జనాభా విస్ఫోటనం జరగడం వల్ల జనాలకు కడుపునింపే ప్రయత్నంలో అహర్నిశలు కష్టపడుతున్న రైతులకు కవిత్వాన్ని సృజించే అవకాశం గాని, ఆనందించే అవకాశంగాని లేకపోయింది అంటూ జపానుకు చెందిన వ్యవసాయశాస్త్రవేత్త మసనోబు ఫుకువోకా ఎంతగానో వాపోయేవాడు పాపం. ఇప్పుడు మన భారతదేశంలో రైతులేమిటి, ఆఫీసర్లేమిటి, కుబేరసమానుల్లాంటి వర్తకులేమిటి, ప్రజలకు దాదాపు దేవుళ్లతో సమానులైన నాయకులేమిటి, డీమానిటైజేషన్ పుణ్యమాని మనోల్లాస కార్యక్రమాలన్నీ వదిలేసి అంతా తల్లడిల్లిపోతున్నారు. ఈ చర్యను సమర్థించే వాళ్లూ ఉన్న మాట నిజమే. ఎక్కువ వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తుంది.
undefined
అసలు ఈ డబ్బేమిటి?
డబ్బంటే జనాలకు ఎందుకింత పిచ్చి?
అది ఎలా పుట్టింది? ఎలా ఉంటుంది? ఎలా పోతుంది?
జనాభా అధికంగా లేని రోజుల్లో,శారీరక కష్టపడటం అవసరం లేని కొందరు తీరికగా కూర్చుని తీవ్రంగానే ఆలోచన చేశారు. వారి ఆలోచనావిధానాన్ని బట్టి కొందరిని కవులన్నారు, కొందరిని విధానకర్తలన్నారు.
సృష్టి
భారతీయులు డబ్బును అర్థమన్నారు. అర్థం అంటే ప్రయోజనం. ఇంత చక్కగా డబ్బును నిర్వచించే పదం మరే ప్రపంచభాషలోనూ లేదు. ఈ అర్థమే మనిషికి జంతువుకు జీవనప్రమాణాలు విభిన్నంగా ఉండేలా చేసింది. మహా శక్తివంతమైన సింహం వంటి ఒక జంతువు ఉందనుకోండి. అది శరీరంలో శక్తి ఉన్నంతవరకు వేటాడుతుంది. శక్తి తగ్గాక దానికి జంతువులు దొరకవు. ఆకలితో మాడి చావవలసిందే. శక్తి ఉన్నపుడు అధికంగా వేటాడి, దాచుకుని, శక్తి లేనపుడు దానిని తినే అవకాశం ఆ సింహానికి లేదు. ఈ లోపాన్ని అధిగమిస్తూ మనిషి డబ్బును కనిపెట్టాడు. యౌవనంలో అధికంగా శ్రమించి, ఆ శ్రమను డబ్బురూపంలోనికి మార్చుకొని, వృద్ధాప్యంలో ఆ డబ్బును తనకవసరమైన వస్తువులరూపంలోనికి మార్చుకుంటూ సుఖపడుతున్నాడు. అంతే కాదు, చివరకు తన శ్రమ తన సంతానానికి కూడా లాభం కలిగించేలా అర్థవ్యవస్థను రూపుదిద్దుకున్నాడు. అదే డబ్బు అంటే. అదే ప్రయోజనం అంటే.
మొట్టమొదట్లో సముద్రంలో దొరికే వివిధ ఆకృతుల పెద్ద గవ్వలను డబ్బుగా వ్యవహరించేవారట. అందువల్లనే డబ్బుదేవత అయిన లక్ష్మి సముద్రంలో పుట్టింది అని భారతీయులు కథారూపంలో చెప్పి ఉంటారు. అది మొదలుగా లక్ష్మీస్వరూపాన్ని వర్ణిస్తూ ఎన్నెన్నో చాటువులు, ప్రశంసలు, చివరకు నిందలు కూడా పుట్టుకొచ్చాయి.
సముద్రమథనంలో లక్ష్మితో పాటు చాలా పుట్టాయి. తన తోబుట్టువుల పోలికలు లక్ష్మిలో ఉన్నాయిట. చంద్రవంకలో ఉండే వంకరతనం లక్ష్మిలో ఉందట. కౌస్తుభమణిలో ఉండేంతటి కఠినత్వం ఉందట. కాలకూటంలో ఉండే ప్రాణాలను తోడేసేంతటి మోహశక్తి కూడా ఉన్నదట.
కాని, కొన్ని పోలికలు ఎందుకు రాలేదో - అని విచారించారు కూడానూ. అనంతజలరాశిలో పుట్టినా విపరీతమైన దాహాన్ని (దురాశను) కలిగిస్తుందట. అమృతసహోదరి అయినా, ప్రాణాలకు అపాయకారి అట.
స్థితి
"కణశః అర్థం సాధయేత్ - కణే నష్టే కుతో ధనమ్?" అన్నారు పెద్దలు. పైసా పైసా కూడబెట్టాలట. ఒక్క పైసా తగ్గినా రూపాయి కాదట. ఇలా కష్టించి డబ్బును సంపాదించమన్నారు. ఎవరెంత డబ్బును సంపాదించినా ఆ సంపాదించిన మొత్తంలో కొంత రాజుకు పన్నుగా చెల్లించవలసిందే. రాజంటే ఎవరోకాదు.
మహావిష్ణుస్వరూపుడే. "నావిష్ణుః పృథివీపతిః" అని రాజనీతి నొక్కి వక్కాణిస్తుంది. అందువల్ల రాజుకు పన్ను చెల్లించే ప్రక్రియను లక్ష్మీవిష్ణువులకల్యాణం చేయడంగా మనవాళ్లు పరిగణించారు. ఆ విధంగా లక్ష్మీపతి, శ్రీనివాసుడు అయిన విష్ణువు లోకసంరక్షకునిగా సర్వప్రాణిపోషకునిగా కీర్తింపబడ్డాడు. రాజధర్మం కూడా అదే. పన్నులను వసూలు చేసుకొని ఆ రాజధర్మాలను నిర్వర్తించవలసిన బాధ్యత నేడు ప్రభుత్వాలపై ఉంది. ఈ లక్ష్మీశ్రీనివాసులు (డబ్బు, ప్రభుత్వం) ప్రపంచానికి తల్లిదండ్రులు. తల్లి పిల్లల కడుపు నింపుతుంది. తండ్రి సంరక్షించి విద్యాబుద్ధులతో వారిని యోగ్యులుగా తయారుచేస్తాడు.
మొదట్లో గవ్వల రూపంలో ఉండిన డబ్బు రకరకాల లోహాలతో చేసిన నాణేల రూపం దాల్చింది. తరువాత పేపర్ కరెన్సీ అయింది. క్రమంగా దానిని ప్లాస్టిక్ కరెన్సీగా మార్చాలని, అది డిజిటల్ రూపం దాల్చాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. తప్పేమీ లేదు. భర్తకు ఇష్టమైన విధంగా భార్య ముస్తాబు కావడం సహజంగా జరిగేదే.
లయ
"జాతస్య హి ధ్రువో మృత్యుః" కదా? డబ్బుకైనా మరణం తప్పదు. మరణమంటే మన దగ్గరున్న డబ్బు వేరొకరి చెంతకు చేరడం. "దానం భోగో నాశః తిస్రో గతయః భవంతి విత్తస్య" అన్నారు పెద్దలు. మూడు విధాలుగా ధనం మన స్వాధీనం నుండి నిష్క్రమిస్తుందట. 1 ఇతరులకు ఇవ్వడం వల్ల, 2 ఖర్చు వల్ల , 3 దొంగతనానికి గురికావడం, చెదలుపట్టి పోవడం, రాజు స్వాధీనం చేసుకొనడం ఇత్యాదులవల్ల. మొదటి రెండూ మంచి మరణాలని, మూడవరకం మరణం హీనమైనదని ఈసడించి పారేశారు.
డీమానిటైజేషన్ వల్ల నిజాయితీపరుల డబ్బుకు మూడవరకం మరణం సంభవించదని ప్రభుత్వం హామీ ఇస్తోంది. మనం తథాస్తు అనుకుందాం.