నాగుపాము నెందుకు పూజిస్తారు?

First Published Jul 28, 2017, 5:57 AM IST
Highlights

చాలా పండుగలు, పర్వదినాలు, ఆచార విచారాలు,  వ్రతాలు, నోములు,   వైజ్ఞానికంగా  మొదలయ్యి, సంస్కృతి సాంప్రదాయాలుగా మారి, మూఢ నమ్మకంగా ఆచరించబడుతున్న విపర్యాస సమాజంలో  మనం ఈ రోజు ఉన్నాము. 

చలి ప్రవేశించు నాగల చవితి నాడు; 

 మరియు వేసవి  రథసప్తమి దినమున;

 అచ్చ సీతు ప్రవేసించు బెచ్చు పెరిగి; 

 మార్గశిర పౌష మాసాల్ మధ్య వేళ      (శ్రీనాథ కవి సార్వభౌమ) 

అట్టివాటిలొో  ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి నాడు (ఈ సంవత్సరం జులై, 27/28, 2017) ఆచరించే  నాగ పంచమి ఒకటి.

(మరి శ్రీనాథుడు ఎందుకలా అన్నాడొ తెలియదు.)  చవితి నాడు నాగుల చవితిని కూడా కొన్ని సమాజాలలో, ప్రదేశాలలొ ఆచరిస్తారు. మన తెలుగు రాష్ట్రాలలొ ఇది ఎక్కువగా ఆడవారు పాటించె నోము. ఉదయాన్నే స్నానం చేసి, ఉపవాసం ఆచరించి నాగదేవత విగ్రహానికి పాలు, తేనె, ఇతర పరిమళ ద్రవ్యాలతొ, అభిషేకం చేసి,  పూజించడం పద్దతి.  కర్ణాటక  సంఘ సంస్కర్త బసవణ్ణ మాట: " జీవంత నాగున్ని చూస్తె, రాయితొ  గొట్టండ్రా’, అంటారు. రాయి నాగునికి పాలాభిషేకం చెయ్యండ్రా”, అంటారు."  (నిజద నాగర కండరె కల్ల హొడెయేంబరయ్యా; కల్ల నాగర కండరె, హాలనెరెయెంబరయ్యా.) బసవణ్న ఉత్తర కర్ణాటక, బయలు సీమ ప్రాంతమువాడు. ఉత్తర కర్ణాటకతో సహా,  దేశములొ చాలా ప్రదేశాలలో ఉన్న ఆచారం అంది.  దేశములోని వివిధ ప్రాంతాలలో, విభిన్న రీతులలొ పూజా విధులుంటాయి. సురవరం వారు తన పరిశోధనా గ్రంథం "హిందువుల పండుగలు’ లో వీటికి సంబంధించి  సోదహరణతొ చాలా వివరాలు రాసి ఉన్నారు.    దేశములొని కొన్ని ప్రాంతాలలొ  సజీవ కొడె నాగు ని పూజించె విధానం కూడా ఉన్నది. 

                  కేరళలోని కాసరగోడు జిల్లాతో పాటు  నా పూర్వీకుల కోస్తా కర్ణాటకది ఒక ప్రత్యేకత.  దక్షిణ కన్నడ, ఉడుపి, (మొదటి రెండు, మరియు ఉడుపి సగం జిల్లాలలో, పంచ ద్రావిఢ భాషలలొ ఒకటైన  తుళు మెజారిటి ప్రజలకి మాతృ భాష) ఉత్తర కన్నడ జిల్లాలని తుళు/ తుళవ నాడు అంటారు. శ్రీకృష్ణ దేవరాయ వంశీకులు ఆ ప్రాంతంనుండి వచ్చినవారని, అందువల్లనె, ఆయనది , "తుళవ వంశం"అని చరిత్రకారుల అభిప్రాయం.) ఈ నాలుగయిదు తరాలనుండి అక్కడివారు,  వలస పోయి, మలైనాడు, అనగా;  శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన, కొడగు జిల్లాలలొ  స్థిరపడిన హిందూవులందరూ,  తర తరాలుగా నాగ విగ్రహారాధాకులు. నాగ పామును చంపరు.   దానిని చంపడం మహాపాపం అనే భక్తి భావన గలిగినవారు. (కింది ఫోటో: నాగమండల రంగం)

   

                 పాము భయబ్రాంతులకు గురియై, భయాందోళనాలతో  ప్రాణ రక్షణ కోసమే  కరుస్తుంది గాని, ఉద్దేశ పూర్వకముగా కరువదు అన్నది  కేవలం శాస్త్రజ్నుల అభిప్రాయమే కాదు, వాస్తవం కూడా.  అక్కడక్కడ విగ్రహాలున్నప్పటికి  అవి నివసించే గుట్ట పుట్టలను, ’నాగబనం’ అని వాటి  జోలికి పోకుండా చాలా జాగ్రత్తగా కాపాడేవారు. "పురుగు కట్టిన పుట్ట పాముకు నిలువైయ్యే"అనేది సామెత. ఇతర మతాలలో కూడా, చాలా మంది వ్యవసాయం చేసేవారు పాముని చంపక పోవడమే కాకుండా విగ్రహాల పూజని బ్రాహ్మాణుల ద్వారా చేయిస్తారు కూడా.  ఒకడుగు ముందుకు పోయి, నాగ పాము శవాన్ని చూసినా, (వడగ లేకుండా కనిపించినప్పుడు, అనుమానముంటే కూడా) దానిని దహనం చేసి, 12 సంవత్సరాల లోపల,  దీక్షతొ, సంస్కార చెయ్యాలి. ఈ విధి యజుర్వేదములొ మాత్రమే గలదు.           

          పాము ఇంటి లోపల వచ్చినా,  దానింతకు  దానిని పోనిస్తారు, అది కరిచి, చచ్చి పోయినా శాపం అనుకొంటారేగాని, దాని జోలికి పోరు. శాపం ముందు తరానికి రాకుండా, సరియైన ప్రాయశ్చిత్తం పైదీక వర్గాలవాళ్ళదగ్గర సిద్ధంగా ఉన్నాయి.. ఈ ప్రాంతాన్ని, పరశురామ క్షేత్రం అంటారు.  హాస్యపు మాట ఒకటుంది, కొంతవరకు వాస్తవం కూడా: "పరశురామ క్షేత్రములో నాగదెేవత పేరు ఉన్నంతవరకు వైదికులకు కరువు ఉండదు" అని.  ఇంట్లో మనుషులుగాని (ప్రత్యేకంగా పిల్లలు), పశువులుగాని, అనారోగ్యానికి గాని గురియైనపుడు,’నాగ దేవత ఉపద్రం’ అనే దృఢ నమ్మకం ఈ నాటికి ఉంది. అందుకే వివిధ రకాల ’మొక్కుబడులు ’ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు గల్గక పోవడానికి, గల్గినా చిన్న వయస్సులొ చని పోవడానికి, కుటుంబంలో నిరంతర అనారోగ్యం, వివాదాలు, నెలగొనడానికంతా సర్ప శాపమే కారణం అని, దానికి ఫల పుష్పం, పాలు, తేనె, సమర్పించడంతో  సహా, పెద్ద పెద్ద  పూజలు పునస్కారాలున్నాయి. కొన్ని సంక్షిప్త వివరాలు. 

         టెంకాయి, అరటి పండ్లు, పచ్చి బియ్యం పిండితొ తయారు చేసిన కొన్ని తీపు పదార్థాలతో అలంకరణ, నైవేద్యం; యజుర్వేద సాంప్రదాయములోనే ’ఆశ్లేష బలి’ అనే ప్రత్యేక ఫూజ ఉన్నాయి.  కోస్తా కర్ణాటక,  దక్షిణ కన్నడ జిల్లా, కొండ కోనల్లొ,  కుక్కె సుబ్రహ్మణ్య  నాగ దెవతకు సంబందించిన ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం. ప్రసిద్ధ క్రికెట్ ఆటాగాడు, సచిన్ తెండూల్కర్ కూడా కొన్ని సంవత్సరాల కిందట, భార్యా పిల్లలతొ పాటు అక్కడికి వచ్చి ’ఆశ్లేష బలి’ చేయించాడు. అప్పటినుంచి, మంది దేశ నలు మూలలనుండి వచ్చి అక్కడ మొక్కుబడి తీర్చుకోవడం విపరీతంగా పెరిగింది. (ఊడుపి కాణియూరు శ్రీ విద్యా వల్లభ తీర్థ స్వామీజివారిచె "నాగమండల  వైశిష్టత" ప్రవచనం)

              దాదాపు ఆరు శతాబ్ధాల చరిత్ర గలిగిన ఇంకోక విశిష్ట పూజ "నాగమండల" నృత్య నాటక రూపములొ, కళాత్మకమైనది; చూడడానికి కనువిందు నిస్తుంది.. ’డక్కె బలి’ అనే చిన్న రూపకం కూడా ఉంది. ఎక్కువగా ఇది బ్రహ్మ దేవుని సన్నిధిలొ జరుగుతుంది.  ఇది దాదాపు బ్రాహ్మీ ముహూర్తం మొదలు, సూర్యోదయం వరకు సుమారు నాలుగు గంటల పాటు సాగే నృత్య నాటకం. పెద్ద పూజ.  పాత రోజులలో బాగా నిర్వహించెేవారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ రెండు మూడు సార్ల కంటే జరగడం లేదు. ఇది అరుదైన ప్రదర్శనం కావడంతో కొన్ని లక్షల మంది దీనిని  తిలకించడానికి మైళ్ళు ప్రయాణం చేసి వస్తారు.  ఇది కోట్ల ఖర్చులతొ కూడుకున్న పూజ. ఇందులో మూడు రకాలున్నాయి.  పావు భాగం(నాలుగు ముడి) ; అర్థ భాగం, (ఎనిమిది ముడి) పూర్తి భాగం. ( పదహారు ముడి). అంటే నాగుపాముల ముడిలను రంగులతొో చిత్రీకరిస్తారు.  మధ్యాహ్నం మొదలు, సూర్యాస్తమయం దాకా  వచ్చిన ప్రతి ఒకరికి లేదనకుండా అన్నదానం ఉంటుంది.  దీనికి పూనుకొన్న, మొక్కుబడిదారునికి, వస్తు, ధన రూపేణ, దాన ధర్మాలు చెసేవారు విఫులముగా ఉన్నారు. సుమారు రాత్రి పది గంటల ప్రాంతములో ఈ పూజా విధి మొదలయి, సూర్యోదయం వరకు సాగుతుంది.(నృత్యానికి ముందు పూజావిధికి సిద్ధమయిన బ్రాహ్మణులు)  

                నటనలో ’వైద్యుల బృందం’ (బ్రాహ్మాణలలోనె, ఒక ప్రత్యేక వర్గం) చిన్నమృదంగాన్ని చేతులొ పట్టుకొని, (బుడిబుడకల వారి మాదరి) వేషదారులై,  పద్యాలు పాటాలు పాడుతూ పాము ముడి వేసుకొని తిరిగినట్లు ముందు, వెనుక అడ్డు తిరుగుతూ ఉంటే వారి వెనక, ఒకరి పై నాగపాము ’పూనకం’ వచ్చి తిరుగుతూ ఉంటారు.  ఈయన బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి, ఆయనను ‘పాత్రి’ (నాగదేవత పాత్రను పొషించేవాడు) అంటారు.  ఇది ఒకప్పుడు వారసత్వం. ఇప్పుడు అందులో ప్రత్యేకమైన శ్రద్ధతొ, సాధనతొ, కొందరు కొత్తవాళ్లు రంగంలోకి వచ్చారు.  నృత్యం మొదలు పెట్టెటప్పుడు ఒక ప్రత్యేకత గల్గిన పురోహితుడి నేత్రత్వంలో  నాగ దేవతను పూజించి పాత్రికి పూలు (శృంగారం) సమర్పిస్తారు. ఆయనకు పూనకం వచ్చి వైద్యులతో కలసి నాట్యం మొదలు పెట్టి దాదాపు ఎనిమిది గంటల పాటు,తాండవం చేస్తారు. రాత్రంతా, లేదనకుండా శృంగారం పూలు  ఇస్తూనే ఊండాలి. పాత్రి దానిని ముఖానికి, వీపుకు, శరీరం పైభాగానికింత రుద్దుకొంటూ, బుసకొట్టూతూ, కోడె నాగు వలే నాట్యమాడుతూ ఉంటాడు. దీనిని రాత మూలకంగా  వివరించడం కష్టం.  అంతర్జాలములొ ’దృశ్య శ్రావ్య’ క్యాసెట్లున్నాయి. పాత్రి నిర్వహించే ప్రక్రియను "దర్శనం" అంటారు. కొన్ని సార్లు ఈ ’దర్శన మాత్రం నిర్వహించి ఆ పాత్రి దగ్గర తమ సమస్యలకు పరిష్కార మార్గాన్ని అడుగుతారు. పాత్రి మాటను తోసిపుచ్చరు. 

 

(నాగ మండల దృశ్యాలు)

           

ఈ దేశములో సృష్టి కర్త బ్రహ్మకి గుడి గోపురాలు చాల తక్కువ. శ్రీకృష్ణుడి ఆలయాలు  అక్కడక్కడ ఉన్నాయి, శివాలయాలు కొకొల్లు. శివాలయాలు లేని ఊర్లలో కూడా,  సుంకలమ్మ, మారమ్మ, బోనాలమ్మ, మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతలు ఉన్నారు. ఇవన్నీ చెట్లు, బండలు, కొండలు, గుట్టలు, పుట్టలు, మొదలైనవే. ప్రకృతి ఆరాధన.  వీటికి చుట్టు పక్కల ప్రాంతాలలో దొడ్డికి, ఒంటికి పోసేవారు కాదు.  వాటిని చెడ్చేవారు కాదు. కొన్ని సందర్బాలలొ పాము విహరిస్తే, జ్యోతిష్కులు, పురోహితులు, వాస్తు శాస్త్రజ్నులను సంప్రదించి, ఇల్లు, ఆవుల దొడ్డి, కోళ్ళ ఫార్మ్, నిర్మాణ స్థలాన్ని మార్చుకొంటారు. కొన్ని గ్రామీణ ప్రాంతాలలొ ఎంత ఆదునికమైన ఇల్లు కట్టించినా,ఇంటి లోపల, స్నానం గది కూడా ఉండరాదు. చుట్టు పక్కలొ, ఉన్న స్థలమంతా, "నాగనడి/ నాగనేడె"అంటే  నాగుని స్థలం, నాగు తిరిగె ప్రదేశం కాబట్టి, ఇంటికి కొన్ని వందల అడుగుల దూరములో మురుగు దొడ్లు ఉండిన ఉదాహరణలు ఉన్నాయి. గుట్టలు, పుట్టలలొ ఎలుకలు, పందికుక్కలు, పందులలాంటి జంతువులు నివసిస్తాయి/ విహరిస్తాయి.  అవి రంధ్రాలు, రంధ్రాలుగా, చిన్న చిన్న గుంతలను తవ్వితే అందులొ నీరు ఇంకి స్వాభావికమైన ’ఇంకుడు గుంతలు’ తయారయ్యాయి. ఈ జంతువులు పాములకు ఆహారం. వాటిని చంపితే, ఒక సరమాల ప్రక్రియే ఆగి పోతుంది గనుక, అశ్వత్థ, యాప, మర్రి వంటి చెట్ళను నరక కూడదని,  వాటిని నిత్య పూజించవలేనని ఉద్భోదించారు. అలాగె వన్య మృగాల సంరక్షణ. ఇది వైజ్ఞానిక విశ్లేషణ. 

ప్రస్తుత నాగరక  ప్రపంచములొ, మానవుడు అతీ క్రూరమైన జంతువుగా గుర్తింప బడ్డాడు. తన చర్యలు బస్మాసుర హస్తంగా మారుతున్నదనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. వైభవ్యముయొక్క అశ్లీల ప్రదర్శనం ద్వారా భక్తిని ప్రదర్శించడం ఒక పరిపాట. దీనిని ఒక వర్గం వారు కేవలం మూఢ నమ్మాకాలని త్రోసిపుచ్చారు. సమన్వయముతొ, ప్రతి పండుగల మూలాన్ని పరిశొదించి, ప్రకృతిని మన ముందు తరానికొరకు కాపాడుకొవలసిన భాద్యత మనపై ఉన్నది. 

           న్యాయ కోవిదుడు పాల్కివాలా: "రాబోయే  తరం వనరులను చౌర్యం చెసే హక్కు మనకు లేదు. మనకి వారసత్వంగా వచ్చిన వనరులను, ఇంకా సమృద్ధి చేయాలి లేదా ఉన్నదయినా  అంతయినా ముందు తరానికి అప్పజెప్పాలి."  (బ్యానర్ ఫోటో నాగుపాటు ఆకారంలో పూలతో అలంకరించిన నాగ మండలం)

 

(*కురాడి చంద్రశేఖర్ కల్కూర  తెలుగునాట స్థిరపడిన కన్నడ పండితుడు)

  

click me!