మొదటి భాగం
Latest Videos
undefined
రాజకీయ సమావేశాలు తరచూ రసాభాస అయిపోయాయని అని చదువుతూ ఉంటాం. పార్లమెంటు అసెంబ్లీలలో రసాభాస ఎదురుకాని రోజు ఉండదేమో. జర్నలిస్టులకు బాగా ఇష్టమయిన మాట. మనం కూడా అపుడపుడు అంతా రసాభాస అయిపోయిందని భాధపడుతూ ఉంటాం. ఇంతకీ రసాభాస అంటే ఏమిటి?
రసాభాస జరిగింది అంటే జరగాల్సిందేదో సక్రమంగా జరగక చెడిపోయింది అనే అర్థంలో ఆ పదాన్ని వాడుతూ ఉంటాం. నిజమే అయినా రసాభాస అనే పదం ఎలా పుట్టింది అని తెలుసుకుంటే మరింత స్పష్టత కలుగుతుంది.
రస+ఆభాస అనే పదాల కలయికే రసాభాస. అంటే రసము యొక్క ఆభాసము = రసము వలె కనిపిస్తుందేమో తప్ప రసం మాత్రం కాదని ఉద్దేశం.
ఇక్కడ రసం అంటే షడ్రసాల్లో రసం కాదు. నవరసాల్లో రసం. ఆ నవరసాలు ఇవి: 1శృంగార 2హాస్య 3కరుణ 4రౌద్ర 5వీర 6భయానకాః। 7భీభత్స 8అద్భుత 9శాంతాశ్చ నవ నాట్యే రసాః స్మృతాః।। ప్రతి రసానికీ ఒక స్థాయిభావం ఉంటుంది. ఆ స్థాయి లేనపుడు అది ఆ రసం అనిపించుకోలేదు. పైన చెప్పిన నవరసాలకు అదే క్రమంలో స్థాయిభావాలివి: 1రతిః 2హాసశ్చ 3శోకశ్చ 4క్రోధ 5ఉత్సాహౌ 6భయం తథా। 7జుగుప్సా 8విస్మయ 9శమాః స్థాయిభావాః ప్రకీర్తితాః।। ఆయా రసాలు ఆయా సమయాల్లో తమతమ స్థాయిభావాలకు చేరుకున్నపుడు ఆయా రసాలు పండినట్టు.
అలా కాక, ఒక రసాన్ని పలికించే ప్రయత్నంలో మరో స్థాయిభావమేదో కలిగినట్లైతే దాన్ని రసాభాస అంటారు. 1. శృంగారరసాభాస శృంగారరసానికి స్థాయిభావం రతి. అంటే నాయికానాయకులమధ్య పరస్పరానురక్తి. అది లేకుండా శృంగారచేష్టలు చేస్తే రసాభాస అనిపించుకుంటుంది. మాయాబజారు సినిమాలో మాయాశశిరేఖను ఆకర్షించేందుకు లక్ష్మణకుమారుడు "సుందరి నీవంటి దివ్యస్వరూపంబు" అని పాడిన పాట గుర్తుందా? ఇక్కడ అనురక్తి ఏకపక్షంగా ఉంది గాని, మాయాశశిరేఖలో ఆ అనురక్తి లేదు.
అందువల్ల రసాభాస అనిపించుకుంటుంది. ఇది శృంగారాభాస. అయితే ఇదే సందర్భంలో మనకు నవ్వు పుడుతుంది. అంటే హాసం కలుగుతుంది. హాసం అనేది హాస్యరసానికి స్థాయిభావం. కాబట్టి శృంగారరసాభాస ఇక్కడ హాస్యరసంగా మారిందన్న మాట. శృంగారం అనేది నాయికానాయకుల నడుమన మాత్రమే ఉండదగినది కాని, పదిమందికీ పంచదగినది కాదు. అందువల్లనే ఆ రసాన్ని స్టేజిపై నాటకంలోనో లేదా తెరపైన సినిమాలోనో చూపించవలసి వస్తే అక్కడ మూడో మనిషిని చూపకూడదు. మూడోవాడు వస్తే/ఉంటే రసాభాసే. చంద్రబాబుగారు విశాఖలో చేయతలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్ విషయం గందరగోళంగా మారటానికి కారణం రసాభాసే మరి!
2. హాస్యరసాభాస హాస్యరసానికి స్థాయిభావం హాసం. దాని బదులు మరొకటి కలిగితే అది హాస్యరసాభాసం. మయసభలో దుర్యోధనుడు దిగ్భ్రమకు లోనై నానా అవస్థలు పడినపుడు భీమాదులు నవ్వారు. దుర్యోధనుడు కూడా వారితో పాటు తన పొరపాట్లకు నవ్వుకొని ఉంటే అది సంపూర్ణ హాస్యరసంగానే ఉండేది. కాని వారి నవ్వులతో దుర్యోధనుడికి క్రోధం కలిగింది. తదనంతరపరిణామాలు క్రమంగా సర్వక్షత్రియవినాశకరమైన భయంకరకురుక్షేత్రయుద్ధానికి దారితీశాయి. కాబట్టి, హాస్యం ఎంత వాంఛనీయమో హాస్యాభాసం అంత ప్రమాదకరం. భారత్ పాకిస్తానులు ఏ క్రికెట్ మ్యాచో ఆడతాయి.
ఒక టీము గెలుస్తుంది. గెలిచిన టీమును సమర్థించే జనాలు ఓడిపోయిన టీమును, దానిని సమర్థించేవారిని వెక్కిరిస్తూ జోకులేస్తారు. వీరికది హాస్యరసం కావచ్చుగాని, అవతలివారిలో అది క్రోధాన్ని కలిగిస్తూ శత్రుభావనను పెంచుతుంది. దశాబ్దాల తరబడి గమనిస్తున్నవారికి ఈ హాస్యాభాసం భారతపాకిస్తాన్ ప్రజలలో ఒకరిపట్ల మరొకరికి ద్వేషభావం కలిగేందుకు కారణమౌతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, ఎవరినీ గేలి చేస్తూ హాస్యాభాసం చేయకూడదు. పర్యవసానాలు తీవ్రంగా ఉండవచ్చు.
3. కరుణరసాభాస మనకు ఇష్టులైనవారికి కష్టాలు కలిగినపుడో మరణం కలిగినపుడో శోకం కలుగుతుంది. శోకం స్థాయిభావమైతే కరుణరసం. శోకం కాకుండా మరొకటి కలిగితే కరుణరసాభాస. ఏదో సినిమాలో చూశాను. ఎవరో పెద్దావిడ మరణిస్తారు. ఒక దొంగ అక్కడకు వచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తూ శవం యొక్క చేతులు కాళ్లు తడుముతూ అక్కడున్న ఆభరణాలను దొంగిలిస్తుంటాడు. వాడి చేష్టలు ఎవరికైనా నవ్వు కలిగిస్తే అది వారికి హాస్యరసం. జుగుప్స కలిగిస్తే అది వారికి భీభత్సరసం. మొత్తానికి అక్కడ కరుణరసాభాసం. అలాగే ఏ వరదలో ఏ తుఫానులో ఏ డీమానిటైజేషనో మరొకటో వచ్చి ప్రజాజీవితం అస్తవ్యస్తము, అల్లకల్లోలమైనపుడు కొందరు రాజకీయనాయకులు వచ్చి, ప్రజలకు సాయం చేయకపోగా దీనికి కారణం తమ ప్రత్యర్థిపార్టీలవారే కారణం అంటూ లేదా, చూశారా, ఎంతో నష్టం కలగవలసింది కాని నా అనుభవం వల్ల, నా ముందుచూపు వల్ల తక్కువ నష్టం కలిగింది కాబట్టి నాకు జై అనండి అంటూ రాజకీయాలు చేయడం జూగుప్సను కలిగిస్తూ కరుణరసాభాసం కలిగిస్తాయి.
(మిగిలిన రసాభాసలు తరువాయి భాగంలో...)