నాలుగున్నర లక్షల కోట్ల నల్లధనం 'హుస్ కాకి'!

First Published Aug 31, 2017, 9:19 AM IST
Highlights

ఎట్టకేలకు రిజర్వు బ్యాంకు రద్దయిన నోట్ల డిపాజిట్ల అంశానికి సంబంధించిన గణాంకాలను వెల్లడించింది.

1. 2016 నవంబరు 8న రద్దు చేయబడిన నాటికి రు.500 నోట్లు 1,716.5 కోట్లు, రు.1,000 నోట్లు 685.8 కోట్లు ఉన్నాయని, వాటి విలువ రు.15.44 లక్షల కోట్లు అయితే రు.15.26 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరిందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అంటే, డిపాజిట్ కాని నోట్ల విలువ కేవలం రు.16,000 కోట్లుగా తేల్చేసింది.  

2. కొత్తగా విడుదల చేసిన రు.500, రు.2,000 నోట్ల ముద్రణ వల్ల భారీగా వ్యయం పెరిగిందని వెల్లడించింది. 2015-16 లో ముద్రణ వ్యయం రు.3,421 కోట్లుగా ఉంటే 2016-17లో పెద్ద నోట్ల రద్దు తదనంతరం రు.7,965 కోట్లు వ్యయం అయిందని ప్రకటించింది. అంటే, కొత్త రు.500, 2000 నోట్ల ముద్రణకు భారీగా ఖర్చయ్యింది.

3. దేశంలో నల్లధనం రు.4,50,000 కోట్లు ఉండవచ్చని, అందులో రు.65,000 కోట్లు స్వచ్ఛంద ఆదాయ ప్రకటన పథకం ద్వారా వెల్లడించబడిందని ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. పాత పెద్ద నోట్ల రద్దు మూలంగా నల్లధనంలో అత్యధిక భాగం బ్యాంకులకు చేరదని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి మూడున్నర లక్షల కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుందని, ఆ మొత్తాన్ని పేద ప్రజల సంక్షేమానికి, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తామని మోడీ గారు పెద్ద నోట్ల రద్దు సందర్భంగా  ఘనంగా ప్రకటించారు. 

4. 2017 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా రు.1,25,000 కోట్ల నల్లధనాన్ని వెలికి తీశామని సెలవిచ్చారు. 

5. ఆర్.బి.ఐ. నేడు అధికారికంగా ప్రకటించిన గణాంకాలను బట్టి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాని నోట్ల విలువ రు.16,000 కోట్లు మాత్రమే. అంటే, మిగిలిన నల్లధనం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసిందన్న మాట. 

6. ఒక కోణంలో చూస్తే ఇది కాస్త సానుకూలమైన పరిణామంగా కనిపిస్తుంది.

7. పన్నులు ఎగ్గొట్టి పోగుపడ్డ నల్లధనం, తెల్లధనంగా మారిపోయింది. మరి, ప్రభుత్వ ఖజానాకు వనగూడిన ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మోడీ గారిపై ఉన్నది. 

8. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తామని, అవినీతిపై యుద్ధం ప్రకటిస్తున్నామని మోడీ గారు చెప్పిన మాటలపై విశ్వాసం పెట్టి దేశ ప్రజలు సంపూర్ణ మద్ధతు పలకడమే కాకుండా అష్టకష్టాలు పడ్డారు.

9. అసంఘటిత రంగం కుదేలయ్యింది. లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉపాథి కోల్పోయారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం తీవ్రంగా నష్ట పోయాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన చేయబడుతుందని ఆకాంక్షిస్తే, స్థూల జాతీయోత్ఫత్తి వృద్ధి రేటు గణనీయంగా తగ్గి పోయింది. 
ఏ మహత్తర లక్ష్యాల సాధన కోసమైతే పెద్ద నోట్లను రద్దు చేశారో! ఆ లక్ష్యాల సాధన ప్రశ్నార్థకమైనది. ఆర్.బి.ఐ. గణాంకాలు ఆ వాస్తవాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

10. నోట్ల రద్దు వల్ల ఒనగూరిన ప్రయోజనమేంటో బాధ్యతాయుతంగా అంచనా వేసి, జవాబుదారీతనంతో, నిజాయితీగా దేశ ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిపై ఉన్నది.

 

(*టి లక్ష్మీనారాయణ తెలుగునాట  బాాగా పేరున్న రాజకీయ విశ్లేషకుడు)

click me!