మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ నిందితుడు శ్యామ్‌పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొడుకుపై జరిగిన దాడి విషయమై ఈ పిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు స్వీకరించిన రాయదుర్గం పోలీసులు.. నిందితుడు శ్యామ్‌పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ కేసు పూర్వా పరాల్లోకి వెళితే... ఆర్పీ పట్నాయక్ కొడుకు వైష్ణవ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న శ్యామ్ అనే స్టూడెంట్ ఇతడిని ర్యాగింగ్ చేసేవాడు. ఈ గొడవ కాస్త ముదిరి.. బస్సులో వెళ్లేటప్పుడు వైష్ణవ్‌తో గొడవకు దిగాడు. ఇందులో భాగంగా ఆవేశానికి లోనైన శ్యామ్.. వైష్ణవ్ చెవి కొరికేశాడు. తన కొడుకుపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న ఆర్పీ పట్నాయక్.. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సీనియర్ విద్యార్థులు తరచూ ర్యాగింగ్ చేస్తూ దాడి చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో వైష్ణవ్ ఎంబీఏ చదువుతున్నాడని, కళాశాల బస్సులో ఇంటికి వస్తున్న సమయంలో సీనియర్ విద్యార్థి శ్యామ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని పోలీసులకు ఆర్పీ తెలిపారు. తీవ్రంగా కొట్టి చెవి కొరికినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనను కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని పట్నాయక్ చెప్పారు. అందుకే పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. దాడి జరగడంతో వైష్ణవ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ఆయన తెలిపారు.
సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తన వైవిధ్యమైన సంగీతంతో ఎన్నో సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక దర్శకుడిగా కూడా రెగ్యులర్ జానర్‌కు భిన్నంగా డిఫరెంట్ ఫార్మాట్‌ను ఎంచుకుని చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్పీ తెరకెక్కించిన చిత్రాలే ఇందుకు నిదర్శనం.
ఇదలా ఉండగా ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం సినిమాలు పూర్తిగా తగ్గించేశారు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడిగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఆ మధ్య నటుడు, దర్శకుడిగానూ పలు చిత్రాలు తీశారు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు. తెలుగు సినిమా రంగంపై కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 60 తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించానని, ఏడాది వరకు ఖాళీ లేదన్నారు. తెలుగులో నటించిన శీను..వాసంతి..లక్ష్మి, బ్రోకర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించిందన్నారు. అలాగే మనలో ఒకడు చిత్రంలో వేసిన పాత్రకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారన్నారు.