శుభ్రమయిన మంచినీటికి కోరుకునే వాడు ఆందోళన కారుడెలా అయ్యాడో,రసాయన యుద్ధంతో నీటిని ధ్వంసం చే సేందుకు పూనుకుంటున్న కార్పొరేషన్ ఉగ్రవాది ఎందుకు కాదో ఎవరయినా నాకు బోధ పరచండి - వినోనా లడూక్
undefined
సాంప్రదాయేతర శక్తి వనరు షేల్ గ్యాస్ తవ్వకాలు మన రాష్ట్రంలో మొదలుపెడుతున్నారని తెలియగానే తీవ్రమయిన అందోళన కలిగింది. జరగబోయే విధ్వంసం కళ్ల ముంద కదలాడుతున్నట్లు కలవరం. ఈ సమస్యపై ప్రపంచ వ్యాపితంగా జరిగిన ఉద్యమాలు, చర్చలూ , ఈతవ్వకాలు కలిగించే హానిపై చదివిన పరిశోధనలు అన్నీఒక్క సారిగా గుర్తుకు రాసాగాయి. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లులు చేసిన,చేస్తున్న పోరాటాలు, వాటిపై వచ్చిన వీడియోలు ఒక సారి కళ్ల ముందు కదిలాడాయి.
న్యూయార్క్ రాష్ట్రంలో ఎనభై ఆరేళ్ల ప్రాయంలో జైలు శిక్ష అనుభవించిన రోలాండ్ మిక్లెమ్, నౌకాసేనలో పనిచేసిన గుర్తింపు పొందిన 55 ఏళ్ల సాండ్రా స్టైన్ గ్రాబర్ లు జరిమానా చెల్లించడానికి నిరాకరించి జైలు శిక్షని స్వీకరించారు. గాంధీ మార్గంలో నిరసన తెలిపే హక్కుని కాపాడుకోవడం కోసం నవంబర్ 2014లో జైలు కెళ్లారు. వారి పోరాట ఫలితంగా షేల్ గ్యాస్ ఉత్సత్తిని నిలిపివేశారు.
అమెరికాలో శాస్త్రవేత్తల అభిప్రాయ సేకరణ జరిపితే 66 శాతం మంది షేల్ గ్యాస్ఉత్పత్తిని తిరస్కరించారు. ఫ్రాన్స్, బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లండ్ దేశాలు షేల్ గ్యాస్ ని నిషేధించాయి. అమెరికాలో ఎన్నో రాష్ట్రాలు,మునిసిపాలిటీలు కూడా షేల్ ఉత్పత్తుల పై నిషేధం పెట్టాయి. నియంత్రణ విధానాలే లేని మన దేశంలో షేల్ గ్యాస్ ఉత్పత్తులకు అనుమతివ్వడంలోని అంతర్యమేమిటి? ప్రజలకు భద్రతనెలా కల్పిస్తారు?
షేల్ గ్యాస్ ఉత్తత్ప ప్రతిపాదన గురించిన ప్రజాభిప్రాయ సేకరణ సమాచారం ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వెబ్ సైట్ లో చాలా కాలం అందుబాటులో లేదు. తరచూ ఈ వెబ్ సైట్ ను సందర్శించే నాకు కూడా ఎక్కడ దొరకలేదు. అయితే, నవంబర్ 4 వ తేదీన ఉదయం ప్రత్యక్షమయింది. నవంబర్ 5న ప్రజాభిప్రాయ సేకరణ అని ఉంది. అవగాహన ఉండి, ఏరూపంలోనూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేని దుస్థితి ఎదురవుతున్నది. అందులో ఇఐఎ సంబంధించిన సమాచారమే లేదు.
ఎన్ని సార్లు కార్యదర్శి దృష్టికి తెచ్చినా ఫలితం రాలేదు. ప్రజల సమాచార హక్కుకి విలువ ఇవ్వని ఆలోచనా ధోరణి ప్రజల భద్రతకు ఏం విలువనిస్తుంది?
ప్రజాస్వామ్యం ప్రజలు సమర్థవంతమయన నిర్ణేతలుగా మారేందుకు దోహదపడాలి. కాని చీకట్లో ఉంచి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించలేని దుస్థితికి నెట్టడమే పరమావధిగా అధికారులు,నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి షేల్ గ్యాస్ ఉత్పత్తి నియంత్రణ సామర్థ్యం ఉందా? విధాన రూపకల్పన చేశారా? ఏ వాయువులు వెలువడతాయి. వాటిని విశ్లేషించే వ్యవస్థ ఉందా? ఫ్రాంకింగ్ కు వాడే నీటి మిశ్రమంలో 200 రసాయనాలుంటాయి. అవి ఏమిటో కూడా కంపెనీలు తెలుపవు. అది వ్యాపార రహస్యమంటాయి. ఈ పరిస్థితిలో ప్రజలకు భద్రత ఎలాకల్పిస్తారు.
కోస్తా ప్రాంతమయినా కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతమయినా ప్రజలు నీటికి కటకట అనుభవిస్తున్న కాలమిది. పెరుతుగున్న భూతాపం నీటి లభ్యతని ఇంకా విషమం చేస్తుంది.అదే సమయంలో గ్యాస్ ఉత్పత్తికి వాడే నీరు ఒక్కో బావికి మిలియన్ల లీటర్లలో ఉంటుంది. అదంతా తర్వాత వ్యర్థ జలమే. అంత నీరు ఎక్కడి నుంచి తెస్తారు? వ్యర్థ జలాలను ఎక్కడ విసర్జిస్తారు. అమెరికాలో భూగర్భంలో వ్యర్థ జాలలను విసర్జించడం వల్ల ఓక్లాహోమా, ఒహైయో, టెక్సాస్ రాష్ట్రాలలలో మానవ ప్రేరిత భూకంపాలు వస్తున్నాయి. ఆ విషయాన్ని యుఎస్ జిఎస్, విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిర్ధారించారు. టెక్సాస్ లో 5.1 స్థాయి భూకంపం నమోదయింది.
పారిస్ ఒప్పందం నవంబర్ 4 నుంచి అమలులోకి వచ్చింది. భారత్ ఒప్పందంలో భాగస్వామి. షేల్ గ్యాస్ బావులు ఉత్పత్తి పూర్తి చేసి, ఆ తర్వాత మూసేసినా మీధేన్ వాయువు బయటకు విడుదలవుతూనే ఉంటుందని, ఉత్పత్తి సమయంలో కూడా మీధేన్ విడుదలవుతూ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ సంస్థ, అమెరికా (ఇపిఎ) అంచానల మేరకు ఒక మెగా జౌల్ ఉష్ణశక్తికి 0.6 గ్రాముల కర్బన్ షెల్ గ్యాస్ ఉత్పత్తి లీకవుతుంది. ఇది సంప్రదాయ సమజవాయువు ఉత్పత్తి కంటే దాదాపు రెట్టింపు. ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్2014 ప్రచురణలో సెకనుకు 34 గ్రాముల మీథేన్ ఉత్పత్తిలో ఉన్న బావుల నుంచి లీకవుతుందని , 7 బావులను పరిశీలించి లెక్కగట్టారు. ఇది ఇపిఎ అంచనాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులూ ఇది నిర్దారించారు. మీథేన్ భూతాప సామర్థ్యం, కార్బర్ డై ఆక్సైడ్ కంటే 20 ఏళ్ల కాలంలో 80 రెట్లు, 100 ఏళ్ల కాలంలో 21 రెట్లు. మీథేన్ తో భూతాప ప్రమాదం మరింత వేగవంతమవుతుంది.
భూతాపాన్ని నిరోధించాల్సిన నైతిక బాధ్యత ప్రతి దేశంపైనా ఉంది. ప్రపంచంలోనే భూతాప ఉద్గారంలో మూడో పెద్ద దేశంగా ఉన్న భారత్ పై మరింత బాధ్యత ఉంది. బావుల నుంచి షెల్ గ్యాస్ ఉత్పత్తి వల్ల వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. వందల కొద్దీ పరిశోధనలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. అణుధార్మిక రెడాన్ వాయువు కూడా వెలువడుతుంది. శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. ఉబ్బసం వ్యాధి ముప్పు కూడా ఎక్కువవుతుంది. వాయు కాలుష్యం గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గర్భ విచ్చిత్తి ప్రమాదాలు పెరుగుతాయి. పుట్టుకలో లోపాలు పెరుగుతాయి. కేన్సర్ ప్రభావం పెరుగుతుంది. బంబెర్గర్, ఆస్వాల్డ్ లు 2012లో న్యూ సొల్యూషన్స్ జర్నల్లో మానవుల, జంతువుల ఆరోగ్యంపై అధ్యయనం చేసి ప్రచురించిన వ్యాసంలో ఫ్రాకింగ్ జరిగే పక్క పోలాల్లో ఆవులూ, దూడల మరణాలను వివరించారు. ఒక మైలు దూరంలో ఉన్న రెండు నివాసాల నీటి బావులలో కలిగిన మార్పులూ పెంపుడు జంతువుల మరణాలు, పెంపుడు గుర్రం కాలెయం పాడవడం వివరించారు.
గుర్రం కదలలేని స్థితిలో పడివుండి వైద్యానికి స్పందించిన స్థితిలో వైద్యుడు దానికి కారుణ్య మరణం ఇవ్వవలసి వచ్చింది. ఆ ఇళ్లలో నివసించే వారికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒక ఇంట్లో పిల్లాడు తీవ్రమైన కడుపు నొప్పి, నిస్త్రాణ, గొంతు నొప్పి, వీపు నొప్పితో బాధపడసాగాడు. వైద్యులు పరీక్షించి విష పదార్థాల వల్ల వచ్చిన అనారోగ్యమని గుర్తించి పరీక్షలు జరపగా అరెన్సిక్ విషవాయువు శరీరంలో ఉన్నట్లు తేలింది. ఒక సంవత్సరం చికిత్స చేస్తేకాని ఆ చిన్నారి కోలుకోలేదు. ఆ ఇంట్లో వారందరినీ విషపదార్ధాల కోసం పరీక్షలు చేయగా వారి రక్తంలో బెంజిన్ అవశేషం ఫినాల్ ఉన్నట్లు తేలింది. సరైన మోతాదుకు మించి మరీ ఎక్కువగా ఉండడంతో డాక్టర్లు వారిని ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్లాలని సూచించారు.
ఇందనంగా కూడా షెల్ గ్యాస్ వెలికి తీయడానికి ఖర్చయ్యే శక్తి కంటే లభించే అదనపు శక్తి సంప్రదాయ వనరులతో పోలిస్తే చాలా తక్కువ. భూతాపాన్ని అరికట్టడానికి ఇది ప్రయోజనకరం కాదు.
జన సమర్థం అధికంగా ఉన్న కోస్తా ప్రాంతంలో వేల వేల బావులు తవ్వడం సమంజసమేనా.. ఎంత భూమి వ్యవసాయం నుండి మళ్లి పోతుంది. వేల ఎకరాల మాగాణి పంట భూములు పోయి నిర్వాసితులైన ప్రజజలకు ప్రత్యామ్నాయ జీవనమేమిటి.. కూలీగా మారడమే అభివృద్ధా.. ఇప్పటికే చమురు, సహజ వాయువు బావుల తవ్వకాలతో భూమమి కృంగి సముద్రం ముందుకొచ్చి, భూగర్భ జలాలన్నీ ఉప్పు నీరై తసమతమవుతున్న ప్రజలకిది గొడ్డలిపెట్టు కాదా... ఇంత కాలం అన్నపూర్ణగా వెలుగొందిన ఈ ప్రాంతాన్ని షెల్ తవ్వకాలు మరుభూమిగా మారుస్తాయి.