
'బాహుబలి' సినిమా మళ్ళీ విడుదలవుతోంది. 'బాహుబలి ది బిగినింగ్'ని రేపు దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. కాగా హిందీ వెర్షన్ రీ-రిలీజ్‌కి కనీ వినీ ఎరుగని రీతిలో పబ్లిసిటీ చేస్తుండడం గమనార్హం. ఈ నెలాఖరున 'బాహుబలి ది కంక్లూజన్' విడుదల కానున్న నేపథ్యంలో, ఒకసారి 'బాహుబలి ది బిగినింగ్'ని చూపించడం ద్వారా 'సినిమా కంటిన్యూటీ' ప్రేక్షకులకు బాగా వుంటుందన్నది చిత్ర రూపకర్తల ఉద్దేశ్యం. ఈ విషయాన్ని ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్‌కి ఈ చిత్రాన్ని తీసుకెళ్తున్న కరణ్ జోహార్ ప్రకటించాడు కూడా.
గతంలో అయితే.. సినిమా వంద రోజులు ప్రదర్శితమయ్యాక, థియేటర్లలోంచి తీసేస్తే, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ సినిమాని రిలీజ్ చేసేవారు. అసలిప్పుడు, తొలి వారం తప్ప, రెండో వారం థియేటర్లలో సినిమా కన్పించడం చాలా అరుదైన వ్యవహారంగా తయారైపోయింది. ఈ పరిస్థితుల్లో 'బాహుబలి ది బిగినింగ్' రీ రిలీజ్ చేయటం విశేషమే.
ఇక రీ రిలీజ్‌కి సిద్ధమైన 'బాహుబలి ది బిగినింగ్' మళ్ళీ ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. 'బాహుబలి ది బిగినింగ్' రీ రిలీజ్ నేపథ్యంలో.. బాలీవుడ్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా జరుగున్నాయట.