రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా ఈ ఏడాది 13,500 కోట్ల రూపాయల ఆదాయం రాగా,అది రానున్న ఏడాదికి పదిహేను వేల కోట్ల రూపాయలకు పెరుగుతుందన్న వార్తలు భయం గొలుపుతున్నాయి.
undefined
విభజన ద్వారా అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రం 'ఆదాయం ఏ రూపంలో వచ్చినా అంగీకారమే.. మహద్బాగ్యమే' అని ఆలోచిస్తే మాత్రం చాలా ప్రమాదకరం. మద్యం అమ్మకాల్ని ప్రోత్సహిస్తే అది తాత్కాలిక ఆర్ధిక లాభానికి శాశ్వత సామాజిక లాభాన్ని తాకట్టుపెట్టినట్టే అవుతుంది.గతంలో ఆంధ్రా యూనివర్సిటీ చేసిన సామాజిక పరిశీలనలో ఉపాధి హామీ కలగజేస్తున్న ఆర్ధిక భద్రత,మద్యపానం వల్ల తూట్లు పడుతున్నట్టు తేలింది.ఈ దురలవాటు వల్ల కుటుంబాలకు కుటుంబాలే దివాళా తీస్తున్నాయి.కొనితెచ్చుకొంటున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక భాగం త్రాగుడు వల్లనే.ఈ పరిస్థితిని గమనించే అత్యున్నత న్యాయస్థానం రహదారుల పరిధిలో మద్యం అమ్మకాలకు నియంత్రణ విధించింది.
ప్రభుత్వం ఆరోగ్యకర విధానాల ద్వారా రాబడి పెంచుకోవాలి కానీ సులువైన మార్గమని చెప్పి మద్యపానం ని ప్రోత్సహించరాదు.అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.వాహనం నడవాలంటే దానికి సరిపడే స్వచ్ఛమైన ఇంధనం ఉండాలి.చవకగా దొరుకుతుందని ఇంధనానికి కిరసనాయిల్ కలిపితే వాహనం నడిచినట్టే నడిచి మూలబడుతుంది. అలాగే సమాజం ముందుకు నడవాలంటే విద్య,విజ్ఞానం,పరిశ్రమ,తద్వారా ఆదాయం ముఖ్యం.
ప్రభుత్వ ఖజానా మద్యం మీద అట్టే ఆధారపడితే సమాజం తూలిపోతుంది లేదా రివర్స్ గేర్ లో దిగజారిపోతుంది.రేషనలైజేషన్ తరహాలో ఆలోచించి అయినా బెల్టు షాపుల్ని పూర్తిగా మూసెయ్యడం అత్యావశ్యం.సంపూర్ణ మద్యనిషేధం ఆచరణలో సాధ్యం కాదనుకొంటే,నియంత్రణ కైనా పూనుకోవాలి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞాన సమాజంగా రూపుదిద్దాలంటే అందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన మొదటి పని బార్లు మూయడం;స్కూళ్ళు పెంచడం.
*రచయిత లోక్ సభ మాజీ సభ్యుడు. వృత్తి రీత్యా విజయనగరంలో డాక్టర్.