
కథ...
బంగ్లాదేశ్ తో జరుగుతున్న యుద్ధంలో తమ సైనికులకు మద్ధతుగా నిలవాలంటే భారత్ భూభాగాన్ని దాటి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న పాకిస్తాన్.. ఎలాగైనా బంగ్లా సరిహద్దుకు చేరుకోవాలనే ప్లాన్ తో... భారత సముద్ర జలాల్లోంచి సబ్ మెరైన్స్ ద్వారా వెళ్లాలని స్కెచ్ వేస్తుంది. ఈ ఆపరేషన్ లో అడ్డుగా నిలిచే భారత్ ను భౌగోళికంగా, మానసికంగా దెబ్బ తీయాలనే దేశం పాకిస్థాన్.
1971లో తూర్పు పాకిస్థాన్, పశ్చిమ పాకిస్థాన్ అని రెండుగా విడిపోయి కొట్టుకోవడం మొదలు పెట్టింది. తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం కోసం చేస్తున్న పోరాటంలో భారతదేశ ప్రమేయం ఉందని పశ్చిమ పాకిస్థాన్ భావించి, భారత్‌ను దెబ్బ తీయాలనుకుంటుంది. అందులో భాగంగా భారత నేవీకు సంబంధించిన ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ యుద్ధ నౌకను నాశనం చేయాలని, తీరంలోని ఏదైనా భారీ ఓడరేవును ధ్వంసం చేయాలనుకుంటుంది. అందుకు వైజాగ్ సముద్ర ప్రాంతాన్ని ఎంచుకుంటుంది పాకిస్థాన్. అయితే పాకిస్థాన్ కుయుక్తులను పసిగట్టిన ఇండియన్ నేవీ, భారత సముద్ర జలాల్లోకి ఎస్21 అనే సబ్ మెరైన్‌ను గస్తీకి నియమిస్తుంది. ఈ సబ్‌మెరైన్‌కు రణ్ విజయ్ సింగ్(కె.కె.మీనన్) కెప్టెన్. అయితే రణ్ విజయ్ సింగ్ శత్రువులను అంతమొందించాలనే ఆవేశం అణువణువునా నింపుకుని ఉంటాడు. దీనికి గతంలో ఓ యుద్ధంలో జరిగిన ఒక సంఘటన కారణం. దీంతో అనవసరంగా దాడికి తెగబడకుండా రణ్ విజయ్ సింగ్ ను కంట్రోల్ చేయడానికి తోడుగా కమాండర్ అర్జున్ వర్మ(రానా దగ్గుబాటి)ని ప్రభుత్వం పంపుతుంది. అయితే పాకిస్థాన్ పంపిన ఘాజీ సబ్‌మెరైన్ భారత్ మెరైన్స్ కన్నా ఎన్నో రెట్లు బలమైనది.
అలాంటి ఘాజీని ఎదుర్కొనేందుకు రణ్ విజయ్ సింగ్, అర్జున్ వర్మలు ఏం చేస్తారు? చివరకు భారత్ అండర్ వాటర్ వార్‌లో గెలిచిందా? మరి ఈ యుద్ధం గురించి బయట అందరికీ తెలియకపోవడానికి కారణాలేంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
తెలియని ఓ కథను సినిమాగా తీయాలనుకోవడం సాహసమే. అయితే... పక్కా ప్లాన్... కరెక్ట్ కథ ఉంటే.. సరైన కేరక్టర్స్ ఉంటే సినిమా పండుతుందనడంలో సందేహం లేదు. పాత్రల తీరు తెన్నులను పరిశీలిస్తే.. ఆవేశ పరుడైన కెప్టెన్ పాత్రలో కె.కె.మీనన్ తనదైన నటనతో మెప్పించాడు. అలాగే అధికారుల ఆదేశాలను, రూల్స్ ను ఫాలో అవుతూ అవసరం వచ్చినప్పుడు శత్రువును అంతం చేయడానికి ఎంతకైనా సిద్ధపడే అర్జున్ వర్మ పాత్రలో రానా ఒదిగిపోయాడు. షార్ట్ ఫిలింగా ముగించాలనుకున్న ఈ సినిమాకు రానా ఎంట్రీతో భారీగా రేంజ్ పెరిగిందనడంలో సందేహం లేదు. అతుల్ కులకర్ణి పాత్ర కూడ సినిమా అంతా ఉంటుంది. అలాగే సత్యదేవ్, రవివర్మ, నాజర్, ఓంపురి సహా మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
సాంకేతిక నిపుణులు...
ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. ఇలాంటి కథతో సినిమా చేయాలనుకోవడమే గొప్ప విషయం అయితే ఇలాంటి కొత్త కథతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలను అభినందించాలి. పాత్రలను దర్శకుడు సంకల్ప్ రెడ్డి మలిచిన తీరు అభినందనీయం. కథ కోసం సంకల్ప్ చేసిన రీసెర్చ్ వర్క్ మనకు తెరపై కనపడుతుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్. సినిమాలో ప్రతి సీన్‌ను తెరపై ఆవిష్కరించిన తీరు అభినందనీయం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కె కృష్ణ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
ప్లస్ పాయింట్స్...
సినిమా ఏంటనేదే ఒక ఐడియాకు రావడంతో కాస్తా లాగింగ్‌గా అనిపిస్తుందే తప్ప ఇలాంటి సినిమాలో కామెడి, సాంగ్స్ అవన్నీ చేర్చకపోవడమే సినిమాకు ఇంకా బలాన్ని చేకూర్చింది. సినిమా మొదలైన దగ్గరినుంచీ క్యూరియాసిటీ పెంచుతూ పోయిన విధానం అభినందనీయం. కథలో గెలుపు హీరో టీమ్ దే అని ముందే తెలిసిపోయేలా ఉన్నా,,... అది ఎలా జరుగుతుందన్నది తెరకెక్కించిన విధానం మెచ్చుకోదగింది.
మైనస్ పాయింట్స్...
సినిమా క్లైమాక్స్ లో ఇండియన్ సబ్ మెరైన్ ఎస్ 21, పాకిస్థాన్ సబ్ మెరైన్ ‘ఘాజీ' ని కూల్చే సన్నివేశాల్లో ఇంకాస్త థ్రిల్ అనిపించేలా ఫైట్ ఎగ్జయిట్ మెంట్ ఉండేలా పెంచితే బాగుండేది, క్లైమాక్స్ లో సీన్స్ అనుకున్న స్థాయిలో లేవనే చెప్పాలి. ఇంకాస్త ఆకర్షణీయంగా డీల్ చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. అలాగే తాప్సి పాత్రకు ప్రయారిటీ లేదు. ఏదో హీరోయిన్ అవసరం కాబట్టి పెట్టిన్లుగా ఉంది.
చివరగా...
ఘాజీ పేలింది. థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది.