సెనగలు తిని చెయ్యి కడగడం అంత సులభమా!
undefined
మనకు సులభంగా సాధ్యపడి శ్రమలేకుండా చేసుకునే పనికి "సెనగలు తిని చెయ్యి కడిగినట్టు" అన్న సామెతుంది.....సరే ముందు ఈ సెనగ రైతుల కథ తెలుసుకుందాం...
రాయలసీమ లో కోవెలకుంట్ల,జమ్మలమడుగు,బనగానపల్లె,ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఉన్న రేగడి భూముల వల్ల ఆ ప్రాంతానికి రేనాడు అని వ్యవహరిస్తారు.వర్షపాతం తక్కువే. ఒకప్పుడు నీటిపారుదల లేని ఈ ప్రాంత రైతులు జొన్న, దనియాలు సాగుచేసేవారు.ఇక దనియాల్లో అంతరపంటగా కుసుమ సాగు చేసేవారు. వీటిలో దనియాలు,కుసుమ సాగు ఒక లాటరీ లాంటిది.ఏ మాత్రం వర్షం పడ్డా తీవ్ర నష్టాలు వచ్చేవి.ఇక అమతరపంటైన కుసుమలు నడివేసవిలో కోతకు వచ్చేవి.ఒక పక్క ఉక్కపోత,ఎండ,ఈ పంటకు ఉన్న చిన్న ముళ్లలాంటి నూగు,వెరసి ఆ కుసుమగింజలను కల్లాల్లో వేరు వేరుచేసేందుకు నానా అగచాట్లు పడేవారు.
1990 ప్రాంతాల్లో సెనగ సాగు ఒక ఉద్యమంలా మొదలైంది. ముందు రోజుల్లో సెనగ పంట కోసి కల్లాలకు చేర్చి వాటినుంచి గింజలు వేరు చేయడానికి అంతకుముందు జొన్న పంటకు వాడే రాతి కంకుల గుండుతో నూర్పిడి చేసేవారు.ఆ తర్వాత ఈ శ్రమ తగ్గిస్తూ చిన్నపాటి యంత్రాలొచ్చాయి.కోసిన పంటను కుప్పలుగా పెట్టి యంత్రం లో వేసేవారు.ఇప్పుడు ఏకంగా పొలంలోనే గింజను వేరు చేసే యంత్రాలొచ్చాయి.
ఇక పాతరోజుల్లో ఇంట్లో ఉన్న గరిసెల్లో,పాతర్లలో దాచి అంతో ఇంతో గిట్టుబాటు ధర వచ్చినప్పుడు స్థానిక వ్యాపారికి అమ్మేవారు.ఈలోగా పెద్ద వర్షాలొచ్చి ఇల్లు కారినా,పాతర్లలో నీళ్లు చేరినా ఇంతేసంగతులు.
ఈ వ్యాపురులు ఇచ్చే ధరే వేదవాక్కు...అంతకు ముందు విత్తనాలు,ఎరువులు,పురుగుమందులకు వీరి అంగడిలోనే అప్పు చేసేవారు కాబట్టి వడ్డీ మిగులుతుందని వారు చెప్పిన ధరకు అమ్మేవారు.
ఇటీవలి కాలం లో గోడౌన్ల నిర్మాణం బాగా పుంజుకుంది.అక్కడ సెనగలనుంచి మార్కెట్ విలువలో కొంత శాతం అప్పుగా తీసుకుంటున్నారు.ఇక గత కొన్నేళ్లు గా 4,5 వేల మధ్య ఉన్న బస్తా ధర 9 వేలకు ఇటీవల చేరినందున ఒక మోస్తరు రైతులు 2,3 ఏళ్ల నుంచి దాచిన పంటను అమ్మారు.
ఇక ఇప్పుడు బడా వ్యాపారులు వచ్చారు...వేలాది బస్తాల ధాన్యం కొనుగోలు చేసి హఠాత్తుగా మాయమయ్యేవారు,IP పెట్టేవారికీ కొదవలేదు.ఇక ఎక్కడా ఈ అమ్మకం,కొనుగోళ్లలో లెక్కాపత్రం,రసీదులు ఉండవు.
ప్రస్తుతం మన ప్రధాని నిర్ణయంతో రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు...వచ్చిన డబ్బు ఇంట్లో పాత ఇనప్పెట్టెల్లో పెట్టారు మరి..ఒక్కసారి బ్యాంకుల్లో వేస్తే నల్లధనం అని మా తోలు తీయరా అని కొందరు.....కొందరికి వడ్డీలకిచ్చాము,కొత్త నోట్లు ఎప్పుడు రావాలి,మా అప్పు వాళ్లెన్నడు తీర్చాలి అంటూ మరికొందరు....
ఇప్పటికే పంట సాగుచేస్తున్నాం దీనికి పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలి?ఇంట్లో బంగారం కుదువ పెట్టినా బ్యాంకులు డబ్బిస్తారా అని ఇంకొందరు....
సరే అన్ని అడ్డంకులూ దాటి పంట చేతికొచ్చాక యధాప్రకారం ధరల ఆటుపోట్లున్నా కొనేవారుంటారా?అసలు మా మొహాలకు రసీదులిచ్చిందెవరని రైతన్నల దిగులు....
వ్యవసాయం జూదంగా మారడం కాదు..వ్యాపారులే పెద్ద జూదం ఆడుతున్నారు...ప్రస్తుతం ఈ వ్యాపారుల్లో సాంప్రదాయ వ్యాపారులకన్నా అధికంగా ప్రభుత్వోద్యోగులు,ఉపాధ్యాయులు ఉన్నారంటే నమ్మగలరా?
రసీదులు లేని ఈ వ్యాపారం గాడిన పడేనా?
నిన్న గోదావరి జిల్లాలో మాట్లాడుతూ భాజపా అధ్యక్షుడు అమిత్ షా రైతులకోసం ప్రధాని ఫసల్ భీమా యోజన తెచ్చామన్నారు...నిజానికి అదెక్కడ అమలవుతోందో!అంతెందుకు మొన్నటికి మొన్న జల ఫిరంగులంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో చేసిన హడావుడికి బ్యాంకులు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడానికే వెనకాడుతున్నాయి.....
ఇది ఒక్క సెనగ రైతుల గురించి చెప్పాను..మిగిలిన పంటల కొనుగోళ్లూ ఇంతకంటే భిన్నమేం కాదు.మరి రాబోయే రోజుల్లో దళారీలు లేకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందా??
రైతులకు అచ్చే దినాలొ..యధాప్రకారంగా చచ్చే దినాలో కాలమే చెప్పాలి.... అమిత్ షా మొత్తానికి సెనగలు తిని చెయ్యి కడిగినంత సుళువుగా చెప్పారు....