భక్తా, ఏమి నీ కోరిక?
డీమానిటైజెషన్ వల్ల నల్లడబ్బు దాచిన పెద్దలు భలే దెబ్బ తిన్నారులే అని సామాన్యులు అందరూ మాంచి సంతోషంలో ఉన్నారు. మా బ్రతుకులు క్యూలలో గడిచిపోతున్నాయి గదా అని మధ్యతరగతి వారు ఎప్పట్లాగే మౌనంగా అవస్థలు పడుతూ కాలం గడిపేస్తున్నారు.
undefined
కానీ, వారికే కాదు, అందరూ చిల్లరను అతి జాగ్రత్తగా దాచుకొనడంతో పర్సులు కొట్టి బ్రతికే ఒకానొక దొంగగారికి బ్రతుకే కష్టమై పోయింది. కార్తీకమాసం కదా, ఓ సోమవారం పగలంతా పస్తుండి, శివాలయానికి పోయి, అర్ధరాత్రి సమయానికి అర్చకులు పెట్టిన ప్రసాదం తిన్నాడు. దానితో కరుణించిన బోళాశంకరుడు ప్రత్యక్షమై, "భక్తా, ఏమి నీ కోరిక?" అన్నాడు.
అనుకోని ఈ సంఘటనకు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైన దొంగ "స్వామీ, ఈ లోకంలోకెల్లా అత్యుత్తమం, అతి ఘనం అయినదానిని నాకు ప్రసాదించండి" అని వేడుకున్నాడు.
"సరే అయితే, నీకు మంచి గుణగణాలను ప్రసాదిస్తాను. లోకమంతా నిన్ను మెచ్చుకుంటుంది." అన్నాడు శంకరుడు.
"వద్దు స్వామీ, వాటిని పాతాళానికి తొక్కెయ్. "సర్వే గుణాః కాంచనమాశ్రయంతి. డబ్బు ఒక్కటి ఉంటే అన్ని రకాల గుణాలు,మెప్పుకోళ్లు వాటంతట అవే వస్తాయి" అని పెద్దల మాట కదా" అన్నాడు దొంగ.
"అలా అయితే నీకు గొప్ప పాండిత్యాన్ని ప్రసాదిస్తానోయ్. దానివల్ల నీకు లోకంలో బ్రతుకుతెరువు లభిస్తుంది" అన్నాడు శంకరుడు.
"వద్దు స్వామీ, బుభుక్షితైః వ్యాకరణం న భుజ్యతే, పిపాసితైః కావ్యరసం న పీయతే అని పండితులే స్వయంగా చెప్పినట్టు, -ఆకలేస్తే వ్యాకరణం తింటామా? దాహం వేస్తే కావ్యరసం త్రాగుతామా?" అన్నాడు దొంగ.
"పోనీ, నీకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తానయ్యా,! జ్ఞానమే ముక్తి సాధనం కదా!" అన్నాడు శంకరుడు.
"వద్దులే స్వామీ, వయోవృద్ధాః తపోవృద్దాః జ్ఞానవృద్ధాః తథాsపరే, తే సర్వే ధనవృద్ధస్య ద్వారి తిష్ఠంతి కింకరాః - వయోవృద్ధులు,తపోవృద్ధులు, జ్ఞానవృద్ధులు - వీళ్లంతా ధనవృద్దుడి ఇంటి వాకిలి దగ్గర సేవకులై చేతులు కట్టుకుని నిలబడతారని - అనుభవవృద్ధుడైన ఒక కవి చెప్పనే చెప్పారు కదా!" అన్నాడు దొంగ.
"అయితే నీకు మంచి బంధుబలగం ప్రసాదిస్తానోయ్" అన్నాడు శంకరుడు.
"వద్దు స్వామీ, తెప్పలుగఁ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరే విధంగా ఎప్పుడు సంపద కల్గిన అప్పుడే బంధువులు వత్తురు. మీరు ఇస్తే గాని రారా ఏమిటి?" అన్నాడు దొంగ.
"అయితే నిన్ను మాంచి శూరుడిగా మార్చేస్తానోయ్" అన్నాడు శంకరుడు.
"వద్దు స్వామీ, భాగ్యవంతం ప్రసూయేథాః, మా శూరం, మా చ పండితం, శూరాశ్చ కృతవిద్యాశ్చ, వనే సీదంతి మత్సుతాః - కోడలా, ద్రౌపదీ, నువ్వు శూరుడిని కానీ, పండితుడిని కానీ కనబోకమ్మా, నా కుమారులైన పాండవులను చూడు - అందరికందరూ మహా శూరులు, మహా పండితులు కూడాను! అయితే మాత్రం ఏం లాభం? వాళ్ళ బ్రతుకులన్నీ అడవులపాలైపోయాయి. అందువల్ల, నువ్వు మాత్రం శ్రీమంతులనే కనాలమ్మా! అని కుంతీ దేవి దీవించిందట కదా! అందువల్ల ఎందుకొచ్చిన శూరత్వం స్వామీ? దానిమీద పెద్ద పిడుగు పడా!" అన్నాడు దొంగ.
"పోనీ, మంచి కుటుంబాన్ని ఇవ్వమంటావా?" అని అడిగాడు శంకరుడు.
"వద్దు స్వామీ, కుటుంబందేముంది? మాతా నిందతి, నాభినందతి పితా, భ్రాతా న సంభాషతే - మనిషికి డబ్బు లేకపోతే అమ్మ కూడా ఏదో ఒక సూటిపోటి మాటలంటూ సాధిస్తుంది. తండ్రి మెచ్చుకోడు, సోదరుడు సరిగా మాట్లాడడు, నానుగచ్ఛతి సుతః - కొడుకు చెప్పిన మాట వినడు, ఇంకా ఏం చెప్పాలి స్వామీ, చివరకు కాంతా చ నాలింగతే- డబ్బులేనివాడు భార్య ఆలింగనానికి కూడా నోచుకోలేడుట కదా! ఇటువంటి బంధువులందరినీ నేనేం చేసుకోను? వద్దు లెండి" అన్నాడు.
"పోనీ మంచి మిత్రుడినైనా ఇస్తాను కోరుకోవయ్యా! స్నేహమేరా జీవితం అంటారు కదా మీ మానవులు" అన్నాడు శంకరుడు.
"వద్దులెండి స్వామీ, అర్థప్రార్థనశఙ్కయా న కురుతే సంభాషణం వై సుహృత్ - అన్నారు. డబ్బు లేనపుడు అప్పు అడుగుతాడేమోనని - కనిపించినా మాట కలపక తప్పించుకు పోతాడట కదా మిత్రుడు! వద్దులెండి" అన్నాడు దొంగ.
పాపం శంకరుడికి ఇక ఏమిస్తాననాలో తోచలేదు. కాసేపు మౌనంగా ఉండి, "సరే అయితే, ఏమి కావాలో నువ్వే కోరుకో" అన్నాడు.
వెంటనే దొంగ పరమోత్సాహంతో "అర్థోsస్తు నః కేవలం - పుష్కలంగా డబ్బొక్కటివ్వండి చాలు" అన్నాడు.
శంకరుడు ఆశ్చర్యంగా - "అన్ని అనర్ధాలకూ మూలకారణమైన డబ్బా నీకు కావలసింది?" అన్నాడు.
"అంతమాట అనకండి స్వామీ, యేనైకేన వినా గుణాః తృణాలవప్రాయాః సమస్తాః ఇమే - అన్నారు. డబ్బొక్కటి లేకపోతే,మిగిలిన సద్గుణాలన్నీ ఎన్ని ఉన్నా అవన్నీ గడ్డిపోచతో సమానమని మా మానవలోకం పధ్ధతి" అన్నాడు.
శంకరుడు నవ్వి, "సరే కానీ" అన్నాడు.
"స్వామీ, మీరు అలా నవ్వేరంటే నాకేదో అనుమానంగా ఉంది. రద్దైన పెద్ద నోట్లు మాత్రం వద్దు స్వామీ. దయచూడండి" అన్నాడు దొంగ.
"తథాస్తు" అని అదృశ్యమైపోయాడు శంకరుడు.
ఆ తరువాత కాలంలో, ఎప్పుడో, మీడియా మన దొంగను చుట్టుముట్టి, మీ ఘనవిజయాల రహస్యం చెబుతారా అని ఉక్కిరిబిక్కిరయ్యేలా ప్రశ్నలు వేస్తుంటే - ఆ దొంగ మనసులో ఒకసారి "ఓం నమశ్శివాయ" అనుకొని -
"ద్రవ్యముపార్జయస్వ సుమతే - ద్రవ్యేణ సర్వే వశాః" (ఓ బుద్ధిమంతుడా! డబ్బును సంపాదించవోయ్! డబ్బుతో అన్నీ నీ స్వాధీనమౌతాయ్) అని చెప్పాడు.
కథ కంచికి, మనం ఎటిఎంకు...