నాగర్‌కోటి యార్కర్ దెబ్బకి కిందపడిన దినేశ్ కార్తీక్... ఈ సీజన్‌ నుంచి మరో నటరాజన్ వస్తాడా...

By Chinthakindhi RamuFirst Published Sep 19, 2021, 5:10 PM IST
Highlights

ప్రాక్టీస్ సెషన్‌లో దినేశ్ కార్తీక్‌కి నాగర్‌కోటీ బౌలింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... అద్భుతమైన యార్కర్లతో ఆకట్టుకున్న నాగర్‌కోటి...

ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా టీమిండియాలోకి దూసుకొచ్చాడు యార్కర్ కింగ్ నటరాజన్. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిన నటరాజన్, ఒకే టూర్‌లో వన్డే, టీ20, టెస్టుల్లో ఆరంగ్రేటం చేసి అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకి దూరమయ్యాడు...

అయితే కేకేఆర్ యంగ్ బౌలర్ కమ్లేష్ నాగర్‌కోటీలో మళ్లీ అలాంటి ఛాయలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆకట్టుకునే బౌలింగ్ వేసిన నాగర్‌కోటీ, కీలక మ్యాచుల్లో ఒత్తిడిని జయించలేక ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి భారీగా పరుగులు ఇచ్చాడు.

ఐపీఎల్ 2020లో 10 మ్యాచుల్లో 5 వికెట్లు తీసిన నాగర్‌కోటీ, ఈసారి కేవలం ఒకే మ్యాచ్ ఆడి, రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు... అయితే ఆ లోపాలను సరిచేసుకుని, ఈసారి ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో మెరిసి, టీమిండియాలో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు నాగర్‌కోటి...

కేకేఆర్ క్యాంపు ప్రాక్టీస్ సెషన్‌లో దినేశ్ కార్తీక్‌కి నాగర్‌కోటీ బౌలింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. మొదటి బంతికి బౌండరీ సమర్పించిన కమ్లేష్ నాగర్‌కోటీ, ఆ తర్వాత అద్భుతమైన యార్కర్‌తో దినేశ్ కార్తీక్‌ను ఇబ్బందిపెట్టాడు.

నాగర్‌కోటీ వేసిన యార్కర్‌ను ఎదుర్కోవడంలో తలబడిన దినేశ్ కార్తీక్, బ్యాలెన్స్ తప్పి క్రీజులో కిందపడిపోయేవాడే... కేకేఆర్ ప్రధాన బౌలర్ ప్యాట్ కమ్మిన్స్, ఫేజ్‌2లో అందుబాటులో ఉండడం లేదు. దీంతో స్వదేశీ ఫాస్ట్ బౌలర్లపైనే ప్రధానంగా ఆధారపడనుంది కేకేఆర్.

ప్రస్తుతం వారికి ప్రసిద్ధ్ కృష్ణ, శివమ్ మావి, కమ్లేష్ నాగర్‌కోటి వంటి యంగ్ పేసర్లపైనే భారీగా ఆశలున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచుల్లో రెండు మ్యాచులు మాత్రమే గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో కచ్ఛితంగా ఐదింట్లో విజయం సాధించాల్సి ఉంటుంది..

click me!