మలేసియా వాసి తెలుగు వేదన

 |  First Published Dec 12, 2017, 2:31 PM IST

తెలుగు నేల మీదకు వచ్చిపోయిన ప్రతిసారీ మాకు వేదన మిగులుతుంది. బాధ కలుగుతోంది. తెలుగు కోసం బయటి దేశాల్లో మేం పడుతున్న తపనతో పోల్చుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. తెలుగు పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. మా ప్రయాణాల్లోనూ, బస చేసే హోటళ్లలోనూ, సందర్శించే గుడుల్లోనూ మాకు ఎదురైన అనుభవాలు బాధ కలిగిస్తూ ఉంటాయి.

మేము తెలుగు నేల మీద పుట్టలేదు. అక్కడ పెరగలేదు. అక్కడ చదువుకోలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా ఉన్న తెలుగు ప్రాంతంలో మాకు ఆస్తిపాస్తులు ఏవీ లేవు. అయినా ఆ నేల మీద మమకారం. ఆ భాష మీద మమకారం. మా తాత ముత్తాతలు పుట్టి పెరిగిన ఆ నేలను తలచుకోగానే మా హృదయం ఉప్పొంగుతుంది. మా చుట్టాలెవరో ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా రెండేళ్లకోసారి అయినా మాలో చాలా మందిమి తెలుగు గడ్డ మీదకు వచ్చిపోతుంటాం. విదేశాల్లో ఎక్కడో పుట్టి పెరిగినా ఇప్పటికీ మేమంతా తెలుగు ఆచార సంప్రదాయాలనే అనుసరిస్తున్నాం. మా ఇళ్లలో తెలుగులోనే మాట్లాడుకుంటాం. తెలుగు భాష మాకు కూడుపెట్టదు. ఉద్యోగం ఇవ్వదు. అయినా తెలుగుభాషను మా గడ్డ మీద నిలబెట్టుకోవడానికి పాటుపడుతూ ఉంటాం. అవస్థలు పడి అయినా మా పిల్లలకు తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నాం. తెలుగు భాష గురించీ, సంస్కృతి గురించీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. దాదాపు 20 కోట్ల రూపాయల ఖర్చుతో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో తెలుగుభవనాన్ని మేం నిర్మించుకున్నాం. 1981లో ప్రపంచ తెలుగు మహాసభలకు మా దేశంలో ఆతిథ్యం కూడా ఇచ్చాం. తెలుగు సభలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా రెక్కలు కట్టుకుని వాలిపోతుంటాం. తాజాగా ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులో జరుగుతున్న సందర్భంలో కొన్నిమాటలను నేను తెలుగు రాష్ట్రాల్లోని అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాను.

Latest Videos

undefined

తెలుగు నేల మీదకు వచ్చిపోయిన ప్రతిసారీ మాకు వేదన మిగులుతుంది. బాధ కలుగుతోంది. తెలుగు కోసం బయటి దేశాల్లో మేం పడుతున్న తపనతో పోల్చుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. తెలుగు పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. మా ప్రయాణాల్లోనూ, బస చేసే హోటళ్లలోనూ, సందర్శించే గుడుల్లోనూ మాకు ఎదురైన అనుభవాలు బాధ కలిగిస్తూ ఉంటాయి. ఒకసారి విజయవాడకి రైల్లో ప్రయాణిస్తున్నాం. ఒక వ్యాపారి ఏదో అమ్ముతున్నాడు. నేను ఏమది అని అడిగాను. హిందీలో ఏదో చెప్పాడు. నాకు హిందీ రాదు అన్నాను. వెంటనే తమిళంలో ‘మోర్‌’ అన్నాడు. అర్థం కాలేదు, తెలుగులో చెప్పు అన్నాను, నామీద జాలిపడుతున్నట్టుగా నవ్వి, ‘బటర్‌ మిల్క్‌ సార్‌’ అన్నాడు. వేల మైళ్ల అవతల ఉండే దేశపు భాషలో చెప్పిన అతని నోటి నుంచి చల్ల అని గానీ, మజ్జిగ అని గానీ తెలుగు మాట రాలేదు.

విశాఖపట్టణంలో మూడు తారలుండే ఒక హోటల్‌లో 40 మంది మలేసియావాసులం బస చేశాం. అక్కడి రెస్టారెంట్‌లో ఇంగ్లీషు, హిందీ పాటలే వినిపించేవి. అల్పాహారం తీసుకుంటూ తెలుగు పాటలు వేయమని తెలుగులో అడిగితే రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఒక తెలుగు అబ్బాయి, ‘ఓన్లీ ఇంగ్లీష్‌ అండ్‌ హిందీ, నో తెలుగు సాంగ్స్‌, మేనేజ్‌మెంట్‌ ఆర్డర్‌’ అన్నాడు. ఆ హోటల్లో మేమున్న మూడు రోజులూ హిందీ, ఇంగ్లీషు పాటలే వింటూ అల్పాహారం చేసాం. ఇంతకీ తెలుగు నేల మీద ఉన్న ఆ హోటల్‌ ఒక తెలుగు ఆసామిదే.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తిరిగినా వ్యాపారసంస్థల పేరు పలకలన్నీ ఇంగ్లీషులోనే కనిపిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలూ, విద్యాసంస్థల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మనది కాని భాషను మన నుదుట రాసుకున్నట్టుగా ఉంటుంది. మద్రాసులో విమానం దిగి తెలుగు నేల మీద అడుగుపెట్టే మాకు తెలుగు పట్ల తెలుగువాళ్ళకే ఉండే చిన్నచూపు అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది.

భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ సాధారణంగా తెలుగు ప్రాంతాల్లోని ఆలయాలను మేం సందర్శిస్తుంటాం. ఏ గుడికి వెళ్ళినా ఓం అనే అక్షరాలు కనిపిస్తాయి. తెలుగులో కాదు, సంస్కృతంలో ఉంటాయి. కానీ తమిళనాడుకు వెళ్లి చూడండి. ప్రతి చిన్న ఆలయంలోను, పెద్ద ఆలయంలోను, నవీన ఆలయంలోను, చారిత్రాత్మక అతి పెద్ద ఆలయాల్లోనూ, గాలిగోపురంపైన ఇతర చోట్ల తమిళ ఓం మాత్రమే కనిపిస్తుంది. తెలుగు ఓం ను పెట్టుకుంటే దేవుడికి మనపై కోపం వస్తుందా? మనలను అనుగ్రహించడా? దేవుని ఆరాధించడానికి తెలుగు పనికిరాకుండా పోయింది. తరతరాలుగా మన ఆలయాల్లో సంస్కృతంలోనే ప్రార్థనలూ, పూజలూ జరుగుతున్నాయి.

శ్రీరామానుజాచార్యుల పుణ్యమా అని వైష్ణవాలయాలలో తమిళంలోనూ ప్రార్థనలూ, పూజలూ జరుగుతున్నాయి. ఇళ్ళలో జరిగే అన్ని కార్యాలలో కూడా సంస్కృతంలోనే మంత్రాలు చదువుతుంటారు. తమిళనాడులో ఈ పరిస్థితి లేదు. సుప్రభాతాన్ని కూడా తమిళంలో పాడుకుంటారు. మంత్రాలను ఎప్పుడో వాళ్లు తమిళంలోకి మార్చుకున్నారు.

తమిళ ఆళ్వారులు 12మందిని, నాయనారులు 63మందిని మనం దేవుళ్లుగా మార్చుకున్నాం. తెలుగునాట వైష్ణవ, శైవ ఆలయాలందు వారి శిలారూపాలను ప్రతిష్ఠించి వారికి పూజలు చేస్తున్నాం. వారు ప్రబోధించిన దివ్య ప్రబంధాలను, తిరుప్పావైను, దేవారంలను మన పిల్లలకు బోధిస్తాం. తమిళంలోని వాటికి తెలుగులో అర్థాలు బోధిస్తాం. దేవుని ముందు పాడుకుంటాం. వాటికి పోటీలు పెడతాం. కానీ మన అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్యలను వాగ్గేయకారులుగానే గుర్తిస్తాం. వారి విగ్రహాలను మన ఆలయాల్లో ఎందుకు ప్రతిష్ఠించుకోం? అంతటితో ఆగక గరుడునికీ, సుదర్శన చక్రానికీ ‘ఆళ్వార్‌’ అనే తమిళ పదాన్ని తగిలించి గరుడాళ్వార్‌, చక్రత్తాళ్వార్‌ అని వాటికి పేర్లు పెట్టి తమిళులుగా మార్చివేసాం. 30 పాసురాలు రాసిన ఆండాళ్‌ అమ్మవారికి ప్రతి వైష్ణవ ఆలయంలోనూ ప్రత్యేక గుడులు కట్టించుకున్నాం. ఆమెను దేవతలాగ ఆరాధిస్తున్నాం. కానీ వందల కొలది కీర్తనలు, పద్యాలు రాసిన తరిగొండ వెంగమాంబకి గుడిలో స్థానం కల్పించుకోలేకపోయాం. ‘మలయప్పసామి’ అంటే మనలో భక్తిభావం ఉప్పొంగి పోతుంది. కానీ ‘కొండలరాయుడు’ అంటే ఆ ఏడుకొండల స్వామి గూడా మనలను కరుణించడేమో! వైష్ణవ సాంప్రదాయ పదాలంటూ ‘ఊంజల్‌సేవై’ అని, ‘అడియేన్‌’ అని; ‘తాయార్‌’ అని అంటాం కానీ ఊయలసేవ, దాసుడ్ని, అమ్మవారు అని అనం. అంటే దేవునికి కోపం వస్తుందేమో! ఇదండీ దేవుళ్ల దగ్గర మన భాషకున్న విలువ. ఇతర రాష్ట్రాలలో ఇలా ఆళ్వార్ల శిలలు, నాయనారుల శిలలు పెట్టుకొని ఆరాధిస్తున్నారా అని ఆరాతీస్తే లేదనే చెప్పాలి. తెలుగువారి పక్క రాష్ట్రమయిన కర్ణాటకలో గూడా ఆ పరిస్థితి లేదు.

తమిళ మార్గళి మాసానికి ధనుర్మాసమని ప్రత్యేకంగా ఒక పేరును పెట్టి ఆ నెల రోజులు వైష్ణవాలయాలలో (తిరుమల సహా) సంస్కృత శ్లోకాలకు బదులు తమిళ తిరుప్పావై పాసురాలను దేవుని ముందు పాడుతున్నారు. ఆ రోజుల్లో తెలుగునాట ఆలయాలలో తిరుప్పావైను గురించి ఉపన్యాసాలిస్తుంటారు. ఆ నెల రోజులు కొన్ని తెలుగు చానెల్స్‌ ఉదయం తిరుప్పావై పాసురాలను పాడి తెలుగులో వివరణలు చెప్పడం చూస్తుంటాం. తెలుగులో ఉన్న గొప్ప భక్తి సాహిత్యాన్ని మరచి తమిళాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటాన్నామో అర్థం కాదు. నిజానికి తమిళ చానెల్స్‌ కూడా అలా చేయడం లేదు. తమిళ పాసురాలకి తెలుగువాళ్ళు ఇచ్చినంతటి ముఖ్యత్వం వారు ఇవ్వడం లేదు.

ఇక మలేసియాలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొట్లాడి సాధించి తెలుగు చానెల్స్‌ వచ్చే ఏర్పాటు చాలా తావుల్లో చేసుకున్నాం. తేట తియ్యని తెలుగు మాటలు మా పిల్లలు వినాలనీ, తెలుగు సంప్రదాయాలేమిటో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మా తాపత్రయం. కానీ తెలుగు చానెల్స్‌లో ఎక్కువగా ఇంగ్లీషు మాటలే వినిపిస్తుంటాయి. తమిళ చానెల్స్‌ చూడండి, ఇంగ్లీషు కాదు కదా సంస్కృతం మాట కూడా వినిపించదు. తెలుగు సినిమాలు చూసినా ఇదే పరిస్థితి.

వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో ఏర్పడే కొత్త ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు పుట్టించుకోవడంలో కూడా మనం బాగా వెనుకబడ్డాం. 30 ఏళ్ల కిందటి సంగతి ఒకటి గుర్తు చేస్తాను. అప్పట్లో మలేసియా ప్రభుత్వంచే నిర్వహించబడిన ఎల్‌సీఈ అనే 9వ తరగతి పరీక్షలో తెలుగు ప్రశ్నాపత్రిక కూడా ఉండేది. దాదాపు 20 సంవత్సరాలు మా ప్రభుత్వం ఈ పరీక్షను జరిపింది. కారణాంతరాల వలన ఈ పరీక్ష 1990వ దశకంలో ఆగిపోయింది. అప్పట్లో ఆ పరీక్షా పత్రాన్ని తయారుచేసే ప్యానెల్‌ సభ్యులలో మలేసియాలోని తెలుగు ఉపాధ్యాయులతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి వచ్చిన తెలుగువారు గూడా ఇద్దరు ఉండేవారు. ఆ సమయాల్లో తెలుగు మాటల వాడిక గురించి వారికీ మాకూ వాదం నడిచేది. పాఠాల్లో తెలుగు మాటలే ఉండాలని మేం వాదించేవాళ్ళం. వాళ్లు మాత్రం, ‘పిల్లలకు సులభంగా అర్థమయ్యే పదం ఆంగ్లం అయినా మలాయి అయినా ఆఖరుకు తమిళం అయినా ఆ పదాన్ని ఉపయోగించుటలో తప్పు లేదు. పరభాషా పదాలన్నింటినీ తెలుగు భాష సులభంగా తనలో ఇమిడ్చికోగలదు’ అని వాదించేవారు. అందరికీ సులభంగా అర్థమవగలదన్న నెపంతో ఇతర భాషా పదాలను మన భాషలో కలుపుకుంటే కాలక్రమంలో తెలుగు భాష ఉంటుందా? అని మేము వారితో వాదించేవాళ్ళం. ఏం జరుగుతుందని మేం భయపడ్డామో 30 ఏళ్ల తర్వాత చూస్తే తెలుగునాట అదే జరిగింది. ప్రజలు అనుదిన జీవితంలో 50 శాతానికి పైగా ఇతర భాషా పదాలను కలుపుకుని తెలుగు మాట్లాడుతున్నారు. అమ్మను మమ్మీ అని, నాన్నను డాడీ అని, నీరును వాటర్‌ అని, అన్నాన్ని రైస్‌ అని, గుడ్డును ఎగ్గు అని, సంతోషాన్ని హేపీ అని, వార్తను న్యూస్‌ అని, పాటను సాంగ్‌ అని.. ఇలా చెప్పుకుంటూ వేలాది కొత్త పదాలను మనం సృష్టించుకుంటూ పోతున్నాం. పొరుగున ఉండే తమిళులు మాత్రం ఈ నవీన యుగానికి తగినట్లు తమ భాషను మలుచుకొంటున్నారు. విజ్ఞాన అభివృద్ధితో పాటు పుట్టుకొస్తున్న కొత్త వస్తువులన్నిటికీ తమిళంలో పదాలను సృష్టించుకుంటున్నారు. ఇంటర్నెట్‌ను ఇనైయం అని, ఫేస్‌బుక్‌ను ముగనూల్‌ అని, ఎస్‌ఎంఎస్‌ను కరుంచెట్లు అని, ఈ–మెయిల్‌ను మిన్‌ అంజల్‌ అని, ఓపీనేషన్‌ను అరువై చిగిచ్చై అని, బన్‌ను పేరుందు అని తమిళ మాధ్యమాలన్నింటిలోనూ వాడుతున్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థి నుండి పెద్ద పెద్ద చదువులు చదివిన ఉద్యోగుల దాకా అందరూ ఆ పదాలను తమ అనుదిన సంభాషణల్లో చాలా సరళంగా ఉపయోగిస్తున్నారు. తమిళులకున్న భాషాభిమానంలో పదో వంతు కూడా మనకు ఎందుకు లేదా అని మాకు బాధ కలుగుతూ ఉంటుంది. మహాసభల సంబరాలు జరుపుకునే వేళ అయినా తెలుగు గురించి తెలుగు మేధావులు, రచయితలు, కళాకారులు ఆలోచించాలని నా మనవి.

-డీవీ శ్రీరాములు

విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, మలేసియా

click me!