
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల లిస్ట్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి శతమానం భవతికి జాతీయ ఉత్తమ చలన చిత్రంగా అవార్డు దక్కడం తెలిసిందే. అయితే ఈ అవార్డు దక్కడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.
విషయమేంటంటే ‘శతమానం భవతి’ సినిమా విడుదలైంది 2017లో. కానీ ఈ చిత్రం 2016 సంవత్సరానికి జాతీయ అవార్డు అందుకుంది. ఇందుకు కారణం ఈ చిత్రాన్ని 2016లోనే సెన్సార్ చేయించి.. ఆ ఏడాది జాతీయ అవార్డులకు పంపడమే. ఐతే ఇది యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదని.. ఉద్దేశపూర్వకంగానే ఆ సినిమాను గత ఏడాదే సెన్సార్ చేయించి జాతీయ అవార్డులకు పంపామని అంటున్నాడు దిల్ రాజు. ఇదంతా ‘బాహుబలి: ది కంక్లూజన్’ను దృష్టిలో ఉంచుకుని చేసిందే అని ఆయన వెల్లడించడం విశేషం.
‘‘శతమానం భవతి సినిమా ఓ క్లాసిక్ అవుతుందని అనుకున్నా. దీనికి నంది అవార్డు కూడా వస్తుందనుకున్నా. ఏకంగా జాతీయ అవార్డే వచ్చింది. 2017లో ‘బాహుబలి–2’ రిలీజ్ అవుతుంది. ఏ అవార్డులైనా చాలా వరకు ఆ సినిమాకే వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే ‘శతమానం భవతి’ సినిమాను 2016లోనే సెన్సార్ చేయించాం. నా బ్రదర్ నర్సింహారెడ్డి ఎడిటింగ్ రూంలో ‘శతమానం భవతి’ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని ఆయన అంచనా వేశారు. ఆ మాటే నిజమైంది’’ అని దిల్ రాజు తెలిపాడు. ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకోవడం తెలిసిందే. దీంతో పాటుగా అనేక పురస్కారాలు ఆ చిత్రానికి దక్కాయి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ‘బాహుబలి-2’తో పోటీ లేకుండా 2016 సంవత్సరానికే ‘శతమానం భవతి’ని అవార్డులకు పంపేశాడన్నమాట. దిల్ రాజు తెలివే తెలివి.