కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది.. కేంద్ర మంత్రి అమిత్ షా

By Sumanth KanukulaFirst Published Sep 11, 2022, 10:11 AM IST
Highlights

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు మరణం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన బహుముఖ నటనతో, సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చిందని అన్నారు. 

‘‘తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అతను బహుముఖ నటనతో, సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. 

Also Read: Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు సినీ ప్రస్థానం, సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ డిటేయిల్స్.!

ఇక, గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు కన్నుమూశారు. పోస్ట్ కోవిడ్, కార్టియాక్ అరెస్ట్‌తో ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. కృష్ణంరాజు మరణవార్త టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, సినీ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. సినిమాపై మక్కువతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. 1966లో విడుదలైన చిలకా గోరింకా చిత్రంతో  వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రెండో తరం స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. కెరీర్ లో 187 చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ మూవీలో నటించారు. తన తమ్ముడు కుమారుడు ప్రభాస్ ని నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు. కృష్ణంరాజు మరణవార్త విన్న టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, తల్లీ కొడుకులు, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తాండ్ర పాపారాయుడు, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, బావా బావమరిది లాంటి సినిమాలు  ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భక్త కన్నప్ప టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. శివ భక్తుడిగా కృష్ణం రాజు నటన అబ్బురపరిచింది. కృష్ణంరాజు 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. 

Also Read: కృష్ణం రాజు ఆస్తుల వివరాలు.. మొగల్తూరులోనే అంత ఉందా, దిమ్మతిరిగిపోద్ది.. 

మరోవైపు కృష్ణం రాజు  రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీతో యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 1998‌లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత 1999లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన మరోసారి బీజేపీలో చేరారు. 

click me!