ఏది దారి...

 |  First Published Jan 27, 2017, 7:00 AM IST

 

మనిషి జీవితం ఎన్నో నిర్ణయాలూ వాటిద్వారా వచ్చే ఎంపికల సమూహం. మనం ఒక నిర్ణయం తీసుకుంటాం దాని పర్యవసానాన్ని అనుభవిస్తాం. వర్తమానం లో మనం తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో మన ఉనికి రూపురేఖల్ని నిర్దేశిస్తాయి. పెద్ద పెద్ద నిర్ణయాలు కొత్త అనుభవాల్ని సృష్టిస్తాయి, ప్రాధాన్యతల్ని మారుస్తాయి.

 

నిర్ణయం తీసుకోగలగటం కంటే కష్టమైనదీ, విలువైనదీ మరొకటి లేదు అన్నాడు నెపోలియన్ చక్రవర్తి.

Latest Videos

undefined

 

 టు బి ఆర్ నాట్ టు బి . . . .”

 

అనగానే ప్రఖ్యాత రచయిత షేక్ స్పియర్ గుర్తుకొస్తాడు. ఆయన రాసిన పుస్తకం హా మ్లెట్ లో హామ్లెట్ పాత్ర తనలో తాను మాట్లాడుకునే ఈ స్వగతం ప్రపంచ ప్రఖ్యాతి  పొందింది. అంతే కాక నిర్ణయాలు తీసుకోడానికి సందిగ్ధం లో పడిపోయిన స్థితిని సూచించడానికి ఈ పదజాలం, ఒక పర్యాయ సమాసంగా కూడా నిలిచింది.  స్థూలంగా అవును, కాదు అని ఏదో ఒకటి తేల్చి చెప్పలేని స్థితి అనుకుందాం. 

 

కాలం సాగే కొద్దీ మనం తీసుకున్న నిర్ణయాలూ వాటి పర్యవసానాలూ ఇప్పటి మనల్ని, మన ఆశయాలనూ, పూర్తిగా మార్చేసి మనల్ని వేరే వ్యక్తులుగా రూపొందించ వచ్చు.  మనం ఇప్పుడు శ్రధ్ధ వహిస్తున్న విషయాలతో పోలిస్తే భవిష్యత్తులో శ్రధ్ధ వహింపబోయే విషయాలు  పూర్తి భిన్నంగా వుండవచ్చు. ఉదాహరణకి పెళ్లికి ముందు చిన్న పిల్లలంటే ఇష్టపడని ఒక వ్యక్తి పెళ్లైన తరువాత, తన పిల్లలమీద అమితమైన ప్రేమ చూపించ వచ్చు.

 

కొంతమంది ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, తమ నమ్మకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మకాలు వేరు, నిజాలు వేరు. “మావాడు నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు” అనేది ఒక తండ్రి నమ్మకం.  నిప్పులో చేయి పెడితే కాలుతుంది అనేది నిజం.  నమ్మకం నిజం కాక పోవచ్చు.  కానీ నిజం ఎప్పుడూ నిజంగానే వుంటుంది. నమ్మకం నిజం కానప్పుడు వీరు విపరీతమైన బాధకూ వత్తిడికీ గురౌతారు.

 

కొంతమంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిరంకుశత్వాన్ని  పాటిస్తారు. “దీన్ని గురించి నాకు తెలుసు. ఇది నా నిర్ణయం. ఇదే ఫైనల్” అనే మనస్తత్వం. దీనివల్ల ఎదుటివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేది వీరికి అనవసరం. కొంతమంది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పదిమందితో చర్చిస్తారు. మరికొంతమంది ఏ నిర్ణయమూ తీసుకోక, ఎలా జరిగితే అలా జరుగుతుంది. అని నిర్ణయ భారాన్ని దాని పర్యవసానాన్నిభవిష్యత్తుకే వదిలేస్తారు.  

 

మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా మట్టుకు  ఆ నిర్ణయపు పర్యవసానం లో తాత్కాలికంగా ఒక ఊహాజనితమైన జీవితాన్ని గడుపుతాం. ఉదాహరణకి మనం ఒక కారు కొనాలనుకున్నప్పుడు, వివిధ రకాలైన కార్లు నడుపుతున్న అనుభవాన్ని ఊహిస్తాం.

 

 ఆ ఊహాజనిత అనుభవాల్లో మనకు అత్యంత లాభదాయకమైన ఫలితాన్నిచ్చే విషయాన్ని ఎంపిక చేస్తాం. అలాగే ఒక ఇల్లు కొనాలనుకున్నపుడు, వివిధ రకాలైన వసతులు కలిగిన ఇళ్లలో మనం వున్నట్లు ఊహాజనిత అనుభవాల్ని సృష్టించుకుని, మనకు అత్యంత అధికంగా విలువనిచ్చే అనుభవపు నిర్ణయాన్ని అమలుపరుస్తాం.

 

అయితే జీవితాన్ని మార్చేసే పెద్ద పెద్ద నిర్ణయాలు (ఉదాహరణకి, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం, పిల్లలు కావాలనుకోవడం) తీసుకోవాలనుకున్నప్పుడు, ఇటువంటి అనుభవాలను ఊహించడం కష్టం. అటువంటి  నిర్ణయాలు చేసేటప్పుడు వాటి ద్వారా వచ్చే ఫలితాల్ని అనుభవించాల్సిందే తప్ప ఊహాజనిత అనుభవాల్ని సృష్టించడం కుదరదు. ఆ అనుభవపు విలువను లెక్క కట్టడం కుదరదు.

 

 అందువల్ల ఇంతకు ముందు కారు కొనడం లోని నిర్ణయం లాగా ఎంపిక చేయడం కుదరదు.  ఈ బృహన్నిర్ణయాలు సృష్టించే పరిణామాలు కొన్ని నియమాల అనుసారం అంచనా  వేయడం కుదరదు. అలాగే ఏ మూలాధారం నుండీ వాటి పర్యవసానాల ఫలితాలూ ముందుగా తెలుసుకోలేము. ఎందుకంటే ప్రతి అనుభవమూ ప్రత్యేకంగానే వుంటుంది.

 

ఇటువంటి విషయాల్లో ఊహాజనిత అనుభవాల విలువల్ని లెక్కకట్టడం కంటే జీవితాన్ని ఒక ఆవిష్కరణల ప్రయాణంగా సాగించడం మేలని కొంతమంది మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం.  అంటే  ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు “ఇలా చేస్తే నేనెలా మారతాను? నా జీవితం ఎలావుంటుందో చూద్దాం” అనే ఆసక్తి తో నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కో నిర్ణయం, మనం ముందే అనుభవించడానికి ఇష్టపడిన ఒక్కొ నూతన పర్యవసానం. అనుభవాల విలువల్తో జీవితాన్ని కొలవడానికి కాకుండా ఒక అనుభవాన్ని అనుభవించడానికే నిర్ణయం తీసుకోవాలి.  ఇది సాధ్యమా?    

 

ఉదాహరణకి  పిల్లలు కావాలా వద్దా? అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇతర తల్లిదండ్రులూ వారి పిల్లలమధ్య జరుగుతున్న అనుభవాల్ని  పోల్చకుండా ఒక తల్లిగా కానీ, లేక తండ్రిగా కాని నేనెలావుంటాను? అప్పుడు  నాకెలాంటి  అనుభవాలు ఎదురౌతాయి? అనే ఆసక్తి తో నిర్ణయం తీసుకుంటే అనుభవాలు నిరుత్సాహ భరితంగా వుండవు.  ఫలితాల పట్ల  మన స్పందన ధీరత్వం తో కూడి వుంటుంది.

 

అలాగే పెళ్లి విషయంలో కూడా, ఇతరుల వైవాహిక జీవితాల్ని పోల్చుకోకుండా ఒక భర్తగా లేదా ఒక భార్యగా నేనెలా వుంటానో తెలుసుకుందాం? వైవాహిక జీవితం ఎలా వుంటుందో అనుభవించి చూద్దాం అనే జిజ్ఞాస తో నిర్ణయం తీసుకుంటే ప్రతి కొత్త విషయాన్ని ఆస్వాదించడానికి వీలవుతుంది.  మనం తీసుకున్న నిర్ణయం మనకు రుచించని ఫలితాన్నిస్తే  “నేనలాంటి నిర్ణయం తీసుకుని వుండకూడదేమో” అనే పాశ్చాత్తపం కలగకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశం వుంటుంది.

 

ఈ నిర్ణయం వల్ల నేను ఎలా తయారవబోతున్నాను అని తెలుసుకోవడంలో సంభవించే నూతన అనుభవాలకి విలువల్ని నిర్ణయించండి. ఆ నూతన అనుభవాలు తెరిచే జీవిత రహదారుల్లో మిమ్మల్ని మీరు ఆవిష్కరించాలనుకుంటున్నారా? లేదా ? అన్నదాన్ని బట్టి మీ నిర్ణయాలు చేయండి.                   

click me!