారు చేసే పనిలో ఉంటాడు. అమ్మ సీతాలక్ష్మీ (రేవతి), నాన్న మురళీ కృష్ణ(రావూ రమేష్)లే అర్జున్ ప్రపంచం. అక్క రాధిక, చెల్లెలు ధనుతో కలిసి అల్లరి చేస్తూ, ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తూ హ్యాపిగా లైఫ్ గడిపేస్తుంటాడు. తన తల్లి దండ్రుల 30వ పెళ్లిరోజును గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తాడు.
కానీ అదే రోజు అర్జున్ వాళ్ల అమ్మానాన్న కనిపించకుండా పోతారు. ఒక్కసారిగా అర్జున్ జీవితం తలకిందులవుతుంది. అమ్మా నాన్నకు ఏమైందో తెలుసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ చివరకు ఓ యాక్సిడెంట్ లో వాళ్లు చనిపోయారని తెలుస్తుంది. కానీ అది యాక్సిడెంట్ కాదని ఎవరో కావాలనే వాళ్లను చంపేశారని.. అర్జున్ కుటుంబానికి అనుమానం వస్తుంది. అదే సమయంలో నాయక్ అనే క్రిమినల్ అర్జున్ ఫ్యామిలీ వేటాడటం మొదలు పెడతాడు. అర్జున్ కుటుంబాన్ని నాయక్ ఎందుకు చంపాలనుకున్నాడు..? అర్జున్ వాళ్ల అమ్మానాన్నల చావుకు నాయక్ కు సంబంధం ఏంటి..? నాయక్ లాంటి రాక్షసుణ్ని అర్జున్ ఎలా ఎదిరించి గెలిచాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
కెరీర్ స్టార్టింగ్ నుంచి సీరియస్ రోల్‑లో ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. అయితే పూర్తి మాస్ సబ్జెక్ట్ కాకుండా థ్రిల్లర్ జానర్ ను ఎంచుకొని సక్సెస్ సాధించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే నాగచైతన్య నటనలో మంచి పరిణతి కనిపించింది. లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కేవలం కథలో పాటలు రొమాన్స్ కోసమే ఆమె పాత్రను ఇరికినట్టుగా అనిపించింది. అయితే ఉన్నంతలో గ్లామర్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది.
సీనియర్ నటులు రేవతి, రావూ రమేష్ లు తమ అద్భుతమైన నటనతో సీతా లక్ష్మీ, మురళీ కృష్ణల పాత్రలకు ప్రాణం పోశారు. కుటుంబాన్ని ప్రేమిస్తూనే సమాజానికి ఏదైన సాయం చేయాలనే తపన పడే పాత్రలో ఒదిగిపోయారు. విలన్ గా మరోసారి తెలుగు తెర మీద కనిపించిన శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో అలరించాడు. లుక్స్ తో పాటు నటనలోనూ విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. సిస్టర్‑ క్యారెక్టర్ లో సీమా చౌదరి నటన ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, రాజా రవీంద్ర, ప్రియదర్శి, రవివర్మలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
తొలి సినిమాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ను ఎంచుకున్న దర్శకుడు కృష్ణ ఆర్వీ మారిముత్తు మంచి విజయం సాధించాడు. తొలి భాగం ఫ్యామిలీ, లవ్ సీన్స్ తో కాస్త నెమ్మదిగా నడిపించినా.. రెండో భాగంలో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. యాక్షన్ సీన్స్ తో పాటు హీరో విలన్ ల మధ్య సాగే మైండ్ గేమ్ ఆడియన్స్ కు థ్రిల్ కలిగిస్తుంది. అయితే లవ్ స్టోరి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కలగటానికి బలమైన కారణం కనిపించదు. సినిమాకు మేజర్ ఎసెట్ సినిమాటోగ్రాఫర్ నిఖేత్ బొమ్మిరెడ్డి. డ్రోన్ సీన్స్ తో పాటు నైట్ విజన్ కెమెరాతో షూట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. వివేక్ సాగర్ సంగీతం పరవాలేదు. ఫ్యామిలీ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో హీరో విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సినిమాలో చైతు, శ్రీకాంత్ మధ్య వచ్చే సీన్లతో పాటు ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగున్నాయి. ఇక హీరో - హీరోయిన్ల మధ్య వచ్చే కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. రన్ టైం కూడా 141 నిమిషాలే ఉండడంతో అనవసర సీన్లకు మరీ ఎక్కువ స్కోప్ లేదు. చేజింగ్ సీన్లు, పాటలు బాగున్నాయి. విలన్ల నుంచి నాగచైతన్య తెలివిగా తప్పించుకోవడం, చైతు అటాకింగ్ గురించి శ్రీకాంత్‌కు తెలియడం ఇలా కొన్ని సీన్లు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో ఫస్టాఫ్, సెకండాఫ్ మొత్తం స్లో నెరేషన్‌తోనే రన్ అవుతుంది. ఈ స్లో నెరేషన్ ఏ క్లాస్ మినహా మిగిలిన బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే. ఇక హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిని మించిన రేంజ్‌లో ఈ సినిమా ఉండదు. ఈ రొటీన్ స్టోరీకి తోడు కామెడీ లేకపోవడం మైనస్. చైతు అంటేనే ప్రేక్షకులు లవర్ బాయ్ ఇమేజ్‌గా ఊహించుకుంటారు. అయితే ఈ సినిమా అందుకు భిన్నంగా యాక్షన్ నేపథ్యంలో ఉంటుంది. చైతు గతంలో చేసిన యాక్షన్ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సినిమాల్ మైనస్‌లు చాలా ఎక్కువే ఉన్నాయి.
చివరగా:
చైతు యాక్షన్ హీరోగా చేసిన ఈ యుద్ధం శరణం మల్టీఫ్లెక్స్ ఆడియెన్స్‌లోనే కొందరికి మాత్రమే నచ్చేలా ఉంది. మరి ఏ సెంటర్లలో మిగిలిన ప్రేక్షకులు, బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం బట్టే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇప్పటికైతే యుద్ధం శరణం యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది.