అమరావతి రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులను సింగపూర్ పర్యటనకు పంపే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. రాజధాని తొలి ఫలితం రైతుకు దక్కాలని అది తన ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం అని బాబుగారు మరోమారు ప్రకటించారు. ఇంతకీ రైతులను సింగపూర్ పంపడం వలన ప్రయోజనం ఏమిటి ? సింగపూర్ కు వెల్లిన రైతు అక్కడ నేర్చుకుని తాను అమరావతిలో చేయబోయే కార్యక్రమాలు ఏమిటి ? అన్నది నేడు ప్రజల ముందు ఉన్న అనుమానాలు.
undefined
అమరావతి రైతులు చేసింది త్యాగమా ? వ్యాపారమా ?
నూతన రాజధానికి అమరావతి రైతులు 33 వేల ఎకరాలను తన మీద నమ్మకంతో త్యాగం చేసినారని ప్రతి సభలో బాబుగారు చెప్పే మాటలు. అసలు త్యాగం అంటే ఏమిటి? ఫలితం ఆశించనిది, సమాజ ప్రయోజనానికి స్వచ్చందంగా ఇచ్చేది. ఆ కోణంలో పరిశీలించినపుడు అమరావతి రైతులు చేసింది త్యాగమా ? ఇంతకి రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఒకసారి పరిశీలించాలి..... రైతు ఒక ఎకరాను ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం 10 సంవత్సరాల వరకు ప్రతి ఎకరాపై 50 వేల చొప్పున ప్రతి ఏడాది ఇస్తుంది. ప్రతి సంవత్సరం 5 వేలు చొప్పున పెంచుతుంది. రాష్ట్ర వ్యాపితంగా రైతు బుణమాఫీ 50 వేలు మాత్రమే చేస్తే (వలసలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రాయలసీమ ప్రాతంతో సహ) అమరావతి రైతులకు మాత్రం 1.5 లక్ష్యలు చేసింది. ఇంకా అనేక సౌకర్యాలను కల్పించింది. అంతిమంగా ఒక ఎకరాభూమి ఇస్తే దాదపు 30 సెంట్లు అబివృద్ది చెందిన రాజధానిలో( 10 సెంట్లు వ్యాపార ప్రాంతంలో, మిగిలిన 20 సెంట్లు హౌసింగ్ ప్రాంతంలో) రైతుకు ఇస్తారు. అలా ప్రతి ఎకరాపై ఇస్తారు. ఒక సెంటుకు 12 అంకనాలు. హీన పక్షంలో అంకనం ఒక లక్ష ఉంటుంది. అదే వ్యాపార ప్రాంతంలో అయితే రెట్టింపు ఉంటుంది. అలా 30 సెంట్లు కు గాను 5 కోట్లు వరకు రైతుకు లభిస్తుంది. రాజధాని ప్రకటించకముందు అక్కడ భూమి రేటు ఎకరా 10 లేదా 20 లక్షలు ఉంటుంది. అంటే 10 లక్షలు విలువ చేసే ఎకరాను ప్రభుత్వానికి ఇస్తే అన్ని మౌలికవసతులు కల్పించి, అభివృద్ది చేసి రాజధానిలో 5 కోట్లకు పైగా విలువ చేసే సంపదను పొందుతారు. భూములు ఇచ్చిన రైతుకు ఆ మాత్రం లాభం చేకూరితే కచ్చితంగా అందరూ స్వాగతించాల్సిందే. కాని దానికి త్యాగం చేసినారు అని చెప్పడం అదేదో రాజధాని కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చినారు అనడం సమంజసం కాదు.
అసలు త్యాగం అంటే శ్రీశైలం ప్రాజెక్టు కోసం రాయలసీమ రైతులు చేసింది. దాదపు 100 గ్రామాలు, లక్ష మంది ప్రజలు తమ సర్వస్వం వదులుకొని పరిమిత నష్టపరిహరంతో తమ సంపదను ప్రాజెక్టు కోసం త్యాగం చేసినారు. కాని ఆ ప్రాజెక్టులో చుక్కనీరు కూడా త్యాగం చేసిన ప్రాంతానికి ఇప్పటికి ఇవ్వలేదు.
అమరావతి రైతులలో అంతర్మథనం ప్రారంభం.....
ప్రారంభంలో రైతులు చాలా ఉత్సాహంగా భూములు ఇచ్చినారు. దానికి కారణం ప్రభుత్వం చెపుతునట్లు బాబుగారి మీద నమ్మకంతో కాదు, బాబుగారు రాజధానిలో తమకు కల్పించే ప్రయోజనాల కోసం మాత్రమే. కాకపోతే బాబుగారు తమకు ఆలాంటి ప్రయోజనాలు కల్పిస్తారు అన్న నమ్మకం మాత్రం అక్కడి రైతులలో ఉంది. కాని నమ్మకం ప్రభుత్వం అనుసరించే పద్దతులమీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి మీద నమ్మకం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పటికి రైతులతో ఒప్పందం చేసుకుని 3 సంవత్సరాలు కావస్తుంది. కాని అడుగు ముందుకు పడటం లేదు. రాజధాని విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్దతులపై అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ చాలా విషయాలలో ప్రతిపక్ష నేత మాట్లాడితే రాజధానికి వ్యతిరేకం అని అంటారనే కారణంతో క్రీయాశీలకంగా లేరు. ప్రభుత్వానికి మొదట జగన్ వైఖరి బాగున్నా, నేడు రాజధాని పనులు ప్రారంభం కాకపోవడానికి ఇతరుల మీద నింద వేయాలన్న సాధ్యం కావడం లేదు. అందులోనూ ఎంపిక చేసుకున్న ప్రాంతానికి పరిశ్రమలు రావడం కష్టం. అక్కడ కనీస మౌలిక వసతులు ప్రారంభం కాలేదు. మౌళిక వసతులు ప్రారంభం కాకపోవడం ఫలితంగా సంస్దలు రావడం లేదు. ఇప్పటి వరకు కనీసం డిజైన్ లు కూడా పైనల్ చేయలేదు. ఆర్దిక పరిస్దితి చూస్థా ఉంటే నిరాశాజనకంగా ఉంది. రాబోవు కాలం ఎన్నికల కాలం.
నంద్యాల తరహ పలితాలు చూసిన బాబుగారు ఇక మీద చేయబోయే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వైపే ఉంటాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. రాజధాని లాంటి దీర్గకాలిక వ్యవహరాలపై అంత శ్రద్ద పెట్టకపోవచ్చు. రాజధాని చుట్టు ఉన్న ప్రాంతాలలో ఎకరా స్దలం 50 లక్షల నుంచి నేడు 35 లక్షలకు పడిపోయింది. ఈ నేపథ్యం వల్లే బాబుగారి మీద నమ్మకంతో భారీ అంచనాలతో భూములిచ్చిన అమరావతి రైతులలో అపనమ్మకం కలగకపోయినా అంతర్మధనం ప్రారంభమైనది.
మార్పును గమనించిన ప్రభుత్వం ప్రజలలో వచ్చిన మార్పును పట్టించుకోకపోతే అది కాస్త అసంతృప్తికి దారి తీసి రాజధానిలోనే ప్రతికూల పరిస్దితులకు దారి తీయవచ్చునన్న అంచనాకు వచ్చింది. మరో వైపు రాజధాని తాము కోల్పోయామన్న బాధ రాయలసీమ ప్రజలలో, రాజధానిని తప్ప మరో ప్రాంతాన్ని మట్టించు కోవడం లేదని మిగిలిన ప్రాంతాల ప్రజలలో అసంతృప్పి వస్తున్న సందర్భంలో చివరకు రాజధానిలో కూడా రాజకీయ వ్యతిరేక బీజాలు నాటుకుంటే అది ప్రమాదంగా భావించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. అదే రాజధాని రైతుల సింగపూర్ యాత్ర. సింగపూర్ ను అమరావతిలో నిర్మిస్తామన్న బాబుగారు అది దరిదాపులలో కూడా కనిపించకపోవడంతో నిజమైన సింగపూర్ ను రాజధాని రైతులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
కాని బాబుగారు గమనించాల్సింది సింగపూర్ ను నేరుగా చూసిన ప్రజలు అక్కడి నిర్మాణాలను చూసి సంబరపడి ఎప్పటికైనా మా బాబుగారు అమరావతిలో సింగపూర్ తరహా రాజధానిని నిర్మించకపోతారా అన్న ఆశతోనే ఉంటారను కోవడం అత్యాశే అవుతుంది. ఏపి ప్రజలు సింగపూర్ ను చూడకపోయినా అంతకు మించిన చిత్రాలు బాబుగారు ఇప్పటికే చాలా చూపారు. బహుశా అక్కడికి వెల్లి చూసే దానికన్నా చూడకుండానే చాలా చూపారు. దాన్ని చూసిన ప్రజలు అంతటి సింగపూర్ ను అమరావతిలో నిర్మించడం సాధ్యమా, బాబుగారు నడుస్తున్న పద్దతిలో, కేంద్రం సహయం చేస్తున్న తరహలో సింగపూర్ లాంటి రాజధాని నిర్మించడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి కూడా వస్తారు అన్న విషయం కూడా ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా బాబుగారు తాను కలలు కంటూ ప్రజలను కూడా కలలలోనే విహరింప చేస్తూ ఎక్కువ కాలం గడపడం సాధ్యం కాదని గమనించాలి.
(*రచయిత రాజకీయ విశ్లేషకుడు, ఫోన్ నెం. 9490493436)