Vijay Sethupati: విజయ్‌ సేతుపతిపై క్రిమినల్‌ కేసు.. రూ.మూడు కోట్ల దావా

By Aithagoni RajuFirst Published Dec 8, 2021, 12:06 PM IST
Highlights

బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో విజయ్‌సేతుపతి మేనేజర్‌తో మహాగాంధీ అనేవ్యక్తి గొడవపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను విజయ్‌ సేతుపతిని టార్గెట్‌ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా క్రిమినల్‌ కేసు పెట్టారు. 

గత నెలలో జరిగిన ఎయిర్‌పోర్ట్ సంఘటన విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupati)ని ఇప్పట్లో వదిలేలా లేదు. ఆయనపై తాజాగా క్రిమినల్‌ కేసు నమోదైంది. అంతేకాదు రూ. మూడు కోట్ల దావా కూడా వేశారు. ఎయిర్‌పోర్ట్ లో Vijay Sethupati మేనేజర్‌తో మహాగాంధీ అనేవ్యక్తి గొడవపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను విజయ్‌ సేతుపతిని టార్గెట్‌ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా క్రిమినల్‌ కేసు పెట్టారు. ఇప్పటికే ఇప్పటికే సేతుపతిపై పరువు నష్టం దావా వేసిన అతను, లేటెస్ట్ గా క్రిమినల్ కేసు పెట్టారు. విజయ్, అతని మేనేజర్ జాన్సన్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు వేశారు. 

నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళుతున్నానని, బెంగళూరు విమానాశ్రయంలో విజయ్‌ను కలిశానని, అక్కడ తనను కొట్టారని, విజయ్ సేతుపతి అనుచరులు చేసిన దాడిలో నా చెవి పూర్తిగా పోయింది. శాశ్వత చెవుడు వచ్చింది. నా పరువు తీశారు` అని మహా గాంధీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నవంబర్ 2న బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతికి, మహా గాంధీకి మధ్య జరిగిన గొడవ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఆ రోజు విమానాశ్రయంలో విజయ్ సేతుపతితో మాట్లాడేందుకు వచ్చిన గాంధీ, సేతుపతిపై దాడి చేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అయింది.

ఆ సమయంలో గాంధీ మత్తులో ఉన్నారని విజయ్ సేతుపతి వర్గం వాదించింది. అయితే విజయ్ సేతుపతిపై గాంధీ దాడి చేయలేదని, ఆయన మేనేజర్ జాన్సన్‌పై దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో అప్పుడు ఎలాంటి కేసూ నమోదు కాలేదు. దీనిపై విజయ్‌ కూడా స్పందించి, ఇది పెద్ద విషయం కాదు, సమసిపోయిందన్నారు.  కానీ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. గాంధీ నటుడని, విజయ్‌ సేతుపతి ఘటన వల్ల ఆరు సినిమాల్లో నటించే కోల్పోయాడని, అందుకే మూడుకోట్ల పరువు నష్టం దావా వేసినట్టు మహాగాంధీ తరపు లాయర్‌ దినేష్‌ వెల్లడించారు. 

`దీన్ని రాజకీయం చేయడం గాంధీ ఉద్దేశం కాదు. కానీ, విజయ్ సేతుపతి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు గాంధీ మద్యం మత్తులో ఉన్నారని ఆరోపించారు. సంఘటన జరిగిన రోజు ముత్తురామలింగ తేవర్ జయంతి వేడుకలను సందర్శించడానికి వెళ్తున్నారా అని గాంధీ, సేతుపతిని అడిగారు. దానికి సేతుపతి ఇచ్చిన సమాధానం గాంధీకి బాధ కలిగించింది. నేను కూడా నీ కులం వాడిని అనుకుంటున్నావా? అని సేతుపతి అడిగారు. ఇది నిజం. తరువాత, తన అనుచరులకు చెప్పి గాంధీని కొట్టించారు` అని దినేష్‌ ప్రముఖ మీడియాతో వెల్లడించారు. 

దీనిపై విజయ్‌ సేతుపతి లాయర్ స్పందిస్తూ, `బెంగళూరు విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా, కొన్ని అపార్థాల కారణంగా సేతుపతి మేనేజర్ జాన్సన్‌తో వాగ్వివాదం జరిగిందని, దీనిపై తాను ఎలాంటి ఫిర్యాదు చేయనని విమానాశ్రయం పోలీసులకు గాంధీ లిఖితపూర్వకంగా చెప్పారు. ఇప్పుడు పరువు నష్టం దావా వేసి మాకు తీవ్ర ఆందోళన కలిగించారు. మేము కూడా గాంధీపై తగిన రీతిలో పరువు నష్టం కేసు పెట్టాలని ఆలోచిస్తున్నాం` అని లాయర్ సంపత్ తెలిపారు. 

ఇక విజయ్‌ సేతుపతి విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు. ఆయన ఇటీవల `సైరా నర్సింహారెడ్డి`, `ఉప్పెన` చిత్రాల్లో నటించారు. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన మలయాళంలో ఓ సినిమా, హిందీలో ఓ చిత్రం, తమిళంలో ఎనిమిది సినిమాలు చేస్తున్నారు. 

also read: విజయ్‌ సేతుపతిపై దాడి.. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో ఘటన..

click me!