
నందమూరి నటసింహం, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి కంట్రోల్ తప్పారు. హిందూపురంలో ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే బాలకృష్ణ చేయి చేసుకోవడంతో అక్కడున్నవాళ్లంతా షాక్ కు గురయ్యారు. ఇలా అడపాదడపా అభిమానులపై చేయి చేసుకుంటూ ఉండడంతో బాలయ్య తీరును అందరూ తప్పుబడుతున్నారు.
హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బోయపేటలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతున్న క్రమంలో బాలకృష్ణను దాటి ముందుకు వెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించాడు. అంతే బాలకృష్ణకు పట్టరాని కోపం వచ్చేసింది. వెంటనే పట్టుకొని చెంప ఛెళ్లుమనిపించేశారు.
పార్టీ కార్యకర్తపై ఇలా చేయి చేసుకోవడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే అతడిని సముదాయించేందుకు మరికొందరు కార్యకర్తలు పక్కకు తీసుకెళ్లిపోయారు. బాధితుడిని ఓదార్చారు. కొట్టిన తర్వాత కూడా బాలయ్య.. అతడివైపు అలానే కాసేపు ఆగ్రహంగా చూస్తూ ఉండిపోయారు. చివరకు పక్కనున్నవాళ్లంతా అతడిని తీసుకెళ్లిపోయారు. అనంతరం బాలయ్య యధాతథంగా ముందుకు వెళ్లిపోయి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు.
ఇలా బాలకృష్ణ తన అభిమానులపైన, కార్యకర్తలపైన చేయి చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో బాలకృష్ణ ఆగ్రహావేశాలకు చాలా మంది ఇబ్బంది పడ్డారు. సినిమా షూటింగ్ సమయాల్లోనూ, ఇటు పార్టీ కార్యక్రమాల్లోనూ చాలా సార్లు అభిమానులపై చేయి చేసుకున్నారు. దీంతో బాలయ్య విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాధ్యతాయుత పదవిలో వున్న వ్యక్తి అలా ప్రవర్తించడం సరికాదని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజా సేవ ఎలా అని విమర్శిస్తున్నారు.