విశాఖను కాటేస్తున్న కాలుష్యం

 |  First Published Nov 16, 2016, 6:06 AM IST

అందమైన పకృతి పరిసరాలలో నెలకొన్న విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నమహా నగరం. వేగంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్నది. ప్రస్తుత అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన మహానగరం ఇదొక్కటే. రాజకీయ రాజధాని అమరావతిని అయితే, ఆర్థిక రాజధాని విశాఖ అంటున్నారు. 

అయితే ఇదే సమయంలో  చిరకాలంగా పర్యావరణ పరంగా  తగు జాగ్రత్తలు తీసుకొనక పోవడంతో దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా కూడ ఇపుడు  ముందుకొస్తున్నది. ప్రాణుల జీవనానికి పనికిరాని నగరంగా కూడా మారుతున్నది. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడం అటుంచి ప్రస్తుతం ఉన్న పరిశ్రమలలో కనీసం సగం పరిశ్రమలను ఇక్కడినుండి తరలిస్తే గాని ఈ నగరం ప్రజాజీవనానికి అనుకూలంగా ఉండబోదని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

 

Latest Videos

undefined

పూర్వకాలంలో సముద్ర, నదీ జల రవాణాకు అవకాశం ఉన్నచోటల్లా వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. అదే విధంగా విశాఖపట్నం నుంచి కూడా జలరవాణాపై ఆధార పడిన వర్తకం పురాతన కాలం నుండి సాగింది. వాణిజ్య అవసరాల కోసం ఈ ప్రాంతంలో ఒక నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించడంతో యారాడ కొండగా స్థానికులు పిలుచుకునే డాల్ఫిన్ నోస్ సముద్రం లోపలికంటా చొచ్చుకొని ఉండడంతో నౌకల లంగరుకు అనువైన స్థలం వారికి ఇక్కడ లభ్యమైనది. లంగరు వేసి ఉన్న నౌకలకు తుఫాన్ నుండి ఈ కొండా రక్షణ ఇస్తుందని ఇక్కడ 1933లో  ఓడరేవు నిర్మాణం పూర్తి చేశారు. 

అయితే ఈ ప్రాంత భౌగాలిక ఆకృతి, గాలి వాటం కారణంగా వాయు కాలుష్యం ఎటూ పోకుండా నగరంలోనే నిలిచి ఉండేటట్లు చేస్తుందని, దానితో నగర జీవనం విషపూరితం అవుతుందని అప్పట్లో గ్రహించలేక పోయారు. నగరానికి ఒకవైపు బంగాళాఖతం ఉంటె మిగిలిన మూడు వైపులా తూర్పు కనుములు వ్యాపించి ఉన్నాయి. వీటి మధ్య సుమారు 265 కి మీ విస్తీర్ణంలో నగరం చాలావరకు విస్తరించి ఉన్నది. 1933లో ఇక్కడ ఓడరేవు నిర్మాణం పూర్తి కావడంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు సహితం వేగంగా విస్తరిస్తూ వచ్చాయి. ప్రభుత్వ,  ప్రైవేట్ రంగాలలో భారీ పరిశ్రమలకు వేదికగా మారింది. 

నగరానికి నైరుతి దిక్కున పలు భారీ పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి ఎనిమిది నెలలపాటు, అంటే మార్చ్ నుండి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు, ధూళి కాలుష్యాలు గాలివాటంతో నగరాన్ని తాకుతున్నాయి. సుమారు 300 నుండి 500 మీటర్ల ఎత్తుగా ఉండే ఈ కొండలు ఈ కాలుష్య వాయువులకు అడ్డుగా నిలబడి, వెనక్కు నెట్టి వేయడంతో నగరంలోనే అవి తిష్ట వేసుకొనేటట్లు చేస్తున్నాయి. ఇక శీతాకాలంలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా కాలుష్యభరిత వాయువులు, హానికర ధూళి పదార్ధాలు వాతావరణంలో పైకి పోలేక భూమి మీదనే కేంద్రీకృతం అవుతున్నాయి. దానితో భూసమీప ఉష్ణోగ్రతలతో అవాంఛనీయ మార్పులు జరుగుతున్నాయి. 

సాధారణంగా భూమి మీద వేడి గాలులు, ఆ పైన చల్ల గాలులు ఉంటూ ఉంటాయి. ఇవి శీతాకాలంలో తారుమారు అవుతూ ఉండడంతో కింద చల్ల గాలులు, పైకి  వేడి గాలులు పొరలవలె విస్తరించి పై పొరలోకి చేరిన వేడి గాలులు భూమికి దగ్గరగా చేరిన చల్లటి గాలులతో పేరుకొని ఉన్న హానికర ధూళి పదార్ధాలను ఉపరితల వాతావరణంలోకి పోనీయడం లేదు. అంటే వేడి గాలులు కింద వ్యాపించిన కాలుష్య భరిత వాయువులను, పదార్ధాలను పైకి పోనీయకుండా చేస్తున్నాయి. ఈ కారణాలతో ఏడాది పొడవునా నగరవాసులు కాలుష్య కోరల్లోనే నివసింపవలసి వస్తున్నది. 

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2009లో విశాఖ నగరాన్ని దేశంలోనే అత్యంత తీవ్ర కాలుష్య కోరల్లో ఉన్న నగరంగా పేర్కొన్నది. కొత్తగా మరే పరిశ్రమకు ఈ నగరంలో అనుమతి ఇవ్వకూడదని కూడా హెచ్చరించింది. అయితే పారిశ్రామిక వేత్తల వత్తిడితో కాలుష్యం అదుపులోకి వచ్చినదని నెపంతో 2013లో కాలుష్య నగరాల జాబితా నుండి విశాఖపట్నం ను తొలగించారు. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారి ఉపగ్రహం సర్వే ప్రకారం కోచ్చి తరువాత దేశంలో అత్యంత కాలుష్య నగరంగా విశాఖను పేర్కొన్నది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సెస్ కూడా అదే స్పష్టం చేసింది. 2011లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఏదైనా ఒక పరిశ్రమకు కొత్తగా అనుమతి ఇవ్వాలి అంటే ముందుగా ఆ పరిశ్రమతో పాటు, ఇతర పరిశ్రమలు కలసి ఉమ్మడిగా `పర్యావరణ ప్రభావ అంచనా' నివేదికను ఉమ్మడిగా తయారు చేయవలసి ఉంటుంది. కానీ ఎవ్వరికీ వారు సొంతంగా ఒక నివేదికను సృష్టించుకొని, కొత్త పరిశ్రమలకు అనుమతులు పొందుతూ ఉండటం కాలుష్య అంశాలపై ప్రభుత్వ నిర్లక్ష్య, ఉదాసీన ధోరణులను వెల్లడి చేస్తున్నది. 

 

విశాఖపట్నం జిల్లాలో నేడున్న మొత్తం 1095 పరిశ్రమలు దాదాపుగా ఈ నగరంలోనే కేంద్రీకృతం అయి ఉన్నాయి. ఇవి గాక భారత నావికా దళానికి ఇది ప్రధాన కేంద్రం. ఇవ్వన్నీ పర్యావరణ పరంగా చేస్తున్న అనర్ధాల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు పట్టించుకొనక పోవడం దురదృష్టకరం. నగరంలో ఓడరేవు, పరిశ్రమల ద్వారా వ్యాపిస్తున్న కాలుష్యంతో పాటు సమీపంలోని అటవీ ప్రాంతంలో బాక్సైట్ గనుల త్రవ్వకాలు పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ తవ్వకాలు అన్నింటిని నిలిపి వేయాలని పర్యావరణ వేత్తలు ఎంతగా కోరుతున్నా ప్రభుత్వాలు పట్టికిన్చుకోవడం లేదు. 

ఒకప్పుడు సహజసిద్ధంగా నౌకాశ్రయం ఉన్నదన్న కారణంగా పరిశ్రమలను ఈ ప్రాంతంలో ప్రోత్సహించి ఉంచవచ్చు. ఉద్యోగాల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం స్థానికులు పోరాడి మరీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. అనేక గ్రామాలను కలుపుకొని నేడు గ్రేటర్ విశాఖగా ఆవరించిన మహానగరంలో 18 లక్షల మంది వరకు ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు వెలువరిస్తున్న కాలుష్యాన్ని, వాటితో సంభవిస్తున్న ప్రమాదాలను అవి పరిశ్రమల సిబ్బందికి కాకుండా మొత్తం నగర ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని ప్రభుత్వం గ్రహించాలి. పరిశ్రమలు ఎలా వచ్చినా, అవి ఏ ప్రయోజనం చేకూర్చినా నేడు ప్రజల ఆరోగ్యాలకు, ప్రాణాలకు ముప్పుగా పరిణమించడాన్ని ప్రభుత్వం తీవ్రమైన అంశగా పరిగణమించాలి. 

కాలుష్య  మూలం ఓడరేవులోనే  

తూర్పు సముద్ర తీరంలో ప్రముఖమైన ఓడరేవుగా పేరొందిన విశాఖపట్నం ఓడరేవు కాలుష్యానికి మూలకేంద్రంగా ఉండటం ఆందోళన  కలిగిస్తున్నది. గత వేసవిలో దీని నుండి ఎగిరి వచ్చిన ధూళి నగరాన్ని కమ్మడంతో ఏప్రిల్ లో ప్రమాదకర స్థాయిలో గాలిలో ధూళి  నమోదయింది. నగరంలోని అనేక ప్రాంతాలలో ఇళ్ల గోడలు, కిటికీలు,  గచ్చులు,ఏ సి యూనిట్లు,  కార్లు, వంట పాత్రాలపై ధూళి దట్టంగా పేరుకు పోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఓడరేవు కాలుష్య  సమస్యను గత రెండు దశాబ్దాలుగా నగర ప్రజలు లేవనెత్తుతూనే ఉన్నారు. 

ఈ విషయమై పౌరుల సంక్షేమ సంఘం 1997లో ఒక పిటిషన్ ను దాఖలు చేయడంతో బహిరంగ విచారణ జరిపి, ఓడరేవు కు తగు సూచనలు ఇవ్వమని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని హై కోర్ట్ 1999లో ఆదేశించింది. ఈ విషయమై మండలి కొంత కసరత్తు జరిపి మార్చ్, 2000 నుండి ఆరు నెలల పాటు తీసుకోవలసిన చర్యల గురించి,  జులై,2001లో చేపట్టవలసిన చర్యల గురించి ఆదేశాలు ఇచ్చింది. పోర్ట్ యాజమాన్యం  పట్టించుకోలేదు. 

పోర్ట్ వ్యాపారంలో సగ భాగం `డర్టీ కార్గో' గా భావించే బొగ్గు దిగుమతి, ఇనుప ఖనిజం ఎగుమతులు కావడం గమనార్హం. ధూళి కాలుష్య వ్యాప్తికి ఇవే ప్రధాన కారణం. సముద్రం నుండి యార్డ్ కు బొగ్గు రవాణాకు కన్వేయర్ బెల్ట్ సదుపాయం ఏర్పాటుతో ధూళి ఒకింత తగ్గినా పరిగణలోకి తీసుకొనే స్థాయిలో లేదు. 

ఇక ముడి ఇనుమును బెల్ట్ కన్వేయర్, ఓర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ ల ద్వారా ఓడలలో ఎక్కిస్తూ ఉంటారు. ఈ బెల్ట్ నుంచే ధూళి ఎగిరి పడుతూ ఉంటుంది. పోర్ట్ నుండి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతుంటే, పోర్ట్ విస్తరణ పేరుతో వన్ టౌన్ లోని ప్రజలను గెంటివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండడం పట్ల స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికిపుడు గంగవరం రేవు కూడా తోడయింది.ల

ప్రాణాంతకంగా మారిన ఔషదగిరి 

ఉన్న కాలుష్య ప్రమాదాలకు తోడుగా అన్నట్లు పరవాడలో ఔషధ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్ధిక మండలి అటు పర్యావరణ నియమాలను తుంగలో తొక్కడంతో పాటు పారిశ్రామిక భద్రతను సహితం నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో ప్రజల పాలిట మృత్యు వాహికగా మారింది. ఇక్కడ మొలచిన పచ్చగడ్డి తిన్న పాపానికి మూగజీవులు హరిమన్న సంఘటనలు అనేకంగా ఉన్నాయి. నెల సహితం కాలుష్యం కావడంతో పంట పొలాలు పనికి రాకుండా పోతున్నాయి. మహిళలకు గర్భం నిలవడం లేదని, పసిపిల్లల ఎదుగుదల కుంటుపడినట్లు స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు కొబ్బరి నీళ్లవలె ఉండే ఈ ప్రాంత నీళ్లు ఇప్పుడు స్నానికి కూడా పనికి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ గాలి పీల్చితే దగ్గు, ఆయాసం రావడంతో పాటు  చర్మ వ్యాధులు సోకుతున్నాయి. 

ఫార్మా సిటీ లోని కొన్ని కంపెనీలు ఔషధ వ్యర్ధాలను పాలిథిన్ సంచులలో పెట్టి పరవాడ ఊరచెరువు గట్టుమీద, రహదారి వెంబడి వదిలి వేసిన వార్తలు స్థానిక పత్రికలలో వచ్చాయి. ఫార్మా కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో రాగి, సీసం, పాదరసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు ఉంటూ ఉండడంతో అవి గర్భస్రావాలు కావడానికి, పిల్లల ఎదుగుదల లోపాలకు, చర్మ వ్యాధులకు కారణం అవుతాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫార్మా సిటీ లో ఇప్పటికి జరిగిన 30 పారిశ్రామిక ప్రమాదాలలో 24 మంది మృతి చెందారని, 63 మంది గాయపడ్డారని అధికార గణాంకాలే తెలుపుతున్నా చట్ట ప్రకారం సేఫ్టీ సమావేశాలు జరపడం, తగు చర్యలు తీసుకోవడం చేయడం లేదు. ఫార్మా సిటీ లో ఉన్న 92 పరిశ్రమలలో సగం మాత్రమే భద్రత ప్రమాణాలు పాటిస్తున్నట్లు గత మే లో జిల్లా అధికార యంత్రంగం జరిపిన భద్రత తనిఖీలో తేల్చారు. అయినా భద్రతా పరంగా అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. 

అణుప్రమాదం అంచున ఉత్తరాంద్ర 

ఈ కాలుష్యంతో పాటు ఈ ప్రాంతం తాజాగా అణు కాలుష్య ప్రమాదం అంచున చేరడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. పరిశ్రమలు అన్ని ఒకే సముదాయం వలే కేంద్రీకృతం కావడంతో పాటు అదే ప్రాంతంలో రెండు అణు జలాంతర్గామాలు - ఐ ఎన్ ఎస్ చక్ర, ఐ ఎన్ ఎస్ అరిహంత్ ఇప్పుడు చేరాయి. పైగా నగరానికి సమీపంలో మరో రెండు అణు పరిశ్రమలు కూడా వస్తున్నాయి. 65 కి మీ దూరంలోని కొవ్వాడలో 600 మెగా వాట్ల అణువిద్యుత్ కేంద్రం, 20 కి మీ దూరంలో గల అచ్చుతాపురం వద్ద బాబా అణు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ కలిపి విశాఖపట్నంను మరింతగా ప్రమాదం అంచున చేరుస్తున్నాయి. 

 

ఈ అంశాలపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తక్షణం దృష్టి సారించి, సమగ్రమైన అధ్యయనం జరిపి ఉత్తరాంధ్రను కాలుష్య కోరల నుండి కాపాడేందుకు కఠినమైన చర్యలను తీసుకోవాలి. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో క్రియాశీలకంగా వ్యవహరించాలి. 

 

 

click me!