కృష్ణంరాజు‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించాం.. ఆయన మృతికి కారణమిదే: ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే..

Published : Sep 11, 2022, 10:39 AM ISTUpdated : Sep 11, 2022, 10:43 AM IST
కృష్ణంరాజు‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించాం.. ఆయన మృతికి కారణమిదే: ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే..

సారాంశం

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది కృష్ణంరాజు కాలుకు సర్జరీ జరిగిందని చెప్పారు. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలిపారు. 

ఆగస్టు 5వ తేదీన పోస్టు కోవిడ్ సమస్యలతో కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్టుగా వెల్లడించారు.  ఆస్పత్రిలో చేరిన తరువాత మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరినప్పటీ నుంచి కృష్ణంరాజుకు వెంటిలేటర్‌‌పై చికిత్స అందించినట్టుగా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్టుగా చెప్పారు. 

Also Read: కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది.. కేంద్ర మంత్రి అమిత్ షా

ఇక, 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. సినిమాపై మక్కువతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. 1966లో విడుదలైన చిలకా గోరింకా చిత్రంతో  వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రెండో తరం స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. కెరీర్ లో 187 చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ మూవీలో నటించారు. తన తమ్ముడు కుమారుడు ప్రభాస్ ని నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు. కృష్ణంరాజు మరణవార్త విన్న టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, తల్లీ కొడుకులు, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తాండ్ర పాపారాయుడు, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, బావా బావమరిది లాంటి సినిమాలు  ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భక్త కన్నప్ప టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. శివ భక్తుడిగా కృష్ణం రాజు నటన అబ్బురపరిచింది. కృష్ణంరాజు 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. 

Also Read: Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు సినీ ప్రస్థానం, సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ డిటేయిల్స్.!

మరోవైపు కృష్ణం రాజు  రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీతో యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 1998‌లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత 1999లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన మరోసారి బీజేపీలో చేరారు. ఇక, కృష్ణంరాజు మరణవార్త టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, సినీ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?
Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే