యాభైఏళ్ళ క్రితం బీ.క్యాంపు కాలనీకంతటికీ ఏకైక సూపర్ మార్కెట్, "నర్సిమ్ములు బంకు"!
కావటానికి చిన్న కిరాణా కొట్టే అయినా అదొక సూపర్ మార్కెట్ కన్నా ఎక్కువే. చిన్న సూది దగ్గర్నుంచి ఏ వస్తువైనాదొరికేది ఆ బంకులొనే! దాని యజమానే నరసింహులు! కాని అతన్ని ఎవ్వరూ ఆ పేరుతో పిల్చేవారు కాదు. మాటలొచ్చిన రెండేళ్ళ పిల్లాడి నుంచి ముసళోళ్ళ దాక అందరూ పిలిచే పేరు, నర్సిమ్ములు లేదా నర్చిమ్లు(ముఖ్యంగా పిల్లలు). ఎవరెలా పిలిచినా అతను పలికేవాడు. బీ.క్యాంప్ వాళ్ళకి పొద్దున్న లేచింది మొదలు సాయాంకాలం దాక ఏదొ ఒక సందర్భంలో నర్సిమ్ములు తో పనిపడేది. పొద్దున్నే టీ పొడి దగ్గర్నుంచి సాయంకాలం కిరసనాయిలు(అప్పట్లో, ముఖ్యంగా వర్షాకాలంలో చిన్న బుడ్డి దీపాలుండేవి.. కరెంట్ పోతే అవే దిక్కు అందరికీ) వరకు ఏదో ఒకదాని కోసం బంక్ కు వెళ్ళక తప్పేది కాదు. కొంతమంది పెద్ద మార్కెట్ దగ్గర్లో ఉన్న శెట్టి అంగడికి వెళ్ళి నెలసరి వెచ్చాలు ఒకేసారి తెచ్చుకునే వాళ్ళు. మా అమ్మ కూడా అక్కడికే వెళ్ళేది. అయినప్పటికి మధ్య మధ్యలో బంక్ కు వెళ్ళక తప్పేది కాదు. మా నాన్న కోసం నర్సిమ్ములు దగ్గర ఆముదం (అప్పటి హెయిరాయిల్ అదే) ఆప్పుడప్పుడు నేను తీసుకొచ్చేవాడ్ని. అయన షేవింగ్ బ్లేడ్లు (పనామా బ్రాండ్-చాలా ఫేమస్) మాత్రం నర్సిమ్ములు బంకు నుంచే వచ్చేవి. ఎందుకంటే వేరే చోట అవి దొరికేవి కాదు.
మేమైతే బొంగరం జాలి (తాడు),ములికి , సోడా గోళీలు (ఆడుకోటానికి) ఏవి కావాలన్నా నర్సిమ్ములు బంకుకి పరిగెత్తే వాళ్ళం. పెన్నుల్లో ఇంక్(అప్పట్లో ఇంక్ పెన్నులే), నోట్ బుక్కులు ఇతర స్టేషనరీ దొరికేదీ అక్కడే. ప్రతి పండక్కి సంబధించిన ఐటంస్ దొరికేది బంకులోనే! సంక్రాంతికి గాలిపటాలు, మాంజ దారాలు, రేగు పళ్ళు, రేగు వడలు,హోలీ పండక్కి రకరకాల రంగులు, దసరాకి చిన్న చిన్న బొమ్మలు, ఆటవస్తువులకి నర్సిమ్ములు బంకు కేరాఫ్ అడ్రస్!.ఇక దీపావళి పండగ ఓ పది రోజుల ముందే నర్సిమ్ములు బంకు ముందు నులక మంచం మీద బాణాలు, పటాసులు, కాకర పువ్వోత్తులు, లక్ష్మి బాంబులు, అగ్గిపెట్టెలు, పాము బిళ్ళలు, మందు బిళ్ళలు, విష్ను-భూ చక్రాలు నిండా పర్చుకునేవి. పిల్లలని ఊరించేవి! అది చూడ్డానికి (అప్పుడే కొనలేము కదా?) మేమంతా (ఇప్పుడు విండో షాపింగ్ లా అన్నమాట) బంకుని రొజూ విజిట్ చేసేవాళ్ళం. తనివితీరా చూసుకునే వాళ్ళం. కొనటం మాత్రం దీపావళి ముందు రోజే!
undefined
పొద్దున్న 6 గంటలకే బంకు తెరిస్తే మళ్ళీ రాత్రి ఏ పదికో బంకు మూసేవాడు నర్సిమ్ములు. అయితే పది దాటింతర్వాత కూడా అవసరాన్ని బట్టి లేదా పరిచయాన్ని బట్టి లేదా మనిషినిబట్టి వెనకవైపు తలుపు ఎలాగు ఉండేది. అంటే నర్సిమ్ములు బంకు ఎడం వైపు నుంచి ఇంట్లోకి దారి ఉండేదన్నమాట! అర్ధరాత్రి అపరాత్రి ఒకరిద్దరు కిర్సనాయిలు కోసమో, సారిడాన్ మాత్ర కోసమో, కొవ్వొత్తుల కోసమో వెనక వైపు తలుపు తట్టడం, నిద్ర మత్తులో నర్సిమ్ములు భార్య గొణుక్కుంటూనే తలుపు తెరవటం జరిగేది. ఆ విధంగా నర్సిమ్ములు దాదాపు 24 గంటలు బీ.క్యాంప్ వాళ్ళ అవసరలను తీర్చే వాడన్న మాట.ఇంటి పక్కనే నర్సిమ్ములు కట్టెల అడితి ఉండేది. పొయ్యిలోకి కట్టెలు కావాలంటే మళ్ళీ అతనే దిక్కు. చింత కట్టెలు అమ్మేవాడు. మాకు నీళ్ళు కాచుకోవటానికి ఒక బాయిలర్ ఉండేది. అందులో వెయ్యటానికి కట్టె పేళ్ళు నర్సిమ్ములు కట్టెల అడితి లోంచే తెచ్చుకునే వాళ్ళం. రెండు చేతులు చాచి వాటిపై గోనె సంచి వేసుకుని రెండు మణుముల(దాదాపు 5 కేజీలన్నమాట) కట్టెలు పెట్టుకుని అలాగే ఇంటికి వచ్చే వాళ్ళం. అప్పుడు గ్యాసు స్టవ్ లు లేవు. కొంతమంది ఇళ్ళల్లో కిరసనాయిలు స్టవ్ ఉండేది. అదోక స్టేటస్ సింబల్.
ఒక రోజు నర్సిమ్ములు కట్టెల అడితి కాలిపోయింది. . నర్సిమ్ములు సర్వస్వం బుగ్గి పాలైపోయింది బంక్ తో సహా! అందరూ బాధ పడ్డారు.తెల్లారు ఝామున కిర్సనాయిలు బుడ్డి గూట్లొంచి పడ్డమే దీనికి కారణం అని నర్సిమ్ములు భార్య ఏడుస్తూ చెప్పింది. కాని దానికి అసలు కారణం వేరే ఉందని కొంతమంది చెవులు కొరుక్కున్నారు. నర్సిమ్ములే (ఎందుకో మరి?) కట్టెల అడితిని స్వయంగా అగ్గిపాలు చేసుకున్నాడన్న పుకారు కొంతకాలం షికారు చేసింది బీ.క్యాంప్ లో! మరికొంతమంది ఎవరొ గిట్టని వాళ్ళు కన్ను కుట్టి అగ్గి పెట్టారని అనుకున్నారు. ఏది ఏమైనా నర్సిమ్ములు చాలా నష్టపోయాడన్నది నిజం! కట్టెల అడితి కాలిపోయిన సంఘటనలో నర్సిమ్ములు పిల్లలకి ఏమీ కాలేదు. ఆ రోజు బీ.క్యాంప్ మొత్తం కదిలి వచ్చింది చూడ్డానికి. కాలిపోయిన ఒక ట్రంకు పెట్టె పక్కనే కాలి బూడిదైన కొన్ని నోట్లు నంబర్లతో సహా కనిపించాయి! కొంతమంది అయ్యో అనుకున్నారు, మరికొంతమంది గుసగుసలాడుకున్నారు!
మొత్తానికి నర్సిమ్ములు కష్టపడి బంక్ ను మళ్ళీ నిలబెట్టుకున్నాడు. కట్టెల అడితి పునర్నిర్మాణానికి కొంత కాలం పట్టింది. నర్సిమ్ములు బాగానే కోలుకున్నప్పటికీ ఎందుకో మునపట్లా వ్యాపారం జరగలేదు. నర్సిమ్ములు లో మునపటి హుషారు, దగ్గరితనం కనపడలేదు. పరధ్యానంగా ఉండేవాడు. క్రమేణా పిల్లలు పెద్దయ్యారు. ఇతరా కొన్ని బంకులు (సత్యమయ్య బంకు అందులో ఒకటి) వచ్చాయి, పోటీ పెరిగింది. నర్సిమ్ములు కి గిరాకీ తగ్గింది. అందరూ ఏదేదో అనుకున్నారు. క్రమేణా బంకూ పోయింది. తర్వాత అన్ని బంకులూ పోయాయి.అది వేరే విషయం.
నర్సిమ్ములు ఇప్పటికీ ఉన్నాడు. ఫస్ట్ గేట్ (పోస్టాఫీస్ దగ్గర) దగ్గర చిన్న బంకు నడుపుతున్నాడు. ఎప్పుడన్నా పలకరిస్తే జీవం లేని నవ్వొకటి నవ్వుతాడు. పిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి. అందరూ ఎవరి మానానా వాళ్ళు వెళ్ళిపోయారు. నర్సిమ్ములు మాత్రం మిగిలిపోయాడు జ్ఞాపకాల కుప్పమీద కూర్చుని.
(రచయిత సయ్యద్ సలీం భాష. కథారచయిత. హోమియో డాక్టరు. పర్సనాలిటి డెవెలప్ మెంట్ నిపుణుడు. కర్నూలు)