మనిషి జీవితం లో ఉద్యోగం చాలా విలువైనది. అయితే జీవితం అంతకంటే విలువైనది.
undefined
ఈ ప్రపంచం లో కొద్దిమంది మాత్రమే జీవితానికి అనుగుణంగా వుండేలాగున ఉద్యోగాల్ని మార్చుకుంటారు. చాలా మంది ఉద్యోగాలకు అనుగుణంగా వుండేలాగున జీవితాల్ని మార్చుకుంటారు. ఉద్యోగాన్ని మార్చడమంటే ఏమిటి? ఒక ఉద్యోగం లో మనకు నచ్చని అంశాలనీ, అసౌకర్యాలనీ మార్చి ఆ ఉద్యోగాన్ని మనకు అనుకూలంగా వుండేట్లు మార్చుకోవడమా? లేక ఆ ఉద్యోగాన్నే మార్చేసి మరో ఉద్యోగంలో చేరడమా?
ఎక్కడో ఒక మానసిక వికాసపు పుస్తకం లో చదివాను. “మీరు ప్రేమించే ఉద్యోగాన్నే చేయండి “ అనే వాక్యానికి వ్యతిరేకమేమిటీ? అని. చాలామంది దీనికి వ్యతిరేకం “మీరు ప్రేమించని ఉద్యోగాన్ని చేయకండి” అని జవాబు చెబుతారు. దానికి వ్యతిరేకం అది కాదు(ట). దానికి వ్యతిరేకం “మీరు చేసే ఉద్యోగాన్ని ప్రేమించండి” అని. ఇది సాధ్యమా?
ఎంతమంది చేసే ఉద్యోగాలను ప్రేమిస్తున్నారు? ఎంతమంది గత్యంతరం లేక ఈసురో మంటూ ఉద్యోగాలు చేస్తున్నారు? అసలు ప్రేమింపబడే ఉద్యోగం ఎలావుంటుంది? అద్భుతమైన ఉద్యోగం అంటే ఏమిటి?
మనం చేసే ఉద్యోగానికి ఒక అర్థం ఉండాలి. చేసే పనిలో ఆనందం ఉండాలి. ఎంత వెదికినా, ఉద్యోగానికి ఒక అర్థమూ, చేసే పనిలో ఆనందమూ కనిపించకపోతే మనం ఓ కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి.
జీత భత్యాలూ, మంచి పని ప్రదేశం, సంస్థలో సహోద్యోగులతో, అధికారుల్తో మంచి సంబంధ బాంధవ్యాలూ, ఇవన్నీ పారిశుధ్ధ కారకాలు, ఇవి పెరిగితే ఉద్యోగుల్లో ఉత్సాహం కలుగుతుంది కానీ అది ఆశించినంతగా ఉండదు. అయితే ఈ కారకాలు తగ్గితే మాత్రం ఉద్యోగులు అమితమైన నిరుత్సాహానికి గురి అవుతారు.
ఈ అంశాలు కొద్ది కాలం మాత్రమే ఉద్యోగాల్లొ ఉత్సాహాన్ని కలిగించగలవు. ఒక ఉద్యోగిలో నిజంగా ఉత్సాహం కలిగించే అంశాలు పనిలో కొత్తదనం (కొత్తవిషయాలు నేర్చుకోవాలనే తపన, పనిలోని సవాళ్లూ), వృత్తిలో ఎదుగుదలా మాత్రమే. ఇవి వుంటే అదొక అధ్బుతమైన ఉద్యోగం అవుతుంది. మనం చేసే ఉద్యోగం అద్భుతమైనదైతే మనకు ఒక్క రోజు కూడా పనిచేసినట్లు అనిపించదు.
లేదా ఒక ఉద్యోగం చేయడం వల్ల మనం ఏదైనా సాధిస్తున్నాం అన్న తృప్తి ఉంటే అది కూడా అధ్బుతమైన ఉద్యోగమే అవుతుంది. ఈ ఉద్యోగస్తులు ఇతరులనుండి వచ్చే ప్రశంశలకు పాత్రులవుతారు. ఆ ప్రశంశలు వారిలో ఉత్సాహాన్ని కలుగచేస్తాయి. ఉద్యోగపు అలసట కనిపించదు. ఇటువంటి ఉద్యోగాల్లో చిన్నవీ పెద్దవీ వుండవు. చిన్న ఉద్యోగాలు కూడా అద్భుతంగా వుండవచ్చు. ఉదాహరణకి పెద్ద పెద్ద మాల్స్ లో పనిచేసే సహాయకారులు, తమ ఖాతాదారుల సంతృప్తి చూసినప్పుడు ఆనందపడిపోతుంటారు. ప్రతిరోజూ వీరికొక కొత్తరోజే.
అయితే ఇది మనమీదే ఆధార పడి వుంది. ఇతరత్రా ఏలాంటి లోపాలు లేకపోయినా మనం చేసే ఉద్యోగం మనకు గొప్పగా అనిపించకపోతే ఆ ఉద్యోగం చేయడం కష్టం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటల్లో “ఒక వీధులు ఊడ్చే వాడు వీధి ని ఊడిస్తే అదొక మైకేల్ అంజెలో చిత్రం లాగా, బీథోవెన్ సంగీతం లాగా, షేక్ స్పియర్ కవితలాగా అనిపించాలి. మనుష్యులూ దేవతలూ మొత్తం ఆ వీధి దగ్గర ఆగి ‘ఓహో !’ అనుకుని ఇక్కడ తన పని చాలా చక్కగా చేసే ఓ గొప్ప వీధులు ఊడ్చే వాడుండేవాడు అనుకోవాలి”.
ఇవి కాక పోతే ఏదైనా ఉద్యోగం మనకు సంఘంతో దాన్లో ఉన్న అద్భుతమైన వ్యక్తుల్తో కలిసి సంబంధ బాంధవ్యాలు పెంచుకునే అవకాశాన్ని కలిగిస్తే అదికూడా గొప్ప ఉద్యోగమే అవుతుంది. డాక్టర్లూ, టీచర్లూ, లెక్చరర్లూ, శిక్షణ నిచ్చే ఉద్యోగాల్లొ ఇలాంటి అవకాశాలుంటాయి.
మనం చేసే ఉద్యోగం పైన చర్చించినట్లు ఒక అద్భుత ఉద్యోగం కాకపోతే మన జీవితానికీ, వృత్తికీ మధ్య తుల్యతనిచ్చే ఉద్యోగం చేయాలి. అంటే జీవితం లోని సమయమంతా ఉద్యోగానికే కాకుండా, కుటుంబానికి కూడావెచ్చించ గలిగే అవకాశం వున్న ఉద్యోగాన్ని చేపట్టాలి. అటువంటి ఉద్యోగం జీవితం లో ఒక భాగమవుతుంది కాని విడిగా వుండదు.
జీవితం లో మనకు నచ్చని చాలా విషయాల్లాగే ఉద్యొగం కూడా ఒకటుంటుంది. దీనివల్ల గొప్ప హాని జరుగదు.
మనలో చాలా మందికి ఈ తుల్యత లేక పోవడం వల్ల ఉద్యోగం దుర్భరంగా తయారవుతుంది. కుటుంబం తో సమయం గడపలేక పోవడమన్న విషయం కొంతకాలం తరువాత మనలో విసుగు, నిస్పృహ కలుగచేసి ఉద్యోగమంటే ఏవగింపు కలుగ చేస్తుంది. కుటుంబం పట్ల, పిల్లల పట్ల బాధ్యతలు నెరవేర్చలేని ఈ స్థితి పెద్ద మొత్తం లో సాంఘిక జీవనానికే హానికారి అవుతుంది.
ఇలాంటప్పుడు అన్నీ సవ్యంగా అమరేలాగున ఉద్యోగాన్ని చేపట్టాలనుకుంటే కొన్ని త్యాగాలు చేయాలి. తక్కువ జీతం, తక్కువ హోదా, పేరులేని సంస్థలూ, పైకెదగడంలో నెమ్మది వీటితో సరిపెట్టుకోవాలి.
ఉద్యోగంలో డబ్బు సంపాదించడం ముఖ్య పాత్ర వహిస్తుందా? అవును. కాని ఇది కొంత వరకు మాత్రమే. డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు. ఈ విషాయాలన్నీ ఆలోచించి ప్రణాళికను సరిగ్గా రూపొందించి అద్భుతమైన ఉద్యోగాన్ని చేపట్టండి. లేదా చేపట్టిన ఉద్యోగాన్ని అద్భుతంగా మార్చుకోండి.
ఇతరుల కోసం పనిచేస్తున్నామన్న భావన మనలో వుండకూడదు. దాని వల్ల ఉద్యోగ భద్రత లోపిస్తుంది. మన వృత్తిని నడిపే శక్తి మనలోనుండే రావాలి. ఉద్యోగాలు సంస్థలకు స్వంతమైతే, వృత్తి అనేది మనకు స్వంతం.