గత కొన్నిరోజులుగా దేశరాజకీయ వాతావరణమంతా "ములాయం సింగ్ యాదవ్" అధ్యక్షుడిగా ఉన్న "సమాజ్ వాదీ పార్టీ"లో జరుగుతున్న వివాదాలచుట్టే తిరుగుతూ ఉంది. దేశాన్ని కుదిపేసిన "నోట్ల రద్దు - తదనంతర పరిణామాలు" ఎంతలా సంచలనంగా మారినా, దాన్నిమించి చర్చనీయాంశంగా మారిపోయింది ఈ "సమాజ్ వాదీ పార్టీ వివాదం".
undefined
ఇకపోతే, అఖిలేశ్ యాదవ్ నిన్న పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి, తనను పార్టీ అధ్యక్షుడిగా నియమింపజేసుకొని, పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకొన్న తీరును, అలాగే ములాయం సింగ్ యాదవ్ ఈ పార్టీకి అధ్యక్ష్హుడిని నేనేనంటూ, ఆ పార్టీ సింబల్ "సైకిల్" కోసం డిల్లీలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని, చాలామంది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 1995 నాటి "తెలుగుదేశం పార్టీ ఆగస్ట్ సంక్షోభం" తో పోలుస్తూ, "ములాయం" ను "ఎన్‌టిఆర్" తోనూ, "అఖిలేశ్"ను "చంద్రబాబు"తోనూ పోలుస్తూ, ఈ వృద్ధ నాయకుల పట్ల ఎక్కడలేని సానుభూతిని కురిపిస్తున్నారు.
కానీ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ?
నాడు ఎన్‌టిఆర్ తన "తెలుగుదేశం పార్టీ" ని నడిపిన తీరును , నేడు ములాయం తన "సమాజ్ వాది పార్టీ" ని నడిపిస్తున్న విధానం ఒకే తీరుగా కనిపిస్తాయి. ఇద్దరూ తమ పార్టీని నియంతృత్వం తోనే నడిపిస్తున్నారు. పార్టీకి "కర్తా - కర్మా - క్రియా" అన్నీ తామే అన్నట్లూ - పార్టీలో తమది "తిరుగులేని నిర్ణయాధికారం" అన్నట్లూ - తమ నిర్ణయాలు "శాసనం" అన్నట్లూ - అసలు తాము లేకపోతే పార్టీ ఉనికే లేదన్నట్లూ వ్యవహరిస్తూ - తాము తిరుగులేని అధికారాన్ని చలాయిస్తూ - తాము అత్యున్నతులమనే భావనను కలిగి ఉన్నారు.
ఇలా “అతి నియంతృత్వం" కలిగి ఉండడం వలన, వారి మాటే చెల్లుబాటు కావాలన్న భావనలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నాడు ఎన్‌టిఆర్ పార్టీని నడిపిన తీరును చూసినా, నేడు ములాయం నడిపిస్తున్న తీరును చూసినా ఆ నియంతృత్వ భావనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
ఇలాంటి అతి నియంతృత్వ భావనతో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరువల్ల పార్టీకి వారసులు కావాలని ఆశిస్తున్నవాళ్ళు, అవకాశంకోసం ఎదురుచూస్తూ ఇలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటారు.
వాటి పరిణామాలే పార్టీ పెద్దలకు ఈ అవమానాలు. నాడు ఎన్‌టిఆర్ - నేడు ములాయం. ,దానికి వాళ్లపై సానుభూతి అవసరం లేదు - చంద్రబాబు లేక అఖిలేశ్ లపై ద్వేషమూ అక్కరలేదు. ఎందుకంటే ఈ పరిస్థితి ముమ్మాటికీ పార్టీ పెద్దల "స్వయంకృతమే".
ఈ రెండు పార్టీలే కాదు, దాదాపు అన్నీ పార్టీలలోనూ ఇదే తీరు. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి జగద్విదితం. ఐతే, కాంగ్రెస్ పార్టీ అయినా, బిజేపి అయినా, వాళ్ళ పార్టీలు కూడా ఇదే తీరుగా నడుస్తూనే ఉన్నా, వాళ్ళ పార్టీల్లో ‘ప్రజాస్వామ్యం’ ఉన్నట్లు బయటికి కనిపడే విధంగా తంతు ను నడిపిస్తున్నారు.
1995 లో పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకొన్నప్పటినుండీ చంద్రబాబు పాటిస్తున్నది కూడా అచ్చం ఇదే పాలసీనే. తెలుగుదేశం పార్టీ అన్నది "చంద్రబాబు జేబులోని పెన్ను" అన్నది చిన్న పిల్లోడిని అడిగినా చెబుతాడు. అయితే, తమ పార్టీ "ప్రజాస్వామ్య విలువలతోనే నడుస్తుంది" అన్న ఒక తంతును నడిపించడంలో చంద్రబాబు దిట్ట. ఇక ఎర్ర పార్టీలు కొంతలో కొంత మెరుగు - అక్కడా జాడ్యాలు ఉన్నాయి, అది వేరే విషయం.
ఇలాంటి పార్టీలు ఇంకా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ గారి "తృణమూల్ కాంగ్రెస్", ఉత్తర ప్రదేశ్ లో "బహుజన సమాజ్ పార్టీ", తమిళనాడులో "అన్నా డిఎంకే" ఉన్నాయి. అయితే, వీటికి "కుటుంబ వారసుల" సమస్య లేదు. ఇక కరుణానిధి "డిఎంకే", బీహార్ లో "ఆర్‌జేడి", కర్నాటకలో "జేడిఎస్" పార్టీలకు కూడా "కుటుంబ వారసుల బెడద" ఉంది. జనతా కూటమి నుండి చీలిన మిగతా పార్టీలు, దేశవ్యాప్తంగా ఇలాంటి ఇంకా చిన్నాచితకా పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే, పెద్ద పార్టీల వైఖరిని చూస్తే, అవన్నీ ఏకవ్యక్తి నిర్ణయాధికారానికి కట్టుబడే నడుస్తున్నాయి.
ఇకపోతే, తెలంగాణలో "టిఆర్‌ఎస్ పార్టీ" కూడా ఇందుకు అతీతం కాదు. టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుండీ కేసిఆర్ మాటే వేదం. లెక్కలేనన్ని పొరపాట్లు పార్టీపరంగా చేసినా, వాటిని ఎత్తిచూపిన వాళ్ళకి శంకరగిరి మాన్యాలే. అందుకు ఉదాహరణ "ఆలె నరేంద్ర". "టైగర్ నరేంద్ర" గా పిలవబడుతున్న నరేంద్ర గారు "తెలంగాణా సాధన సమితి" అనేపేరుతో తాను పెట్టుకొన్న పార్టీని టిఆర్‌ఎస్ లో కలిపేసి, పార్టీలో నెంబర్ 2 గా వెలిగారు. అయితే, ఆ టైగర్ ను కూడా ఏవో కారణాలు చూపి అత్యంత అవమానకర రీతిలో పార్టీనుండి సస్పెండ్ చేశారు.
కేసిఆర్ మర్రి చెట్టు లాంటివాడు, పార్టీలో 1 నుండి 10 వరకూ తానే, ఇంకొకరెవరైనా ఉంటే 11-నుండే మొదలుకావాలి. ఇక రాష్ట్ర ఏర్పాటు తరవాత టిఆర్‌ఎస్ కు తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం అధికారం అండ కూడా ఉండడం వల్ల, పార్టీలో "అసమ్మతి గళాలు" మూగనోము పట్టాయి.
ఐతే, టిఆర్‌ఎస్ లో కూడా "వారసత్వ/ఆధిపత్య పోరు" చాలా జోరుగానే ఉంది. ప్రస్తుతం అది "నివురుగప్పియిన నిప్పులా" ఉన్నా, ఏదో ఒకరోజు బద్ధలు కాక తప్పదు. కాలం కలిసిరాకపోతే, "వానపాములు కూడా త్రాచుపాములై"బుసకొడతాయి. కాబట్టి, రాబోయే రోజుల్లో "టిఆర్‌ఎస్ పార్టీలో కూడా ఇలాంటి సంక్షోబం రావడం అనివార్యం". - ఎందుకంటే, కుటుంబావారసత్వం ఉన్న పార్టీల్లో ఇలాంటి ఆధిపత్యపోరు సహజంగానే ఉంటుంది - దాన్ని నివారించలేము.
ఇక్కడ కేసిఆర్ పరిస్థితి చాలా నయం. ఎందుకంటే కొడుకూ - కూతురూ ఇద్దరూ ఇద్దరే - ఇద్దరూ అసామాన్యులే - ఇద్దరూ ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగినవాళ్లే - ఇద్దరూ ఎత్తుకు పైయెత్తు వేయగల సమర్థులే. ఇక నీటి పారుదల మంత్రి హరీష్ రావు ఎంత సమర్థుడైనా, ఎంత చాణక్యం ఉన్నా, ప్రజల్లోనూ - పార్టీ క్యాడర్ లోనూ ఎంత పట్టు ఉన్నా, పార్టీ వారసత్వం అన్నది కష్టసాధ్యమైనదే. కానీ ఆధిపత్యపోరు అనివార్యం అనిపిస్తూ ఉంది.
ఇకపోతే, చంద్రబాబుకున్న చాణక్యం పుత్రుడు లోకేశ్ అబ్బినట్లు లేదని సర్వత్రా వినపడుతుంది. ఆయనకున్న ఏకైక క్వాలిఫికేషన్ "చంద్రబాబు కొడుకు" అన్న ముద్ర బాగాపడింది. ఇక చంద్రబాబు బావమరుదులు (ఎన్‌టిఆర్ కొడుకులు) చేష్టలుడిగి, ఎన్నడో అస్త్రసన్యాసం చేసేశారు. చంద్రబాబు ఉన్నంతవరకూ పార్టీకి సమస్య లేదు (ఆయన మరీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే తప్ప). చంద్రబాబు తదనంతరం ఉండబోయే టిడిపి పార్టీని ఊహించడం కూడా కష్టమే.
ఏది ఏమైనా నాడు ఎన్‌టిఆర్ అయినా - నేడు ములాయం అయినా - రేపు బాబు/కేసిఆర్ అయినా, కరుణానిధి అయినా లేక ఇంకెవరైనా సరే ఈ పరిణామాలను మౌనప్రేక్షకుడిగా చూస్తూ ఉండాల్సిందే తప్ప, చేసేదేమీ ఉండదు.!!