మంత్రి తలసాని వద్దకు సినీ కార్మికుల పంచాయితీ.. ఇరువర్గాలకు కీలక సూచన

By Sumanth KanukulaFirst Published Jun 23, 2022, 2:15 PM IST
Highlights

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు నిరసన కొనసాగిస్తున్నారు. బుధవారం పలువురు సినీ కార్మికులు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేయగా.. నేడు కూడా వారు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. 

తెలుగు సినీ నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫేడరేషన్ నాయకుల మధ్య వివాదం మరింత ముదిరింది. 45 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు నిరసన కొనసాగిస్తున్నారు. బుధవారం పలువురు సినీ కార్మికులు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేయగా.. నేడు కూడా వారు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. దీంతో పలు చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న 28 సినిమాల షూటింగ్ నిలిచిపోయిందని సమాచారం. మరోవైపు సినీకార్మికులు షూటింగ్‌లకు హాజరైతేనే వేతనాల పెంపుపై చర్చిస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సినీ కార్మికుల పంచాయితీ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వద్దకు చేరింది. 

నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్‌ నాయకులు వేర్వేరుగా మంత్రి తలసానిని కలిశారు. ఈ క్రమంలోనే పంతాలు, పట్టింపులు వద్దని ఇరుపక్షాలకు చెప్పినట్టుగా మంత్రి తలసాని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులతో కార్మికుల వేతనాలు పెరగలేదని చెప్పారు. మధ్యాహ్నం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించామని తెలిపారు. ఇరు వర్గాలు షూటింగ్స్ పైన రెండు రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరగాలంటే.. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు.

మంత్రి తలసాని సూచనలతో ఫిలిం ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలు చర్చలు జరపుతున్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించి ప్రధానంగా చర్చ సాగుతుంది. మరి సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. 

ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ.. తాము మాటకి కట్టుబడి ఉన్నామని, షూటింగ్‌లు ప్రారంభమైతేనే వేతనాలపై చర్చిస్తామని చెప్పారు.. ఈరోజు కూడా షూటింగ్‌లు జరగడం లేదని.. నిర్మాతలంతా ఎవరితో పనిచేయించుకోవాలో వారితో చేయించుకుంటామని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిరవధికంగా షూటింగ్‌లు ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

ఇక, నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం తలకు మించిన భారమైపోతోందని సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. 

click me!