
సీనియర్ దర్శకుడు ఎం త్యాగరాజన్ (Tyagarajan) దుర్భర స్థితిలో అనాధ శవంలా కనిపించారు. రోడ్డు పక్కన విగతజీవిగా పడున్న భౌతికకాయాన్ని స్థానికులు గుర్తు పట్టడం తో విషయం వెలుగులోకి వచ్చింది. ‘వెట్రి మేల్ వెట్రి’, ‘మానగర కావల్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం.త్యాగరాజన్ కి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం శోచనీయం.
మానగర కావల్ మూవీ భారీ విజయం అందుకుంది. విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన పోలీస్ అధికారి పాత్ర చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవిఎం ఈ మూవీని తెరకెక్కించగా, ఆ ఆ బ్యానర్ లో తెరకెక్కిన 150వ చిత్రం కావడం విశేషం. 175 రోజులకు పైగా ప్రదర్శించబడిన మానగర కావల్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంత పెద్ద భారీ హిట్ మూవీ తెరకెక్కించిన ఎమ్ త్యాగరాజన్ కి మరలా పరిశ్రమలో అవకాశాలు దక్కకపోవడం దురదృష్టకరం.
అరుబ్బుకోట ప్రాంతానికి చెందిన ఈయన.. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొందారు.వెట్రి మేల్ వెట్రి, మానగర కావల్ చిత్రాల తర్వాత ఈయనకు అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి సొంతూరికి వెళ్ళారు. అక్కడ ఒక ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన కోలుకుని మళ్ళీ చెన్నై వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
Also read ఆర్మి అధికారి సాయితేజ కుటుంబానికి అండగా మంచు విష్ణు.
దీంతో ఏవీఎం స్టూడియో సమీపంలో ఒక రోడ్డు పక్కన టెంట్ వేసుకొని నివసించేవారు. ఆ ప్రాంతంలో ఉన్న అమ్మా క్యాంటీన్‌లో కడుపునింపుకునేవారని స్థానికులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత కోలుకుని తిరిగి తాను ఉండే ప్రాంతానికి వెళ్ళారు. అయితే, ఆయన భౌతిక కాయం బుధవారం రోడ్డు పక్కన కనిపించడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.