స్కాట్లాండ్ లోని ‘ఫ్లాడెన్’ యుద్ధంతో పద్మనాభయుద్ధాన్ని ఆంగ్ల రచయితలు పోల్చినా ఇక్కడి మేధావులు, చరిత్రకారులు మాత్రం ఈ పోరాటాన్ని పూర్తిగా విస్మరించారు. దీనిని పాఠ్యాంశంగా చేసి, ప్రభుత్వమే ఏటా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంగా నిర్వహించాలన్నది ఈ ప్రాంతీయుల కోరిక.
undefined
తెలుగువారి ఆత్మాభిమాన పోరుకు ప్రతీక పద్మనాభయుద్ధం. ఆత్మగౌరవానికి భంగం కలిగినపు డల్లా కళింగాంధ్ర కన్నెర్ర చేస్తూనే ఉంది. ఆకలిమంటలు రేగినపుడల్లా పోరుబాటపడుతూనే ఉంది. అది సొంత పాలకులయినా, పరాయిపాలకులయినా వారి పాలన, పద్ధతులు నచ్చకపోతే గళ మెత్తడమే కాదు అవసరమైతే ఆయుధం పట్టడం ఈ ప్రాంతానికి ఇష్టమైన పని. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలకు నిలయంగా నిలిచిన ఉత్తరాంధ్ర నేలలో జరిగిన ‘పద్మనాభయుద్ధం’ కూడా అదే కోవకు చెందుతుంది.
విజయనగరాధీశుల పౌరుషానికి, తెలుగువారి పోరాటానికి, ఉత్తరాంధ్ర వీరోచిత పోరుకు ప్రతీకగా నిలిచిన ఈ ఘటన తెల్లవాడిపై భారతీయుడు సంధించిన తొలి బాణమని చెప్పక తప్పదు. ప్రథమ స్వాతంత్య్ర సమరానికి 63 ఏళ్ల ముందే బ్రిటీష్ సామ్రాజ్యవాదులపై ఉత్తరాంధ్ర నేలలో జరిగిన ఈ తిరుగుబాటును చరిత్రకారులు, పాలకులు, పరి శోధకులు విస్మరించినప్పటికీ ఆ పోరాటం తర్వాత కాలంలో ఉత్త రాంధ్రలోనే కాక భారతావనిలో మరెన్నో ఉద్యమాలకు ఊత మిచ్చేదిగా నిలిచింది. నేటికీ స్ఫూర్తిని పంచుతోంది.
1794 జూలై 10వ తేదీన కళింగాంధ్ర నేలలో పద్మనాభం ప్రాంతంలో (నేడది విశాఖ జిల్లాలో ఉంది) బ్రిటీష్ సైన్యాలకు, విజయనగరం సంస్థానాధీశులకు మధ్య జరిగిన పోరు తర్వాత కాలంలో ఒక పొలికేకగా మారింది. ఒప్పందం ప్రకారం చెల్లించ వలసిన కప్పాన్ని ఇంకాస్త పెంచి అదనంగా చెల్లించాలని, సైన్యం సంఖ్య తగ్గించుకోవలసిందిగా విజయనగర పాలకుడు చిన్నవిజయరామరాజును బ్రిటీష్‌వాళ్ళు డిమాండ్ చేశారు. బ్రిటీష్ వాళ్ళు బకాయిలుగా డిమాండ్ చేస్తున్న 8లక్షల యాభైవేల పెస్కాలను తాను చెల్లించవలసిన అవసరం లేదని, ఒప్పందం ప్రకారం చెల్లించిన వలసి కప్పం మొత్తం ఇప్పటికే చెల్లించానని, సైన్యం సంఖ్య ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించబోనని బ్రిటిషర్లకు విజయరామరాజు గట్టిగా సమాధానమిచ్చారు. దాంతో ఆగ్రహించిన బ్రిటీష్‌వాళ్ళు విజయనగరాన్ని అక్రమించారు. విజయనగరం నుంచి విజయరామరాజు పద్మనాభం ఊరికి వద్దకు మకాం మార్చారు. మద్రాస్ గవర్నర్ సర్ చార్లెస్ ఓక్లే తరపున కల్నెల్ పెండర్‌గస్ట్ బ్రిటీష్ సైన్యానికి నాయకత్వం వహించాడు. పద్మనాభం వద్ద మకాం వేసిన చిన్న విజయ రామరాజుపై దొంగదెబ్బతీయడానికి పథకం రచించారు.
విజయరామరాజు ఒకవైపు బ్రిటీష్ దౌత్యులతో రాయబారం నడుపుతూ, సామరస్యపూర్వక పరి ష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే అర్ధరాత్రి వేళ దాడికి బ్రిటీష్‌వాళ్ళు రంగం సిద్ధం చేసు కున్నారు. అంగబలాన్ని, అధికారాన్ని ఉపయోగించి విజయనగరం సంస్థానాన్ని వశపరచుకోవాలనుకునే బ్రిటీష్ మూకల కుటిల యత్నాలకు, ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలన్న తెల్లదొరల ఆదేశాలకు బెదరని విజయనగర సంస్థాన పాలకుడు, పూసపాటి వంశీయుడయిన చిన విజయరామరాజు బెదరలేదు. సరిగదా, బ్రిటీష్‌వారితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు.
సంస్థానాన్ని ఆక్రమించుకునే ప్రతిపా దనలో భాగంగా బ్రిటీష్ పాలకులు తెరమీదకు తెచ్చిన పన్ను బకాయి అంశానికి కూడా ససేమిరా అన్నారు. సంస్థానాన్ని వశపరచుకొని చిన విజయరామరాజుకు పెన్షన్ ప్రకటించి మద్రాస్ పంపించాలన్న బ్రిటీష్‌వారి నిర్ణయంపై విజయనగర సంస్థానం కన్నెర్ర చేసింది. ఇక మిమ్మల్ని ఈ దేశం నుంచి సాగనంపక తప్పదని ఆంగ్లేయులపై ఏకంగా యుద్ధాన్ని ప్రకటించింది ఈ సంస్థానం. అంతకు ముందు కొండూరు యుద్ధంలో ఫ్రెంచివారిని తుదముట్టించిన చరిత్ర సొంతం చేసుకున్న విజయనగర రాజులు అదే స్ఫూర్తితో బ్రిటీష్‌వారిపై కూడా పోరుకు సై అన్నారు. అనంత పద్మనాభ స్వామి సన్నిధి లోనే వ్యూహరచన చేసి పోరుబాట పట్టారు. విజయనగర రాజులు తిరుగుబాటు సమాచారాన్ని తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం కలవరపాటుకు గురయింది.
దీన్ని అణిచివేసేందుకు 1794 మే 29వ తేదిన కల్నల్ ఫ్రెండర్ గార్డు నేతృత్వంలోని అయిదు కంపెనీల సైన్యాన్ని భీమిలి ప్రాంతంలో మోహ రించింది. యుద్ధమో, మద్రాస్ వెళ్ళేందుకు సిద్ధమవడమో తేల్చుకోవాలని బ్రిటీష్ సైన్యం ఆదేశాలను విజయరామరాజు ధిక్కరించారు. తన నాలుగువేల సైన్యంతో పద్మనాభం వద్ద యుద్ధానికి సిద్ధమ య్యారు. అయితే గాఢ నిద్రలో ఉన్న విజయనగరం సైన్యం పై తెల్లవారకముందే బ్రిటిష్ మూకలు దాడిచేసి భయభ్రాంతులకు గురిచేశారు. పరిస్థితిని అంచనా వేసిన విజయరామరాజు తన వెంట వచ్చిన సైన్యంతో కలిసి తెల్లదొరలపై జూలై 10వ తేదీన పోరాడారు. అయితే విజయనగరం సైనికుల్లో ఒకడు శత్రుసేనానితో చేతులు కలపడంతో దొంగదారిలో వచ్చి తెల్ల దొరలు కురిపించిన గుండ్ల వర్షానికి చిన విజయరామరాజుతో పాటు సుమారు మూడు వందల మంది సైనికులు, సామంత రాజులు నేలకొరిగారు. వీరి తిరుగుబాటు తెల్లవారి వెన్నులో వణుకు పుట్టించింది.
అంతేకాకుండా తర్వాత తరాలకు, తర్వాత జరిగిన అనేక ఉద్యమాలకు ఊపిరిగా, ఉత్తేజంగా నిలిచింది. విజయరామరాజు సంస్మరణ దినాన్ని ఏటా పద్మనాభయుద్ధ ఘటనగా నిర్వహించుకోవడం ఉత్తరాంధ్ర లో ఆనవాయితీగా వస్తున్నది. పద్మనాభయుద్ధానికి గుర్తుగా రెండో విజయరామరాజు సమాధిని, స్మారకమందిరాన్ని మండల కేంద్రమయిన పద్మనాభంలో నిర్మించారు. ఆంగ్ల రచయితలు, స్కాట్లాండ్ లోని ‘ఫ్లాడెన్’ యుద్ధంతో పద్మనాభయుద్ధాన్ని పోల్చినా ఇక్కడి మేధావులు, చరిత్రకారులు మాత్రం ఈ ఘటనను పూర్తిగా విస్మరించారు.
(రచయిత జయంతి చంద్రశేఖర్ రావు చరిత్ర పరిశోధకులు. విశాఖ వాసి)