ఆదుకోమంటే...వాడుకుంటాడు : లారెన్స్ పైనా కంప్లైంట్

By Surya PrakashFirst Published Mar 11, 2020, 10:33 AM IST
Highlights

తన సంపాదనలో చాలా భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఎంతో మందికి సహాయం చేసారు. లారెన్స్ ని దేవుడుగా కొలిచేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు లారెన్స్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.


డాన్సర్ గా రాఘవ లారెన్స్ కు మంచి పేరుంది. అక్కడ రజనీ, ఇక్కడ చిరంజీవి తమ సినిమాల్లో లారెన్స్ సాంగ్ ఒకటైనా కావాలని అడిగి పెట్టించుకునేవారు. ఆ స్దాయి నుంచి దర్శకుడుగా ఎదిగారు. హిట్ సినిమాలే డైరక్ట్ చేసారు. మరో ప్రక్క తన సంపాదనలో చాలా భాగం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఎంతో మందికి సహాయం చేసారు. ఆయన్ని దేవుడుగా కొలిచేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు లారెన్స్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అదికూడా తన తోడబుట్టిన తమ్ముడి వల్ల కావటం చెప్పుకోదగ్గ విశేషం. లారెన్స్‌కు తమ్ముడంటే చాలా ఇష్టమే ఆయన్ని వివాదంలోకి తోసింది.

వివరాల్లోకి వెళితే.. ప్రేమ పేరుతో లారెన్స్‌ తమ్ముడు ఎల్విన్‌ అలియాస్‌ వినోద్‌ తనతో పాటు చాలా మంది అమ్మాయిలను మోసం చేస్తూ శారీరకంగా వాడుకుంటున్నారని.. ఆయనకు లారెన్స్‌ సహకరిస్తున్నారని దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్ ఎస్టీ, ఎస్టీ కమీషన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే సహాయం కోసం వెళ్తే అప్పటి వెస్ట్‌ మారేడ్‌పల్లి సీఐ.. ప్రస్తుత ఏసీపీ రవీందర్‌రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమను తిరస్కరించింనందుకు వినోద్‌ గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని ఆరోపించారు. తన ఫోన్‌ నెంబర్‌ తీసుకొని వినోద్‌ ప్రపోజ్‌ చేశాడని.. తిరస్కరించడంతో చంపుతానని బెదిరిస్తున్నాడని, తన స్నేహితులను సైతం ట్రాప్‌ చేసి వారితో వినోద్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని దివ్య ఆరోపించింది. ‘వినోద్ వేధింపులను తట్టుకోలేక మొదటగా ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను. 

అయితే అక్కడ ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయకుండా  ఓ కానిస్టేబుల్‌తో మళ్లీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని వినోద్‌ చెప్పించాడు. దీంతో కేసు పెట్టకుండా వెళ్లిపోయాను. మళ్లీ కొద్దిరోజుల తర్వాత తిరిగి వేధించడం మొదలు పెట్టాడు. ఆయన వేధింపులు భరించలేక వెస్ట్‌ మారెడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పటి వెస్ట్‌ మారెడ్‌పల్లి సీఐ రవీందర్‌రెడ్డి తాను చెప్పినట్లు వింటే న్యాయం చేస్తానని అన్నారు.

కేసు గురించి మాట్లాడేందుకు ఓ లాడ్జికి రమ్మని అక్కడ నాతో అసభ్యంగా మాట్లాడారు. కులం పేరుతో దూషించారు. నాపై తప్పుడు కేసు (బ్రోతల్) నమోదు చేశారు. 2006 నుంచి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని దివ్య వాపోయింది. తనకు న్యాయం చేయాలని  ఎన్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఆమె విజ్ఙప్తి చేసింది. భాదితురాలికి అండగా ఉంటామని, ఎల్విన్, రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఎర్రోళ్ల తెలిపారు. 
 

click me!