నైలు నది నీళ్లలో మీ బొమ్మలు చూస్తారా...

 |  First Published Apr 1, 2017, 2:38 AM IST

 

మనకిక్కడ నయాజాతి ఒకటి ఏర్పడింది. మీ ఇష్టం ఏదన్నా చెప్పండి..ఓస్,అదా...మా దగ్గర ఎప్పుడో ఉండేది...మన దగ్గరి నుంచే అన్నిచోట్లకూ అన్నీ చేరాయి.ఇది నిజంగా నిజమా?

Latest Videos

undefined


ఆదిమానవుల గుహల్లోని వర్ణచిత్రాలు చూడండి.అవి ఏ ఖండంలోనైనా ఒకేలా ఉన్నాయి.మరి ఇన్ని రకాల భూభాగాల్లో వేలాది కిలోమీటర్ల దూరంలో నివసించిన వీళ్లకు ఏ గురువొచ్చి ఈ విద్య నేర్పాడు?


మానవుని సహజాతాలు కారణమని ఒక వాదన..జంతువుల కంటే వికసించిన మెదడు,సహజాతాలు,హార్మోన్ల వల్ల మెదడు మరింత వికసించి ఈ పనులు చేయించింది...ప్రపంచంలో ఏ మూలైనా ఇదే జరిగిందంటారు...ఎక్కడైనా ఒకే రకమైన సాంఘిక జీవనం ఉన్నప్పుడు అన్ని చోట్లా ఒకే రకమైన ఆలోచనలొస్తాయనీ అంటారు..అవి పాత,కొత్త రాతి యుగాల ఆయుధాలు కావొచ్చు,ఆ తవాత లోహయుగంలో పనిముట్లు కావొచ్చు.


ఇక నాటి సమూహాలకు జనం ఎంత ఎక్కువుంటే అంత భరోసా ఉండేది.పిల్లలు ఎలా జన్మించేది తెలియకున్నా స్త్రీ నుంచి వచ్చేది తెలుసు కాబట్టి అన్నిచోట్లా అమ్మతల్లుల ఆరాధనలుండేవి.

 

ఆ తర్వాత ప్రకృతి ఆరాధనలు వచ్చాయి..ఒక్కో ప్రాకృతిక శక్తికి ఒక్కో రూపం ఇచ్చుకున్నారు...గాలి,నీరు,భూమి,ఆకాశం,సముద్రం....రోగాలురొష్టులు,చావులకూ...
మనలాంటి ప్రాచీన నాగరికతలైన ఈజిప్ట్,గ్రీస్,రోమన్....ఏదైనా కావొచ్చు ఒకేరకమైన దేవతలు,వారి విధులు,ఆయుధాలు....కాకపోతే ఒక్కోచోట ఒక్కో పేరు.

 


ఇక మన నయాజాతి సంగతి చూస్తే...పత్రికల్లో ఎక్కడొ ఏ దేశంలోనో బయటపడ్డ ఒక ప్రతిమ ఫోటో వేస్తారు...మనవాళ్లు సోషల్ మీడియాలో ఒకటే రొద...ఇదుగో మన ఫలానా దేవతే...ఎప్పుడో మన సంస్కృతి అక్కడ వ్యాపించింది..చూసారా మనోళ్ల గొప్ప!

 


అంతేనా?అన్నిచోట్లా మన భాషే,వాళ్లది అపభ్రమ్ష రూపం...మనం వాళ్లను అలా పిలిచాము,ఇలా పిలిచాము...నిజమే మనం అలక్షేంద్ర,సికందర్ అని అలగ్జాండర్ ను పిలిచుండవచ్చు..వాళ్లు మాత్రం సండ్రకోటస్ అని రాసుకోలేదా?మనం చెప్పిన నీలా నదిని వాళ్లు నైల్ అన్నారు..ఏ వాడు మాత్రం మన సింధును ఇండస్ అనలేదా...battle of hydaspas అని జీలం నది ఒడ్డున జరిగిన యుద్ధాన్ని రాసుకోలేదా?

 


నాగరికత పెరిగాక భూ,జలమార్గాల్లో ప్రయాణించారు,వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారు..ఎన్నో సంస్కృతి,సంప్రదాయాల మార్పిడి జరిగుంటుంది...
మన సినిమాల ప్రభావంతో మనం ఉత్తరాది పండుగలను మనవిగా చేసుకోలేదా?

 

ఇక ఆ పక్కవాళ్ల నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు క్రీస్తుకు పూర్వం ఫలానా సంవత్సరాల మధ్యగా నిర్ధారించబడింది అన్నామే అనుకోండి..ఈ నయాజాతి మీదపడి రక్కేస్తారు..కాల విభజన గురించి మీకేం తెలుసు?మహాయుగాలు,యుగాలు తెలుసా?ఎన్నిసార్లు ప్రళయం వచ్చిందో తెలుసా?

 

 

అవునూ మరి ప్రళయం భూమినంతా ముంచెత్తితే వాళ్ల కట్టడాలు నేటికీ కనిపిస్తున్నాయే,మనవెందుకు లేవూ అని ప్రశ్నించకూడదు.పాశ్చ్యాత్త చరిత్రకారులు మన చరిత్రనెంత వక్రీకరించారో తెలుసా?అంటారు.మరి మిగిలిన అనేకదేశాలూ వలసపాలనలోనే ఉండేవి కదా,వాటి చరిత్ర ఎందుకు వక్రీకరించలేదో!
 


మన వేదకాలం నాటి దేవతలు,పురాణకాలం దేవతలు వేర్వేరు అయినట్లే ఈజిప్ట్ ప్రాచీన చరిత్రలోనూ ఎందరో ఉన్నారు.ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో ప్రాముఖ్యత ఉండేది.వాళ్లకు ఎన్నో ఆలయాలు నిర్మించారు.వాళ్లూ హాతోర్ అనే గోమాతను పూజించడమే కాకుండా ఆలయాలు నిర్మించారు.మనకు నదుల అధిష్టాన దేవతలుంటే వారి నైల్ నదికి హపి అనే దేవుడుండేవాడు.ఈయన అర్ధనారీశ్వరుడు.మన శివుడు నీల కంఠుడైతే ఈయన నీల వర్ణుడు.ఇక మన అరసవెల్లి లాంటి ఆలయాల్లో ప్రత్యేక దినాల్లో సూర్యకిరణాలు మూల విరాట్టును తాకేట్లున్న ఆలయ నిర్మాణాలు వారికీ ఉన్నాయి....ఇంకేం మనవే కొట్టేసారు అంటారా?ఆ భవ్య నిర్మాణాలన్నీ క్రీస్తు పూర్వం నాటివి...ఆ కాలం లో మన ఆలయాలు కలప,మట్టితో నిర్మించారని చరిత్రకారులు చెబుతారు..అసలు ఇనుము వాడాకానికి రాకపూర్వమే అద్భుత కౌశలంతో బృహత్ నిర్మాణాలు చేసారు...ఇంకేం ఈజిప్ట్ అన్నా కాబట్టి వాళ్లెందుకు మనల్ను కొట్టేయ్యలేదు?మన రాముడు..అక్కడ ఫారో రామ్‌సేస్ అంటారా?ప్రాచీన ఈజిప్ట్ ను పాలించిన మొత్తం 30 వంశాల్లో ఈయనది 19 వ వంశమే....
 


సరే ఇక కాముడు/మదన దేవత విషయానికి వస్తే ఆయన ఆరాధన క్రీస్తుపూర్వం 4000 నాటికే ఉండేది...ఆయన పేరు "మిన్".కొన్ని ప్రాంతాల్లో ఈయనకు ప్రత్యేక ఆలయాలుండేవి.


ఈయన విగ్రహం ఎన్నో రూపాల్లో ఉన్నా అన్నిట్లో పురుషాంగాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది.చాలా చోట్ల ఒక కాలు,చెయ్యితోనే కనిపిస్తాడు.పైకెత్తిన కుడి చేతిలో పంటనూర్పిడికి ఉపయోగించే పనిముట్టు ఉంటుంది.కొన్నిచోట్ల ఎడమచేత్తో పురుషాంగాన్ని పట్టుకుని ఉంటాడు....ఈయన కొన్ని రూపాల్లో వాళ్ల డేగ దేవుడు హోరస్,దేవదేవుడు అమున్ లతో కలిసి మిన్‌హోరస్,మిన్అమున్ గా పిలవబడుతుంటాడు..

 


ఈ అవతారాలు ఇద్దరు ముగ్గురిని కలిపేది మన పద్దతే..చూడండి లక్ష్మి గణపతి,సూర్య నారాయణ అంటారా?
చిత్రలిపిలో ఈయనను తెల్లని ఎద్దు,ముళ్లబాణంతో,లెట్యూస్ ఆకుల పానుపుతో చిత్రీకరిస్తారు.....
పుంసత్వానికి ప్రతీకగా భావించే ఈయన ఆరాధన గిల్లితే పాలను స్రవించే లెట్యూస్ ఆకులతో చేస్తారు..
ప్రతి ఏటా కోతల సమయంలో ఆలయం నుంచి విగ్రహాన్ని పొలాలవద్దకు తెచ్చి ఉత్సవాలు జరుపుకునేవారు...
పంట దిగుబడులు పుష్కలంగా వచ్చినప్పుడు ఆయన గౌరవార్ధం ఆనందంతో నగ్నంగా ఆడిపాడేవారు...
ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ...ఒక స్థంభాన్ని ఎక్కడం...
ఈ స్థంబాన్ని ఎక్కడం మనదేశంలో మల్లకంబ్ (దిగువ ఫోటో) గా పిలవబడుతోంది....

అక్కడ లెట్యూస్ ఆకుల పూజ చేస్తే మనం తమలపాకులు వాడుతాము..ఇంకా జిల్లేడు,గరికలు ఉండనే ఉన్నాయి...
మిన్ దేవేరులు లబెట్,రెపిట్...
మన్మధుడి దేవేరులు ప్రీతి, రతి. 
అక్కడ పంటకోతల కాలంలో పండుగ చేసుకునేవారు...మన దగ్గర అనంగ త్రయోదశి అని వసంతం వచ్చాక చైత్రమాసం జరుపుకునేవారు...హోలీ పండుగ కామదహనం కు గుర్తైతే ఇది అతని పునరాగమం అని చేసేవారేమో.
అక్కడ అంగాలు లేని మిన్ ఉన్నాడు...మన మన్మధుడూ భస్మమయ్యాక రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు కాబట్టి అనంగుడు అయ్యాడు.ఈయనకు మరో పేరు అంగహీనుడు.అంగాలు లేని వాడు అనంగుడే కదా!
మిన్ కు మరో పేరు ఖెం...మన కామ కు దగ్గరగా ఉందా?
మిన్ శబ్దానికి మన్ శబ్దం దగ్గరేగా!
అన్నీ మనవి కొట్టేసారనే బదులు మన తెలుగువారమే వీళ్లది కొట్టేసామని మాత్రం అనుకోకూడదా?
ఎందుకంటారా..ఈ మిన్ కు ప్రధమా విభక్తి చేర్చి మిండడు అన్న పదాన్ని సృష్టించుకున్నామేమో!మిండడు అంటే విటుడు అనే అర్ధం ఉంది కానీ ఉత్పత్తిలేదు.
 


ఆదిమ మానవుల గుహల్లోని వర్ణచిత్రాల్లో సారూప్యతలున్నట్లే ప్రాచీన నాగరికతల్లోని దేవుళ్లు,ఉత్సవాల్లో సారూప్యతలుండేవని తెలుస్తుంది.

 

ఇది వదిలేసి అన్నీ మనమే అందరికీ నేర్పాము,విజ్ఞానం పంచాము అనడం ఎంతవరకు సమంజసం?మన దగ్గర ఆ పద్దతులు వేల ఏళ్లగా ఉండిఉండొచ్చు,మిగిలిన చోట్ల కొత్తమతాల రాకతో అవి లుప్తమై ఉండొచ్చు.ఒకనాటి వాణిజ్య కూడలి మక్కాలోనూ ఇస్లాం కు ముందు విగ్రహారాధన ఉండేది,360 మంది దేవీదేవతలుండేవారు కాదా!
సరే...ఇవన్నీ ఒప్పుకోము అందరికీ అన్నీ పంచింది మనమే అంటారా? కానివ్వండి.... మీ ఆనందం మీది.

click me!