
శతమానం భవతి, నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్లతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఐతే అనుకోకుండా తన కుంటుంబంలో పెద్ద విషాదం చోటు చేసుకుంది. దిల్ రాజు భార్య అనిత గత నెల 11న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో దాదాపు నెల రోజుల పాటు ఆయన ఇంటి నుంచి బయటికే రాలేదు. ఈ మధ్యే కొంచెం తేరుకుని బయటికి వచ్చాడు రాజు. ఈ సందర్భంగా భార్య మరణంపై ఓపెనయ్యాడు రాజు.
తన భార్య అనితకు పెద్దగా ఆరోగ్య సమస్యలమీ లేవని.. గత ఏడాది మాత్రం మోకాళ్ల నొప్పులతో బాధపడిందని రాజు చెప్పాడు. బరువు ఎక్కువయ్యావని.. 15 కిలోల దాకా తగ్గాలని తాను చెబితే.. లైపో చేయించకుంటానని చెప్పేదని రాజు తెలిపాడు. చనిపోయే ముందు రోజు తనకు పావ్ బాజీ చేసి పెట్టిందని.. తినేవరకు వదిలిపెట్టలేదని.. అదే ఆమె చేతిలో తిన్న చివరి ఫుడ్ అని రాజు తెలిపాడు. మామూలుగా తాను అర్ధరాత్రి తర్వాత ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే.. తన భార్యను నిద్ర లేవొద్దని చెబుతానని.. కానీ చనిపోయే ముందు రోజు మాత్రం రాత్రి 2 గంటలకు ఫ్లైట్ ఎక్కాల్సి వస్తే తను లేచి తనను సాగనంపిందని రాజు చెప్పాడు.
అనిత చనిపోయే సమయనికి తాను అమెరికాలో ఉన్నానని.. అప్పటికి సమయం తెల్లవారుజామున ఐదున్నర అని.. ఆ విషయం తెలియగానే పది నిమిషాల పాటు బ్లాంక్ అయిపోయానని రాజు చెప్పాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి 27 గంటలు పట్టిందని.. ఆ 27 గంటల్లో తాను నరకం చూశానని.. భార్య జ్నాపకాలతో అసలు కన్నే మూయలేదని తెలిపాడు. తాను జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని.. కానీ భార్య మరణాన్ని జీర్ణించుకోవడం మాత్రం సాధ్యం కాలేదన్నాడు.