ఎన్టీఆర్ నటించిన దేవర థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ మూవీ విజయం ఎన్టీఆర్ కి ఓ పరీక్ష. ఆయన కోరుకున్నది జరిగేనా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది...
ఎన్టీఆర్ కి దేవర విజయం చాలా ప్రతిష్టాత్మకం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దేవర అందుబాటులోకి వచ్చింది.
జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జంటగా నటించింది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మించాయి. దేవర మూవీ బడ్జెట్ రూ. 300 కోట్లు అని సమాచారం.
దేవర చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది. ఎన్టీఆర్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్.. దేవర చిత్రానికి హైలెట్స్ అంటున్నారు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగలేదనే మైనస్ పాయింట్స్ వినిపిస్తున్నాయి.
టాక్ ఓ మోస్తరుగా ఉన్నప్పటి దేవర చిత్రానికి బ్లాక్ బస్టర్ వసూళ్లు దక్కాయి. ఓపెనింగ్ డే దేవర బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. నైజాంలో దేవర రూ. 19 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని సమాచారం. అలాగే సీడెడ్ లో దేవర రూ. 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచన.
యూఎస్ లో దేవర వసూళ్లు $ 4 మిలియన్ మార్క్ కి చేరువయ్యాయి. హిందీలో దేవర పెద్దగా ప్రభావం చూపలేదని వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ డే దేవర హిందీ వెర్షన్ రూ. 6-7 కోట్ల నెట్ వసూళ్ళు సాధించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో దేవరకు విశేష స్పందన దక్కుతుంది. తమిళనాడు, కేరళలో ఎన్టీఆర్ చిత్రానికి ప్రభావం పెద్దగా లేదు. ఇక వరల్డ్ వైడ్ దేవర ఫస్ట్ డే దాదాపు రూ. 140 కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టిందట.
రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ అధిగమించగలడా అనేది మొదటి నుండి దేవర విషయంలో వినిపిస్తున్న మాట. గత 23 ఏళ్లలో ఏ హీరో కూడా రాజమౌళి సెంటిమెంట్ నుండి తప్పించుకుంది లేదు. ఆయనతో సినిమా చేసిన హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ కావాల్సిందే. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యాయి. సలార్ తో ప్రభాస్ హిట్ ట్రాక్ ఎక్కాడు.
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ కి ఆచార్య రూపంలో డబుల్ డిజాస్టర్ పడింది. మరి ఎన్టీఆర్ సంగతి ఏమిటీ? దేవర రాజమౌళి సెంటిమెంట్ కి ఎదురెళ్ళిందా?.. అంటే అవునని చెప్పొచ్చు. రూ. 400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దేవర విడుదల కాగా, ఫస్ట్ డేనే మూడో వంతు రికవరీ చేసింది. దేవర ట్రెండ్ పరిశీలిస్తే.. ప్లాప్ అయ్యే అవకాశమే లేదు.
ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాడు. కానీ ఆ ట్యాగ్ ఆయనకు సార్థకం కావాలంటే... నాన్ రాజమౌళి మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టాలి. ప్రభాస్, అల్లు అర్జున్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ గాలివాటమే. అదంతా రాజమౌళి పుణ్యమే అన్నారు. నాన్ రాజమౌళి మూవీతో నార్త్ ఇండియాలో సత్తా చాటితేనే నిజమైన పాన్ ఇండియా హీరో అవుతాడని ఎద్దేవా చేశారు.
సాహోతో తనపై ఉన్న అపవాదు ప్రభాస్ పోగొట్టుకున్నాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు. తెలుగులో ప్లాప్ అయిన సాహో, హిందీలో సూపర్ హిట్. రూ. 150 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. అనంతరం సలార్, కల్కి సైతం నార్త్ లో సత్తా చాటాయి.
ఇక అల్లు అర్జున్ సైతం నాన్ రాజమౌళి మూవీతో నార్త్ లో విజయం నమోదు చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప హిందీ వెర్షన్ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ కి నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పుష్ప 2 కోసం అక్కడి ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ దేవరతో నాన్ రాజమౌళి పాన్ ఇండియా హిట్ కొట్టాలి. అప్పుడే ఆయనకు పాన్ ఇండియా హీరో ట్యాగ్ దక్కుతుంది. ప్రేక్షకులు ఆయన్ని దేశం మెచ్చిన హీరోగా గుర్తిస్తారు.
తెలుగులో ఏ స్థాయి వసూళ్లు సాధించినా ఎన్టీఆర్ కి సంతృప్తి కలగదు. హిందీ వెర్షన్ కనీసం రూ. 100 కోట్లు సాధించగలిగితే ఆయన ఫుల్ హ్యాపీ. నార్త్ లో నిజంగా ఆయనకు మార్కెట్ ఉందని ట్రేడ్ వర్గాలు నమ్ముతాయి. దేవరకు హిందీలో ఓ మోస్తరు ఆరంభం లభించింది. కానీ పుష్ప కంటే బెటర్ అని చెప్పొచ్చు. పుష్ప ఫస్ట్ డే కేవలం రూ. 3 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్ టాక్ తో లాంగ్ రన్ లో వంద కోట్లకు చేరుకుంది.
నార్త్ లో పాజిటివ్ టాక్ వస్తే సినిమాలు ఆరేడు వారాలు స్ట్రాంగ్ గా రన్ అవుతాయి. వీకెండ్ తో పాటు గాంధీ జయంతి సెలవు దినం దేవరకు కలిసి రానుంది. చూస్తుంటే దేవర హిందీ వెర్షన్ రిజల్ట్ ఎన్టీఆర్ కోరుకునేలా వచ్చేలా ఉంది. ఇక చూడాలి ఎన్టీఆర్ కి కొరటాల ఎలాంటి ఫలితం ఇస్తాడో...
బిగ్ బాస్ హౌజ్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?