కల్లూరు వారి 120వ జయంతి సందర్భంగా ఈ వ్యాసం
undefined
స్వాతంత్రోద్యమ సమయంలో ఒక వ్యక్తిని గాంధిజీ "మీ ఉరిలో చదువుకొన్నవారెందరున్నారు" అని అడిగారు. “50 మంది ఎస్ఎస్ఎల్సి పాసయ్యారు. ఊరు వదలి పెట్టి వెళ్లి పోయారు. నేను ఫైల్ అయ్యాను. దిక్కు లేకుండా ఇక్కడే ఉన్నాను" అన్నారు.
అదే వ్యక్తి, 1950 దశకములొ, ఒక రోజు, బ్రాహ్మీ ముహుర్తములొ అనంతపురం జిల్లా, హిందూపురంలో హైదరాబాద్ రైలు దిగి జట్కా ఎక్కారు ఇంటికివెళ్లేందుకు. ఇంటి దగ్గర జట్కా దిగి, బండివాడికి పది రుపాయల నోటిచ్చారు. జట్కా వాడు: "స్వామీ, ఎనిమిదణాలకొరకు, పది రూపాయిలిస్తె, చిల్లర ఎక్కడుంది? అంగడ్లు/హోటేళ్లు కూడా తెరువలేదుగదా? ఇంకొరోజు ఇవ్వండి." అన్నాడు. "లేదు, సాయిబు, పది రూపాయిలు మొత్తం నీకే". అన్నారాయన. ఆశ్చర్య చకితుడైన బండివాడు చూస్తుండగా: "జీవితములొ నన్ను ’ముందుకు రండి’ అని పిలిచెవాడు నీవొకడెరా. అందుకే ఈ ఇనాము పో. నా దగ్గర ఇంక పైసలు లేవు. ఉండి ఉంటె ఒకనూరు రూపాయిలయినా ఇచ్చెేవాడిని" అన్నారు.
విశాఖ జిల్లా మన్యం ప్రాంతములొ అల్లూరి సీతారామ రాజును చంపి, ప్రజల ఆగ్రహానికి గురైనా బ్రిటిష్ ప్రభుత్వంవారితొ మన్నన పొందిన అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఉన్నరుథర్ ఫోర్డ్ ని కలువడానికి అదే మహానుభావుడు కలెక్టర్ కార్యాలయం వెళ్ళారు.
సందర్శకులకు ఆసనాలు లేవు. కుర్చీలొ కూర్చొని ఉన్న కలెక్టర్ గారిని చూసి, కదలకుండా, మెదలకుండా, ఆగ్రహావేశాలకు లోనుకాకుండా, మేజా ఎక్కి, కాలు కింద వేసుకొని కూర్చున్నారు.
ఈ అవమానం సహించలేని కలెక్టర్ గారు: "నీకెంత పొగరు, దిగు కిందికి అన్నారు. "మీ స్థానం, నా కాళ్ల కింద, అని సూచిస్తున్నాను" అనగా, పరువు నష్టం దావా దాఖలయింది. ఆరు నెలల కఠిన జైలు శిక్ష అనుభవించారు. అదే రూథర్ ఫోర్డ్ తో తరువాత రోజుల్లో ’కాంగ్రెస్ సింహం’ అనిపించుకొన్నారు. రాయలసీమాలో పాళెగార్ల ‘దోపిడి’ అణచేయడానికి వారిని గుర్తించి చెప్పమని పాలకులు అడిగితె: "మాదేశంలొ ఎవ్వరు దొరలు, ఎవరు దొంగలు అనే విషయాన్ని నిర్ణయించె మీరే పెద్ద దొంగలు" అన్నారు. .
ఆ మహానుభావుడేవరో తెలుసా? త్రికరణ శుద్ధితొ, స్వాతంత్ర సంగ్రామంలొ పోరాడుతూ ’రాయలసీమ కేసరి/ భీష్మ/పితామహ’ అన్న కీర్తిని సంపాదించుకొన్న కల్లూరు సుబ్బా రావు. అనంతపురం జిల్లా, హిందూపురందగ్గర కల్లూరులో సూరప్ప, పుట్టమ్మ దంపతులకు మే 25, 1897 న జన్మించారాయన.
పదహేడవ వయస్సులోనే, అనిబిసెంట్, గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారలతో ప్రభావితమై, దేశ భక్తి పరమావధిగా జీవితాన్ని, గాంధీయుగానికి ముందే, దేశానికి అంకితం చేసిన కొంది మహానుభావులలొ ఒకరాయిన.
1927 నవంబర్ లొ నంద్యాలలొ రాధాకృష్ణ పండితుల అధ్యక్షతన జరిగిన ఆంధ్ర రాజకీయ మహాసభలో చిలుకూరి నారాయణ రావు ప్రతిపాదించగా, కల్లూరు సుబ్బారావు అమోదించాకే ’దత్తమండల జిల్లాలు’, ’రాయలసీమ’గా మారినాయి. తరువాత రోజులలొ గాడిచర్లవారు దానిని ప్రాచుర్యములొకి తెచ్చారు. రాయలసీమా ఊపిరిగా భావిస్తున్న "శ్రీ భాగ్ ఒప్పందం" సృష్టి కర్తలలొ ఒకరు కావడమే కాదు, సంతకం చేసినఎనిమిది మందిలో కల్లూరు వారొకరు.
1937 లో అప్పటి మైసూరు సంస్థానములోని, కోలారు జిల్లాలోని విదురాశ్వత్థములొ మహా సత్యాగ్రహములొ, పోలీసు కాల్పులలొ పదహేను మందికి తక్కువ లేకుండా మరణించారు. దానిని మైసూరు జిలియాన్ వాలాబాగ్ గా చరిత్ర గుర్తించింది. అందులొ ఉపశమన కార్యక్రమములొ కల్లూరువారు చురుకుగా పాల్గోని గాంధి మహాత్ముని ప్రశంసను అందుకొన్నారు. ఎన్నెన్నో సత్యాగ్రహాలలొ పాల్గొని, మొత్తం ఏడు సంవత్సరాల పాటు కఠోరమైన జైలు శిక్ష అనుభవించారు. జైలులొ ఉండగా తను చదువుకోవడమే గాక, ఇతరులకు చదివించారు. స్వాతంత్ర సేనాని, రాజ్యాంగ సభ సభ్యులు, కర్నూలు వాసి సర్దార్ నాగప్పగారు: "రాజాజీకి రామాయణ, మహాభారతాలు రాయడానికి స్పూర్తి, నాజైలు గురువు, కల్లూరువారు" అనేవారు.
స్వాతంత్య్ర సంధి కాలములొ కల్లూరువారు, మద్రాసు రాష్ట్ర ప్రతినిధిగా, రాజ్యాంగ సభ సభ్యునిగా ఎన్నికైనారు. ఆదివారం, సెప్టెంబర్, 18, 1949 న మన దేశం పేరు గురించి జరిగింది. ఆ చర్చలొ సేట్ గోవిందదాస్ గారు: "గాంధిగారు ’భారత మాతా కి జై’ నినాదముతొ ప్రజలను ఉత్తెజ పరిచినారు కావున, "భారత" అనేపేరు మాత్రమే ఉండాలన్నారు. కొందరు "ఇండియా" అని ఊండాలంటూ వాదిస్తూ ఉన్నప్పుడు కల్లూరువారు జోక్యం చెసుకొంటూ: "ఆర్యా నేను హృదయ పూర్వకముగా”భారత్’ అనే ప్రాచీనమైన పేరును బలపరుస్తున్నాను. ’భారత్’ అనే పేరు ఋగ్వేదములో గలదు. అక్కడ: "ఓ! ఇంద్ర, భారత సంతతులారా’ అని సంభొదించియున్నారు. వాయు పురాణములొ కూడా భారత దేశం సరిహద్దులను ఈ విధముగా గుర్తించియున్నారు. ’హిమాలయానికి దక్షిణముగా, సముద్రాలకు ఉత్తరముగా ఉన్నది భారత్’. అందువల్ల భారత్ అనే పేరు చాలా ప్రాచీనమైనది. సింధు నదివల్ల ’ఇండియా’ అనే పేరు వచ్చినది. ఇప్పుడు మేము పాకిస్తాన్ ని కూడా హిందూస్తాన్ అని పిలువవచ్చు. ఎందుకంటే సింధు నది ఇప్పుడు అక్కడవున్నది. కాలానుక్రమములొ ’సింధ్’ హింద్ గా మారింది. సంస్కృతములొ ’స’ ను ’హ’గా ఉచ్ఛరిస్తారు. సెథ్ గోవిందదాస్ మరియు ఇతర హిందీ మిత్రులతొ, భాషని కూడా ’భారతి’గా నామకరణం చెయ్యమని నా మనవి. భారతి అనగా ’చదువుల దేవత’ కాబట్టి, హిందీ బదలు ’భారతి’ అనే పేరు సముచితమని నేను భావిస్తున్నాను."అని అన్నారు.
ఎస్.ఎస్.ఎల్.సి. ఫెయిల్ అయిన ఒక వ్యక్తి తెలుగు, కన్నడ, హింది, సంస్కృత, ఆంగ్లాలలొ పాండిత్యాన్ని సంపాదించుకొన్నారని, అనర్ఘళముగా ఉపన్యాసాలివడమేగాక, రచనలు చెశారని , కొనియాడుతూ, రాజ్యాంగ సభ అధ్యక్షులు డా.రాజేంద్ర ప్రసాద్ కల్లూరుని: "జైల్ గ్రాడ్యువేట్" అని సంభొదించడం మొదలుపెట్టారు.
1951 లో, అనంతపురం జిల్లా, మొట్ట మొదటి జిల్లాగ్రంథాలయ సంస్థ అధ్యక్షులై, మూడు సార్లు, శాసన సభ్యులై, ఒక పర్యాయం, ఆంధ్ర శాసన సభా ఉపసభాపతియైన కల్లురుకి ’పద్మశ్రి’ పురస్కారం కూడా లభించింది. తరిమల నాగిరెడ్దిగారు, నీలం సంజీవ రెడ్డిగారితొ సహా అనంతపురం జిల్లా నాయకులందరూ వీరిని గురుతుల్యులుగా సంభొదిస్తూ , గౌరవించేవారు.
ఎట్టి గడ్డు పరిస్థితిలొనూ, ఒర్పు, సహనం, కోల్పొకుండా, నిబ్బరముతొ, స్థితి ప్రజ్ఞతో హాస్య చతురతతొ, అటు పండిత పామరులను, ఇటు జన సామాన్యులను ఆకట్టుకొవడమే గాక, ఆకర్షించగలిగినంతటి వ్యక్తిత్వంగలిగిన ఆదర్శమూర్తి కల్లూరువారు. కన్నడ వచన కవి, సంఘ సంస్కర్త, మునిపుంగవుడు బసవణ్ణ "శరణుల గుణాన్ని మరణములొ చూడు" ( ಶರಣರ ಗುಣ ಮರಣದಲ್ಲಿ ನೋಡು.) అన్న సూక్తికి, నిలువెత్తు ఉదాహరణ, కల్లూరువారు. వారు 20, 1972 కీర్తిశెషులైనారు.
హెలికాప్టర్ సంస్కృతి ఇంకా అమలులొకి రాని రోజులవి. ముఖ్యమంత్రి, పి.వి. నరసింహా రావుగారు అనంతపురంనుండి, బెంగళూరు వెళ్ళి, విమానమెక్కి హైదరాబాద్ ప్రయాణం కావలసినది. మధ్యలో ఎవరో కల్లూరువారి ఆరోగ్యం బాగాలేదని, పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రయాణాన్ని నేరుగా కాకుండా హిందూపురం మార్గంలొ మళ్ళించి, కల్లూరువారి దర్శనంకొరకు వెళ్లారు. అప్పటికే వారు తనువు చాలించారు.
"నాదగ్గర పది ఉంది, నీదగ్గర ఎంతవుంది?" శవ సంస్కారముకొరకు, బంధువర్గాలలొ తర్జన భర్జన. ఇన్ని గౌరవ మర్యాదలు (Protocol) సంప్రదాయాలు లేని రోజులు. ఈ మాట ఎవరో ముఖ్యమంత్రిగారి చెవిలో వేశారు. ’రాజులు తలచుకొంటే, దెబ్బలకు కొదువా?’ ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. కలెక్టర్ సారథ్యములొ, ముఖ్యమంత్రిగారి సమక్షమములొ ప్రభుత్వ లాంచనాలతొ, పోలీసు కవాతుతో రాయలసీమ కేసరి అంతిమ యాత్ర, జరిగింది.మరుసటి రోజున ముఖ్యమంత్రి గారి హైదరాబాదుప్రయాణం.
1957/58 లొ కల్లూరువారి షష్టి పూర్తి సందర్భములొ 60 గ్రంథాలను వారికి అంకితమిచ్చారు వాటిలొ కల్లూరు వెంకటనారాయణ రావుగారు రచించిన "శాంతి సమ్రాట్ అశోక చక్రవర్తి". ఒకటి. ఇది శాంతి సందేశం పూరిత రచన. అందులో అశోక చక్రవర్తి భారత మాతను గూర్చి ప్రార్థించిన ఒక పద్యం, కల్లూరువారికి ఇంతకంటె నివాళి అవసరం లేదు.
క్రోధ లోభ మదాది సంక్షోభ మించు
కంతయను లేని సుమనస్సు - శాంతచిత్త
మనిశము నఖండ భక్తి, కళానుభూతి
అవితథ సుకర్మయు నొసంగు మమ్మ! దేవి!
(*రచయిత అనంతపురం జిల్లా ధర్మవరం, కళాజ్యోతివారి 2003 " పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు పురస్కారం" గ్రహీత)