
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా బాహుబలి. జక్కన్న రాజమౌళి చెక్కిన ఈ అద్భుత దృశ్యకావ్యం ప్రపంచమంంతా రికార్డు కలెక్షన్లు సాధిస్తూ పాత రికార్డులనన్నింటిని చెరిపేస్తూ రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఈ చిత్రం కలెక్షన్లు భారీగా ఉంటాయని ముందు నుంచీ అంచనాలున్నా... ఈస్ఠాయిలో కలెక్షన్లు సాధిస్తుందని దర్శక నిర్మాతలు కూడా అంచనావేయలేదు.
బాహుబలి 2' సినిమా విడుదలవుతున్నప్పుడు ఈ సినిమా పాత రికార్డులను తుడిచేయడం ఖాయమనే అభిప్రాయం వెలువడ్డా.... అమీర్ ఖాన్ చేసిన 'పీకే' రికార్డును టచ్ చేయడం కష్టమేనని కొంతమంది భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 'పీకే' రికార్డును 'బాహుబలి 2' అధిగమించేసింది.
వైవిధ్యభరితమైన కథా కథనాలతో తెరకెక్కిన 'పీకే' లైఫ్ టైమ్ గ్రాస్ గా 745 కోట్లను వసూలు చేసింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. అయితే 'బాహుబలి 2' కేవలం ఆరు రోజుల్లోనే 770 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఇప్పటివరకూ 'పీకే' పేరుతో వున్న రికార్డును తుడిచేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ఇప్పుడు 'బాహుబలి 2' నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ల జోరు చూస్తుంటే .. 1000 కోట్ల మార్క్ ను చేరుకోవడం కూడా కష్టమేం కాదని చెప్పుకుంటున్నారు.